Prabhas: అప్పుడు భయపడి.. ఇప్పుడు సినీ ప్రపంచాన్నే తనవైపు తిప్పుకొని!

‘కల్కి 2898 ఏడీ’ గురువారం విడుదల కాబోతున్న సందర్భంగా హీరో ప్రభాస్‌ కెరీర్‌పై ప్రత్యేక కథనం..

Updated : 26 Jun 2024 18:18 IST

‘సలార్‌’గా తన అభిమానుల్ని, సినీ ప్రియుల్ని అలరించిన ప్రభాస్‌ ఇప్పుడు ‘భైరవ’గా సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించిన ‘కల్కి 2898 ఏడీ’లోని పాత్ర అది. ఈ సినిమా బాక్సాఫీసు ముందుకు గురువారం రానుంది. ఈ సందర్భంగా ప్రభాస్‌ గురించి కొన్ని సంగతులు..

పాన్‌ ఇండియా చిత్రాలకు నాంది..

నటుడు కృష్ణంరాజు కుటుంబ సభ్యుడు కాబట్టి ప్రభాస్‌ (Prabhas) తెరంగేట్రం తేలిక అయి ఉండొచ్చు. కానీ, స్టార్‌డమ్ ఓవర్‌నైట్‌లో రాలేదు. దాని వెనుక ఎంతో కృషి ఉంది. తొలి చిత్రం ‘ఈశ్వర్‌’ (Prabhas First Movie) షూటింగ్‌ సమయంలో ‘నన్నెవరైనా చూస్తారా? ఇండస్ట్రీలో నేను నిలదొక్కుకోగలనా?’ అని భయపడిన ఆ వ్యక్తే ఇప్పుడు యావత్‌ సినీ ప్రపంచాన్ని తన దిశగా తిప్పుకొన్నారు. ‘కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్‌’ అన్నట్టు.. ప్రభాస్‌ నటనా శిక్షణలో ఉండగానే దర్శకుడు జయంత్‌ సి. పరాన్జీ ఆయన్ను పూర్తిగా నమ్మారు. యాక్టింగ్‌ ట్రైనింగ్‌ పూర్తవకుండానే ‘ఈశ్వర్‌’లో హీరోగా ఎంపిక చేశారు. 2002లో విడుదలైన ఆ సినిమాలోని ప్రభాస్‌ను కొందరు మెచ్చినా ఇంకొందరు ‘సోసో యాక్టర్‌’ అని కామెంట్‌ ఇచ్చారు. రెండో సినిమా ‘రాఘవేంద్ర’ సైతం అనుకున్న స్థాయిలో విజయం అందుకోలేకపోయింది. మూడో ప్రాజెక్టు ‘వర్షం’ (Varsham)తో బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపించారు. ఆ తర్వాత ఆయన రేంజ్‌ మారిన సంగతి తెలిసిందే. ఫలితం ఎలా ఉన్నా విభిన్న కథలు ఎంపిక చేసుకోవడంలో ముందుంటారాయన. స్వయంగా దర్శకుడు కృష్ణవంశే ‘చక్రం’ కాకుండా మరో సినిమా చేద్దామని అంటే.. ‘వర్షం తర్వాత అన్నీ మాస్‌ కథలే వస్తున్నాయి. నటనకు ప్రాధాన్యం ఉన్న ఈ కథే చేద్దాం’ అని ప్రభాస్‌ ముందడుగేయడం గమనార్హం. ఒక్క సినిమా కోసం ఆరేళ్ల సమయాన్నైనా వెచ్చిస్తారనడానికి ‘బాహుబలి’ నిదర్శనం. టాలీవుడ్‌ గురించి ప్రపంచమంతా మాట్లాడుకునేలా చేసిందా చిత్రం. ఆ స్ఫూర్తితోనే ఎన్నో ‘పాన్‌ ఇండియా’ సినిమాలొచ్చాయి. వస్తూనే ఉన్నాయి.

యువ ప్రతిభకు ప్రోత్సాహం..

‘బాహుబలి’ (Baahubali) సిరీస్‌ చిత్రాలతో అంతర్జాతీయంగానూ ప్రభాస్ క్రేజ్‌ మరింత పెరిగింది. దీంతో ఈ హీరో తదుపరి ఏ హలీవుడ్‌ చిత్రమో చేస్తారని, అగ్ర దర్శకులతో కలిసి పని చేస్తారని చాలామంది ఓ అంచనాకు వచ్చేశారు. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ అప్పటికి ఒకే ఒక్క సినిమా అనుభవం ఉన్న యంగ్‌ డైరెక్టర్‌ సుజీత్‌తో ‘సాహో’ను ప్రకటించారు. సుజీత్‌ ఫస్ట్‌ మూవీ ‘రన్‌ రాజా రన్‌’ను మెచ్చిన ప్రభాస్‌ స్వయంగా ‘నాకో సినిమా చేస్తావా’ అని అడగడం విశేషం. మంచి కలెక్షన్స్‌ వచ్చినా ఎందుకో ‘సాహో’ పెద్దగా సౌండ్‌ చేయలేకపోయింది. అయినా ఈ హీరో నైజం మార్చుకోలేదు. తదుపరి సినిమా ఛాన్స్‌నూ దర్శకత్వంలో అంతగా ఎక్స్‌పీరియన్స్‌లేని రాధాకృష్ణ కుమార్‌కు (రాధేశ్యామ్‌) ఇవ్వడం తెలిసిందే. అంతకుముందు ఆ డైరెక్టర్‌ ‘జిల్‌’ సినిమా తీశారు. బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్‌తో చేసిన ‘ఆది పురుష్‌’ నిరాశ పరచగా.. ప్రశాంత్‌ నీల్‌తో చేసిన ‘సలార్’తో ఫ్యాన్స్‌లో జోష్‌ నింపారు. ఆ విజయోత్సాహాన్ని కొనసాగిస్తూ ‘కల్కి’ (Kalki 2898 AD)ని తీసుకొస్తున్నారు. ఈ సినిమా డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ సైతం గతంలో రెండే చిత్రాలు తెరకెక్కించిన సంగతి విదితమే. మరోవైపు, మారుతి దర్శకత్వంలో ‘రాజా సాబ్‌’ (The Raja Saab)లో నటిస్తున్నారు. ‘కన్నప్ప’ (Kannappa)లో అతిథి పాత్ర పోషించారు. సందీప్‌ రెడ్డి వంగా డైరెక్షన్‌లో ‘స్పిరిట్‌’ (Spirit) చేయనున్నారు. ‘సలార్‌ 2’ త్వరలోనే పట్టాలెక్కనుంది.

అందుకే తక్కువ మాటలు..

విజయాలు వచ్చినప్పుడు పొంగిపోకుండా, పరాజయాలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా.. తదుపరి సినిమాపై మరింత శ్రద్ధ పెట్టడం ప్రభాస్‌ పాలసీ. చిరునవ్వే ఆయన ఆయుధం. మాట్లాడడం విషయంలో ఈ పాన్‌ ఇండియా స్టార్‌ అప్పట్లో ఎలా ఉన్నారో ఇప్పటికీ అలానే ఉన్నారనే సంగతి తెలిసిందే. అందుకే.. ‘కల్కి’ ఈవెంట్‌లో ఆయన మూడు నిమిషాలపాటు మాట్లాడితే ‘వావ్‌.. ప్రభాస్‌ సుదీర్ఘంగా మాట్లాడారు. మనం ఈ క్షణాల్ని సెలబ్రేట్‌ చేసుకోవాలి’ అని నటి దీపికా పదుకొణె (Deepika Padukone) సరదాగా పేర్కొన్నారు. కొంతమంది స్నేహితులు, బంధువుల మధ్యే ఈ యాక్టర్‌ బాల్యం గడిచిపోయింది. బయటి వారిని చూసింది తక్కువ. అందుకే కొత్త వ్యక్తుల ముందుకొచ్చినా, కొత్త ప్రదేశమైనా మాట్లాడేందుకు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారాయన. ఓపిక, క్రమశిక్షణ అంటే ఏంటో తన పెదనాన్న కృష్ణం రాజు నుంచి తెలుసుకున్న ప్రభాస్‌.. ‘‘నాకంటే ఎక్కువ విజయాలు సాధించిన వారంతా వినయంగానే ఉంటున్నారు. చిరంజీవి, రజనీకాంత్‌లాంటి వాళ్ల ముందు నేను చిన్నవాడినే’’ అంటుంటారు.

‘కల్కి’ మూవీ వెళ్తున్నారా? ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా?

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని