Sita Ramam: ఓటీటీలో సీతారామం.. స్ట్రీమింగ్ ఎక్కడ.. ఎప్పుడంటే?

దుల్కర్‌ సల్మాన్‌ - మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటించిన అద్భుత దృశ్య కావ్యం ‘సీతారామం’. ఆగస్టు నెలలో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం

Updated : 06 Sep 2022 12:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దుల్కర్‌ సల్మాన్‌ - మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటించిన అద్భుత దృశ్య కావ్యం ‘సీతారామం’ (Sita Ramam). ఆగస్టు నెలలో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణ పొంది బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించింది. త్వరలోనే ఈ సినిమా డిజిటల్‌ వేదికగా సినీప్రియులను అలరించనుంది. ‘అమెజాన్‌ ప్రైమ్‌’ (Amazon Prime) లో సెప్టెంబరు 9 నుంచి తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ మేరకు అమెజాన్‌ ప్రైమ్‌ మంగళవారం వెల్లడించింది.

హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నటి రష్మిక మందన, సుమంత్‌, గౌతమ్‌ మేనన్‌, ప్రకాష్‌ రాజ్‌ కీలక పాత్రలు పోషించారు. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్నా సినిమాస్‌ ఈ సినిమాను నిర్మించింది. ఇటీవలే ఈ సినిమాను హిందీలోనూ విడుదల చేశారు.

‘సీతారామం’ కథేంటంటే..?

ఇండియ‌న్ ఆర్మీకి చెందిన లెఫ్టినెంట్ అధికారి రామ్ (దుల్కర్‌ స‌ల్మాన్‌) (Dulquer Salmaan).. మ‌ద్రాస్ రెజిమెంట్‌లో ప‌నిచేస్తుంటాడు. మాన‌వ‌త్వం ఉన్న వ్యక్తి. అనాథ అయిన రామ్ క‌శ్మీర్‌లో ప్రాణాలు ఎదురొడ్డి దేశం కోసం పోరాటం చేస్తుంటాడు. ఒక మిష‌న్ త‌ర్వాత.. అత‌డు, అతడి బృందం పేరు మార్మోగిపోతుంది. ఆల్ ఇండియా రేడియోలో తానొక అనాథ అని చెప్పిన‌ప్పట్నుంచీ.. అత‌డికి ఉత్తరాలు వెల్లువెత్తుతాయి. పెద్ద కుటుంబం ఏర్పడుతుంది. ఓ అమ్మాయి మాత్రం నీ భార్య సీతామ‌హాల‌క్ష్మి (మృణాల్ ఠాకూర్‌) (Mrunal Thakur) అని సంబోధిస్తూ ఉత్తరాలు రాస్తుంటుంది. ఇంత‌కీ ఈ సీతామ‌హాల‌క్ష్మి ఎవ‌రు?  అనాథ అయిన రామ్‌కు భార్య ఎక్కడినుంచి వ‌చ్చింది? ఆమెని క‌లుసుకునేందుక‌ని వ‌చ్చిన రామ్‌కు ఎలాంటి అనుభ‌వాలు ఎదుర‌య్యాయి? వీళ్లిద్దరి క‌థ‌తో ఆఫ్రిన్‌(ర‌ష్మిక మందన‌) (Rashmika Mandanna)కు సంబంధ‌మేమిటనే ఆసక్తికర కథనాలతో ఈ సినిమా తెరకెక్కింది. రామ్‌, సీతగా దుల్కర్‌, మృణాల్‌ జోడీ అభినయం ప్రేక్షకుల హృదయాలను తాకింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని