Dear Megha Review: రివ్యూ: డియర్‌ మేఘ

Dear Megha: మేఘా ఆకాష్‌ కీలక పాత్రలో నటించిన ‘డియర్ మేఘ’సినిమా ఎలా ఉందంటే?

Updated : 03 Sep 2021 12:00 IST

చిత్రం: డియ‌ర్ మేఘ‌; న‌టీన‌టులు: మేఘా ఆకాష్‌, అరుణ్ అదిత్‌, అర్జున్ సోమ‌యాజులు, ప‌విత్ర లోకేష్; సంగీతం: హ‌రి గౌర; ఛాయాగ్ర‌హ‌ణం: ఐ.ఆండ్రూ; నిర్మాత‌: అర్జున్ దాస్య‌న్‌; ద‌ర్శ‌క‌త్వం: ఎ.సుశాంత్ రెడ్డి; విడుద‌ల తేదీ: 03-09-2021

విడుద‌ల‌కు ముందే  పాట‌లు, ప్ర‌చార చిత్రాల‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన చిత్రం ‘డియ‌ర్ మేఘ‌’. క‌న్న‌డ‌లో విజ‌య‌వంత‌మైన ‘దియా’కు రీమేక్‌గా రూపొందింది. టైటిల్ పాత్ర‌ను మేఘా ఆకాష్ పోషించ‌గా.. అరుణ్ అదిత్‌, అర్జున్ సోమ‌యాజులు క‌థానాయ‌కులుగా న‌టించారు.  ఎ.సుశాంత్ రెడ్డి తెర‌కెక్కించారు. ‘‘మ‌న‌సుల్ని బ‌రువెక్కించే హృద్య‌మైన‌ ప్రేమ‌క‌థ’’ అంటూ ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చిన ఈ చిత్రం.. అందుకు త‌గ్గ‌ట్లుగానే ఆక‌ట్టుకుందా?  బాక్సాఫీస్ ముందు హిట్ మాట వినిపించుకుందా?

క‌థేంటంటే: మేఘ స్వరూప్ (మేఘా ఆకాష్‌) కాలేజీలో త‌న సీనియ‌ర్ అర్జున్ (అర్జున్ సోమ‌యాజులు)ని ప్రేమిస్తుంది. త‌న మ‌న‌సులోని మాట‌ను అత‌నికి ఎన్నోసార్లు చెప్పాల‌ని ప్ర‌య‌త్నిస్తుంది.  కానీ, ధైర్యం చాల‌క ప్ర‌తిసారి ఆగిపోతుంటుంది.  ఈలోపు అర్జున్ కాలేజీ వ‌దిలి సింగ‌పూర్ వెళ్లిపోతాడు.  మూడేళ్ల త‌ర్వాత అర్జున్ ముంబ‌యిలో మేఘ ముందు ప్ర‌త్య‌క్ష‌మ‌వుతాడు. కాలేజీ రోజుల్లోనే తాను కూడా ప్రేమించిన‌ట్లు చెప్పి.. మేఘకు  షాకిస్తాడు. త‌ర్వాత ఇద్ద‌రూ ప్రేమ‌లో మునిగిపోతారు. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదంలో అర్జున్ మేఘకు దూరమవుతాడు. అత‌న్ని మ‌ర్చిపోలేక ఓరోజు మేఘ ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్పడుతుంది. అదే స‌మ‌యంలో ఆమె జీవితంలోకి వస్తాడు ఆది(అరుణ్ అదిత్) అత‌ని స్నేహంతో ఆమె జీవితం మ‌ళ్లీ కొత్త‌గా చిగురిస్తుంది. ఈ ఇద్ద‌రి స్నేహం ప్రేమ‌గా మారుతున్న స‌మ‌యంలో అర్జున్ బతికే ఉన్నాడని తెలుస్తుంది. ఆ తర్వాత కథ ఎలాంటి మలుపు తిరిగింది? అర్జున్ , ఆదిలలో మేఘ ఎవరి ప్రేమను పొందిందో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే: ఇదొక ముక్కోణ‌పు ప్రేమ‌క‌థ‌. నిజానికి ఇలాంటి క‌థ‌లు తెలుగు తెర‌కు కొత్తేమీ కాదు. కాక‌పోతే ఇందులో ప్రేమ‌క‌థ‌ను కొత్త‌గా క‌థానాయిక కోణం నుంచి న‌డిపించే ప్ర‌య‌త్నం బాగుంది. మాతృక‌తో పోల్చి చూసిన‌ప్పుడు ద‌ర్శ‌కుడు ఆ క‌థ‌ని ఎలాంటి మార్పులు చేర్పులు చేయ‌కుండా య‌థాత‌థంగా చూపించిన‌ట్లు అర్థ‌మ‌వుతుంది. వాస్త‌వానికి ఇలాంటి సున్నిత‌మైన  ప్రేమ‌క‌థ‌ల్ని ముట్టుకున్న‌ప్పుడు.. ఆ క‌థ‌లోని ఫీల్‌ను య‌థాత‌థంగా క్యారీ చేయ‌గ‌ల‌గ‌డం ఎంతో ముఖ్యం. ఆ విష‌యంలో ద‌ర్శ‌కుడు కాస్త త‌డ‌బ‌డ్డాడ‌నే చెప్పాలి. మేఘా రైలు ప‌ట్టాల‌పై  ఆత్మ‌హ‌త్య‌కు సిద్ధ‌మ‌వుతున్న స‌న్నివేశంతో సినిమా ఆస‌క్తిక‌రంగా మొద‌ల‌వుతుంది. అక్క‌డి నుంచి నెమ్మ‌దిగా ఆమె క‌థ‌లోకి తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేస్తాడు ద‌ర్శ‌కుడు.

కాలేజీలో మేఘ చాటుమాటుగా అర్జున్ వెంట‌ప‌డటం.. దూరంగా ఉంటూనే అత‌న్ని ఆరాధిస్తుండ‌టం వంటి స‌న్నివేశాల‌తో సాదాసీదా సాగిపోతుంటాయి. మేఘ-అర్జున్‌ల లవ్ ట్రాక్ లో పెద్దగా ఫీల్ అనిపించదు. ఎప్పుడైతే ఆది మేఘ జీవితంలోకి వస్తాడో అప్పటి నుంచి కథనంలో వేగం పెరుగుతుంది.  స్నేహితుల మధ్య ఆకర్షణ ప్రేమగా మారడం, ఆ ప్రేమను వ్యక్తపరుచుకోడానికి పడే తపన ప్రేమికులకు బాగా నచ్చుతుంది. ఆది తన తల్లికి రాసిన లెటర్ చదివే విధానం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ప్రథమార్ధం కంటే ద్వితీయార్ధంలోనే ప్రేక్షకుడు కొంత సినిమాపై ప్రేమను ఫీలవుతాడు.

ఎవ‌రెలా చేశారంటే: ఈ కథను తమ భుజాలపై మోసికెళ్లారు మేఘ, అదిత్.  మేఘ చక్కటి భావోద్వేగాలను పండించి మేఘ స్వరూప్ పాత్రకు ప్రాణం పోసింది. ఆద్యంతం ప్రేమను ఫీలయ్యే అమ్మాయిగా తనలోని సంఘర్షణను తెరపై ఆవిష్కరించింది. ఆది పాత్రలో అరుణ్ అదిత్ చలాకీ కుర్రాడిగా చక్కగా ఒదిగిపోయాడు. ప్రేమికుడిగా తన నటన సాధాసీదాగా అనిపించినా... తల్లితో వచ్చే సన్నివేశాల్లో అదిత్ నటన ఫర్వాలేదనిపిస్తుంది. అర్జున్ సోమయాజులు తన నటన పట్ల మరింత దృష్టి పెట్టాల్సింది. లక్కీ పాత్రలో నటించిన పవిత్ర లోకేష్ తల్లి పాత్రలో ఎప్పటిలాగే చేసుకుంటూపోయారు.

దర్శకుడు సుశాంత్ రెడ్డి టేకింగ్ బాగుంది. మాతృకను చెడగొట్టకుండా చిన్నచిన్న మార్పులతో కథనాన్ని చక్కగా తీర్చిదిద్దారు. మేఘా, ఆదిల మధ్య వచ్చే సంభాషణలతోపాటు ప్రేమను వ్యక్తపరిచే సందర్భంలో ఒక టచ్ వేయి పదాలతో సమానమనే మాటలు నవతరం ప్రేమికుల మనసును తాకుతాయి. హరిగౌర పాటలు, నేపథ్య సంగీతం డియర్ మేఘాకు బలాన్ని చేకూర్చాయి. ప్రతి సన్నివేశానికి ప్రాణం పెట్టినట్టు కనిపించింది. ఆండ్రూ కెమెరా చిత్రీకరించిన దృశ్యాలు కనువిందుగా ఉన్నాయి. సాంకేతికంగా, నిర్మాణ పరంగా డియర్ మేఘా ఫర్వాలేదనిపిస్తుంది.

బ‌లాలు

+ మేఘ, అరుణ్‌ల నటన

+ పాటలు

బ‌లహీన‌త‌లు

- కథ

- నెమ్మదిగా సాగే కథనం

చివ‌రిగా: డియర్ మేఘ... రొటీన్ లవ్ స్టోరీ.. కొన్ని ఫీల్‌గుడ్‌ సన్నివేశాలతో...

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని