Nag Ashwin: రూ. 4 వేల జీతం నుంచి రూ. 600 కోట్ల ‘కల్కి’ వరకు.. నాగ్‌ అశ్విన్‌ జర్నీ ఇదీ

‘సాధారణంగా కనిపించే చాలామంది వ్యక్తుల్లో అసాధారణ ప్రతిభ ఉంటుంది’.. దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ను ఉద్దేశిస్తూ నటుడు కమల్‌ హాసన్‌ చెప్పిన మాటలివి.

Updated : 26 Jun 2024 18:09 IST

‘సాధారణంగా కనిపించే చాలామంది వ్యక్తుల్లో అసాధారణ ప్రతిభ దాగి ఉంటుంది’.. దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ను ఉద్దేశించి నటుడు కమల్‌ హాసన్‌ చెప్పిన మాటలివి. అవును.. సినిమాలకు దూరంగా ఉండేవారెవరైనా ఆయన్ను చూస్తే ‘ఈయన దర్శకుడా?’ అని ఆశ్చర్యపోతారు. అంత సింప్లిసిటీ. రూ.4 వేల రెమ్యూనరేషన్‌ తీసుకునే పరిస్థితి నుంచి రూ.600 కోట్ల బడ్జెట్‌తో సినిమా తెరకెక్కించే స్థాయికి చేరుకున్న ఆయన ప్రయాణం ఆసక్తికరం. ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) గురువారం విడుదల సందర్భంగా ఆ జర్నీ గురించి తెలుసుకుందాం.. 

ఫస్ట్‌ ర్యాంకర్‌ కాదుగానీ..

అశ్విన్‌ (Nag Ashwin)ను చూడగానే మితభాషి అని తెలిసిపోతుంది. కానీ, పనుల్లో ఎవరూ ఊహించనంత చురుగ్గా ఉంటారు. ఆ చొరవే విద్యార్థి దశలో ‘స్కూల్‌ మ్యాగజైన్‌’కు ఎడిటర్‌ను చేసింది. కథనాలు, వ్యాసాలు రాయడం అప్పుడే ప్రారంభించారు. ఓ పరిశోధన కథనం రాసి ప్రిన్సిపల్‌తో చీవాట్లూ తిన్నారు. తన పాఠశాల ఆవరణలో బండరాళ్లు పగలగొడుతూ చెట్లు నరికేస్తుంటే ఫొటోలు తీసి.. ‘ఇక్కడేం జరుగుతోంది? ప్రకృతిని నాశనం చేస్తున్నదెవరు?’ అనే వార్త రాయడమే అందుకు కారణం. పరిసరాలను ఎంత క్షుణ్ణంగా పరిశీలిస్తారో, ప్రకృతిని ఎంతగా ప్రేమిస్తారో దాన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. హీరో రానా దగ్గుబాటి ఈయన క్లాస్‌మేట్‌. నాన్న జయరామ్‌రెడ్డి, అమ్మ జయంతి.. ఇద్దరూ వైద్యులే. వాళ్లు చదువుకునే రోజుల్లో ఫస్ట్‌ ర్యాంకర్లు కావడంతో.. కుమారుడూ అలానే ఉండాలనుకునేవారు. తనయుడు ఫస్ట్‌ రాకపోవడంతో బాధపడేవారు. అలా అని ఆయన అత్తెసరు మార్కులు తెచ్చుకునేవారనుకుంటే పొరపడినట్టే. టాప్‌ టెన్‌ ర్యాంకర్లలో ఒకరిగా ఉండేవారు. ఇంజినీరింగ్‌, మెడిసన్‌ వంటి రెగ్యులర్‌ కోర్సులపై ఇంట్రెస్ట్‌ లేని ఆయన మణిపాల్‌ మల్టీమీడియా కోర్సులో చేరారు.  వీడియో ఎడిటింగ్‌పై పట్టు సాధించారు. మరోవైపు, పేరెంట్స్‌ నుంచి ఫుల్‌ సపోర్ట్‌. కుమారుడు మీడియాలో స్థిరపడతాడేమో అని అనుకున్నారు అశ్విన్‌ అమ్మానాన్న. కానీ, అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కెరీర్‌ని మొదలుపెట్టి.. దర్శకుడిగా ఎదిగి తల్లిదండ్రులు గర్వపడేలా చేశారు.

శేఖర్‌ కమ్ముల శిష్యుడిగా..

ఏవేవో కథలు రాసి వాటికి దృశ్యరూపం ఇవ్వాలనే తనయుడి తపన ఎలాంటిదో తెలిసిన జయంతి.. ఆయన్ను అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా మార్చేందుకు దర్శకుడు శేఖర్‌ కమ్ముల (Sekhar Kammula) దగ్గరికి పంపారు. ‘గోదావరి’ చిత్రీకరణ జరుగుతున్న సమయమది. ‘తర్వాత ప్రాజెక్టుకు కలిసి పనిచేద్దాం’ అన్నది శేఖర్‌ సమాధానం. అప్పటివరకూ ఖాళీగా ఉండడం ఇష్టపడని నాగ్‌.. మంచు మనోజ్‌ హీరోగా తెరకెక్కిన ‘నేను మీకు తెలుసా?’కు ఏడీగా పనిచేశారు. తొలి సంపాదనగా రూ. 4 వేలు అందుకున్నారు.  ‘లీడర్‌’, ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ చిత్రాల విషయంలో శేఖర్‌.. అశ్విన్‌కు ఇచ్చినమాట నిలబెట్టుకున్నారు. నాగ్‌ చేసిన ‘లీడర్‌’ ట్రైలర్‌ కట్‌ శేఖర్‌కు నచ్చడంతో దాన్నే విడుదల చేయడం విశేషం. ‘సినిమాని ఎంత స్నేహపూర్వక వాతావరణంలో తీయొచ్చో ఆయన వద్దే నేర్చుకున్నా’ అని ఓ సందర్భంలో గురువును కొనియాడారు.

తొలి కథ అలా తెరకెక్కింది..

‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ తర్వాత స్నేహితులతో కలిసి ఓ యాడ్‌ తీశారు. ఆ తర్వాత రూపొందించిన లఘు చిత్రం.. ఓ ఫిల్మ్‌ఫెస్టివల్‌ వరకు వెళ్లింది. అదే.. ఆయన వృత్తి, వ్యక్తిగత జీవితాన్ని మార్చేసింది. ఆ షార్ట్‌ఫిల్మ్‌ చూసిన ప్రముఖ నిర్మాత అశ్వనీదత్‌ కుమార్తెలు ప్రియాంక, స్వప్న సినిమా అవకాశాన్ని ఇచ్చేందుకు ముందుకొచ్చారు. ఆ క్రమంలో నాగ్‌ అశ్విన్‌ వారికి ఓ కథ వినిపించారు. మరోవైపు, ‘ఎవడే సుబ్రమణ్యం’ స్క్రిప్టు పూర్తి చేశారు. దానికి తానే నిర్మాతగా మారి తక్కువ బడ్జెట్‌లో తెరకెక్కించాలనుకున్నారు. దీని గురించి తెలిసిన ఆ అక్కాచెల్లెళ్లు ‘సుబ్రమణ్యం..’ను నిర్మించాలని ఫిక్స్‌ అయ్యారు. అలా నాని, విజయ్‌ దేవరకొండ ప్రధాన పాత్రల్లో అశ్విన్‌ తొలి కథ తెరపైకొచ్చింది (2015). ఎదగాలనే ఆశతో మనిషి ఎంత స్వార్థపరుడిగా మారుతున్నాడు? యాంత్రికంగా ఎలా బతుకుతున్నాడో కళ్లకు కట్టినట్టు చూపించిన ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంది. నానికి ముందు ఈ చిత్రంలో నవీన్‌ పొలిశెట్టిని ఎంపిక చేసుకున్నారనేది తక్కువ మందికి తెలిసిన విషయం.

కథకు ఐదేళ్లు..

ఈ తరానికి నటి సావిత్రి గురించి చెప్పాలనే సంకల్పంతో ‘మహానటి’ని తెరకెక్కించారు. రెండో ప్రయత్నంలోనే ఇలాంటి బయోపిక్‌ను ఎంపిక చేసుకోవడం ఓ సాహసం. కీర్తి సురేశ్‌ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు సాధించింది. అలానే విమర్శలూ ఎదుర్కొంది. ‘సావిత్రి జీవితంలో ముఖ్యమైన ఇంకా కొంతమంది గురించి ఈ సినిమాలో ప్రస్తావించలేకపోయాం. అందరినీ చూపించాలంటే మూడు గంటల చిత్రం సరిపోదు. వెబ్‌సిరీస్‌ చేయాలి. వీలైనంత వరకూ ఆమె గౌరవం దెబ్బతినకుండా తీయగలిగాం’ అని అశ్విన్‌ ఓ సందర్భంలో తెలిపారు. మూడో చిత్రమైన ‘కల్కి’ (Kalki 2898 AD) కథ రాసేందుకు 5 ఏళ్లు పట్టింది. సైన్స్‌కు మైథాలజీ జోడించి తెరకెక్కించిన ఈ పాన్‌ ఇండియా మూవీ బడ్జెట్‌ దాదాపు రూ.600 కోట్లు. ప్రభాస్‌ హీరో.

ప్రతీ చిత్రంలో అతిథి పాత్రలు.. అవార్డులు

సినీ ప్రయాణంలో స్నేహితులైన అశ్విన్‌- ప్రియాంకలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి ఓ బాబు. కామెడీ చిత్రాలను ఆస్వాదించే నాగ్‌ ‘జాతి రత్నాలు’ కోసం నిర్మాతగా మారారు. ఆంథాలజీ డ్రామా ‘పిట్ట కథలు’లోని ఓ సెగ్మెంట్‌కు దర్శకత్వం వహించారు. ‘ఎవడే సుబ్రమణ్యం’, ‘మహానటి’లో ఉన్నట్టే ‘కల్కి’లోనూ చాలా అతిథి పాత్రలున్నాయి. కమల్‌ హాసన్‌, అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొణెలాంటి అగ్రనటుల కీలక పాత్రలతోపాటు మరికొందరు తళుక్కున మెరవనున్నారు. తొలి చిత్రంతో స్టేట్‌ (నంది) అవార్డు, రెండో సినిమాతో నేషనల్‌ అవార్డు పొందిన నాగ్‌ అశ్విన్‌, మూడో మూవీతో ఇంటర్నేషనల్‌ అవార్డు అందుకోవాలని సినీ ప్రియులంతా ఆశిస్తున్నారు. ఆల్‌ ది బెస్ట్‌ నాగ్‌ అశ్విన్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని