Kalki 2898 AD: ఎన్టీఆర్‌ పెట్టిన పేరు.. భారీ చిత్రాలకు మారుపేరు ‘వైజయంతీ మూవీస్‌’

Vyjayanthi Movies: భారీ అంచనాల మధ్య ప్రభాస్‌, నాగ్‌ అశ్విన్‌ల ‘కల్కి 2898 ఏడీ’ విడుదలవుతున్న నేపథ్యంలో ఆ సినిమాను నిర్మించిన ‘వైజయంతీ మూవీస్‌’ గురించి ఆసక్తికర విషయాలు..

Updated : 25 Jun 2024 18:34 IST

kalki 2898 ad: ఇండస్ట్రీలో చాలా మంది సినీ నిర్మాతలు ఉన్నా, ఆయన సినిమా తీస్తున్నారంటే, చిత్ర పరిశ్రమ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. రూ.100తో టికెట్‌ కొంటే ప్రేక్షకుడు రూ.200 ఆనందాన్ని పొందుతాడు. సినిమా నిర్మాణం విషయంలో రాజీపడరు కాబట్టే, జయాపజయాలతో సంబంధం లేకుండా 50ఏళ్ల పాటు ఇండస్ట్రీలో ఉంటూ తనదైన ముద్రవేయగలిగారు. ఆయనే భారీ చిత్రాల నిర్మాత సి.అశ్వనీదత్‌ (Aswani Dutt). ఆ బ్యానర్‌ ‘వైజయంతీ మూవీస్‌’ (Vyjayanthi Movies). ప్రభాస్‌ (Prabhas) కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్‌ వరల్డ్‌మూవీ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) జూన్‌ 27న ప్రేక్షకుల (kalki 2898 ad release date) ముందుకు రానుంది. ఈ క్రమంలో వైజయంతీ బ్యానర్‌ ప్రయాణం ఎలా సాగిందో చూద్దాం!

అలా ‘వైజయంతీ మూవీస్‌’ వచ్చింది

సావరీన్‌ సినీ ఎంటర్‌ప్రైజెస్‌ అనే బ్యానర్‌పై సినీ నిర్మాణ రంగంలో అడుగులు వేశారు అశ్వనీదత్‌. అయితే, ఎప్పటికైనా అభిమాన కథానాయకుడు ఎన్టీఆర్‌తో నిర్మాతగా సినిమా తీయాలన్నది ఆయన కల. అలా ఒక రోజు ఎన్టీఆర్‌ (NTR) దగ్గరకు వెళ్లి కాల్షీట్స్‌ కావాలని అడిగారు. ‘నువ్వొక మంచి సినిమా తీశావు. నేను చూశాను. చాలా బాగుంది కదా. సినిమాలు వద్దు. వెళ్లిపో’ అన్నారట. ‘లేదండీ.. మీతో సినిమా తీయడానికే ఇండస్ట్రీకి వచ్చా. ఆ సినిమా ద్వారా మిమ్మల్ని కలిసి, మీతో చేయాలని అనుకుంటున్నా’ అని రెండు మూడు వారాలు వదిలి పెట్టకుండా అశ్వనీదత్‌ తిరిగితే ఎట్టకేలకు అంగీకరించారు.

కాల్షీట్స్‌ రాయడానికి వెళ్తే, ‘మన బ్యానర్‌ పేరు ఏంటి’ అని ఎన్టీఆర్‌ అడగ్గా, ‘ఇంకా ఏమీ పెట్టలేదండీ. మీరు పెడితే బాగుంటుంది’ అని అశ్వనీదత్‌ చెప్పారు. ఒకసారి అటూ ఇటూ చూసిన ఎన్టీఆర్‌కు కృష్ణుడి గెటప్‌లో ఉన్న తన ఫొటో కనిపించింది. వెంటనే ‘కృష్ణుడి మెడలో ఉన్న దండ పేరు వైజయంతీ మాల. అది ఎప్పటికీ వాడిపోదు. ఎప్పుడూ విజయంతోనే ఉంటుంది. వైజయంతీ మూవీస్‌ అని పెడదాం’ అని పెట్టారు. అప్పటి నుంచి కొంతకాలం రాధాకృష్ణుల లోగోతో సినిమాలు తీశారు. ఆయన సినీ పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి వెళ్తున్నానని చెప్పిన తర్వాత అప్పుడు ఆయన ఫొటోను లోగోగా మార్చారు. ఎన్ని మార్పులు చేసినా, ఇప్పటికీ అదే లోగోను ‘వైజయంతీ మూవీస్‌’ కొనసాగిస్తోంది.


రాఘవేంద్రరావుతో ప్రత్యేక అనుబంధం

ఎన్టీఆర్‌తో వరుసగా ‘ఎదురులేని మనిషి’. ‘యుగ పురుషుడు. చిత్రాలు చేశారు. ఇవి బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. ఆ తర్వాత వచ్చిన ఒకట్రెండు చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద ఫర్వాలేదనిపించినా, రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన చిత్రాలు ఘన విజయాలను నమోదు చేశాయి. వీరిద్దరూ కలిసి ‘అడవి సింహాలు’, ‘అగ్నిపర్వతం’, ‘ఆఖరి పోరాటం’, ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘అశ్వమేథం’ చిత్రాలు తీశారు. ఆ తర్వాత రాఘవేంద్ర మూవీ కార్పొరేషన్‌ బ్యానర్‌ పెట్టి, ‘పెళ్లి సందడి’, ‘పరదేశి’, ‘గంగోత్రి’ ఇలా చాలా సినిమాలు నిర్మించారు. వీటిల్లో ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌లో వచ్చిన చిత్రాల్లో కలికితురాయిగా చెప్పవచ్చు. ఏపీలో తుపాను తాకిడిని కూడా తట్టుకుని కాసుల వర్షాన్ని కురిపించింది.


మహేశ్‌ను పరిచయం చేసి, ఎన్టీఆర్‌కు హిట్‌ ఇచ్చి..

ప్రస్తుతం ఉన్న అగ్ర కథానాయకులైన మహేశ్‌ను, అల్లు అర్జున్‌లను పరిచయం చేసిన ఘనత అశ్వనీదత్‌కు దక్కుతుంది. ముఖ్యంగా ‘రాజకుమారుడు’తో మహేశ్‌ తొలి చిత్రంతోనే హిట్‌ అందుకున్నారు. కృష్ణకు సొంత నిర్మాణ సంస్థ ఉన్నా, ‘నువ్వు - రాఘవేంద్రరావు కలిసి మహేశ్‌ను హీరోగా పరిచయం చేస్తే బాగుంటుంది’ అని అశ్వనీదత్‌కు సూచించారట. అలాగే అల్లు అర్జున్‌ ‘గంగోత్రి’ కూడా అనుకోకుండా పట్టాలెక్కింది. అసలు ఈ మూవీని అల్లు అర్జున్‌తో చేద్దామనుకోలేదు. చిన్ని కృష్ణ కథ సిద్ధం చేసిన తర్వాత హీరో కోసం అన్వేషణ మొదలు పెట్టారు. అదే సమయంలో దర్శకుడు తేజతో బన్ని సినిమా చేయాల్సింది. అయితే, అది పట్టాలెక్కపోవడంతో ‘గంగోత్రి’ మొదలైంది.

చిరంజీవి తనయుడు రామ్‌చరణ్‌ను సైతం ‘చిరుత’తో అశ్వనీదత్‌ లాంచ్‌ చేశారు. ఇక స్వప్న సినిమాస్‌ బ్యానర్‌పై ‘స్టూడెంట్‌ నెం.1’తో జూ.ఎన్టీఆర్‌ తొలి హిట్‌ అందుకున్నారు. ఇదే బ్యానర్‌పై తారకరత్న హీరోగా వచ్చిన ‘ఒకటో నెంబర్‌ కుర్రాడు’ కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై వచ్చిన ‘చూడాలని ఉంది’, ‘ఇంద్ర’, ‘కంపెనీ’ (హిందీ), ‘సీతారామం’ వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాలు కూడా ఉన్నాయి. ఇవే కాదు, అశ్వనీదత్‌ సమర్పకుడిగా, సహ నిర్మాతగా చేసిన ‘పెళ్లి సందడి’, ‘శుభలగ్నం’ చిత్రాలతో పాటు, ‘కుమారి శ్రీమతి’ వెబ్‌ సిరీస్‌ను కూడా ప్రేక్షకులకు అందించారు.


అవార్డులు, రివార్డులు తెచ్చిన ‘మహానటి’

ప్రజలకు ఎంతో సుపరిచితులైన వ్యక్తుల కథలను వెండితెరపై ఆవిష్కరించడం మామూలు విషయం కాదు. పైగా కమర్షియల్‌ వాల్యూస్‌ లేకుండా అలాంటి సినిమాల జోలికి నిర్మాతలు పోరు. కానీ, అలనాటి దిగ్గజ నటి సావిత్రి బయోపిక్‌ ‘మహానటి’ తీసి బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని నమోదు చేయడమే కాకుండా, జాతీయ అవార్డులను ‘వైజయంతీ మూవీస్‌’ అందుకుంది. సావిత్రి బయోపిక్‌ చూసినవారందరూ ఆమెకు నిజమైన నివాళి ఇచ్చారంటూ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌తో పాటు, వైజయంతీ మూవీస్‌పై ప్రశంసల జల్లుకురిపించారు.


రూ.6 కోట్లతో తీస్తే రూ.70 కోట్లు వసూలు

స్వప్న మూవీస్‌ బ్యానర్‌పై (Swapna Dutt, Priyanka Dutt) వచ్చిన ‘జాతిరత్నాలు’ ఓ ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. యువతను ఆకట్టుకోవడమే కాకుండా, బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. సినిమా విడుదలకు ముందే  ఓటీటీ స్ట్రయిట్‌ రిలీజ్‌ చేస్తాం అంటూ.. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వాళ్లు రూ.22 కోట్లకు అడిగినా, అనుదీప్‌ మీద ఉన్న నమ్మకంతో నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) ఆ ప్రతిపాదన ముందుకు వెళ్లనీయకుండా థియేటర్లలో విడుదల చేసేలా అశ్వనీదత్‌ను ఒప్పించారు. ఫలితమే రూ.6 కోట్లతో నిర్మిస్తే ఏకంగా రూ.70 కోట్లు వసూలు చేసింది.


రజనీకాంత్‌ చెప్పినా వినలేదు

ఇండస్ట్రీ హిట్‌లు ఇచ్చిన వైజయంతీ మూవీస్ బ్యానర్‌ కొన్ని అపజయాలను చవి చూసింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ‘అశ్వమేథం’, ‘గోవిందా గోవిందా’, ‘రావోయి చందమామ’, ‘సుభాష్‌ చంద్రబోస్‌’, ‘కథానాయకుడు’, ‘శక్తి’ తదితర చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద ఆ అంచనాలు అందుకోలేకపోయాయి. వీటిల్లో ఎన్టీఆర్‌ నటించిన ‘శక్తి’ అశ్వనీదత్‌ను బాగా నిరాశపరిచింది. ‘శక్తి పీఠాల’ నేపథ్యంలో మూవీ వద్దని రజనీకాంత్‌ చెప్పినా అశ్వనీదత్‌ వినలేదు. ‘అసలు శక్తి పీఠాల గురించి మీకేం తెలుసు’ అని అశ్వనీదత్‌ సతీమణి అడిగినా, కథ బాగుందని ధైర్యం చేసి తీశారట. దాని ఫలితమే భారీ చిత్రాలు తీసే అశ్వనీదత్‌ కొన్నాళ్లు విరామం తీసుకోవాల్సి వచ్చింది.

‘ప్రాజెక్ట్‌ కె’ పేరుతో మొదలు పెట్టిన ‘కల్కి 2898 ఏడీ’ మూవీలో మళ్లీ పాన్‌ ఇండియా స్థాయి మూవీని తీసి, ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇప్పటివరకూ భారతీయ చిత్ర పరిశ్రమలో ఎవరూ టచ్‌ చేయని సబ్జెక్ట్‌తో విజువల్‌ వండర్‌గా ఈ మూవీని తీర్చిదిద్దారు. దాదాపు రూ.600 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీలో అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌ వంటి లెజెండరీ నటులతో పాటు, దీపిక పదుకొణె, దిశా పటానీ, రాజేంద్రప్రసాద్‌, శోభన, పశుపతి.. తదితరులు కీలక పాత్రలు పోషిస్తుండటంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు