47ఏళ్ల క్రితమే మేం పాన్‌ ఇండియా సినిమా తీశాం : షోలే దర్శకుడు రమేశ్‌ సిప్పీ

భారతదేశపు సినిమాకి తార్కాణంగా నిలిచిన షోలే(Sholay) లాంటి సినిమాని 47 సంవత్సరాల క్రితమే తీశామని ఆ సినిమా దర్శకుడు రమేశ్‌ సిప్పీ(Ramesh Sippi) అన్నారు. అప్పట్లోనే...

Published : 02 Sep 2022 23:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారతీయ సినిమా గొప్పతనానికి ప్రతీకగా నిలిచిన షోలే(Sholay) లాంటి సినిమాను 47 సంవత్సరాల క్రితమే తీశామని ఆ సినిమా దర్శకుడు రమేశ్‌ సిప్పీ(Ramesh Sippi) అన్నారు. అప్పట్లోనే భారతదేశ సినిమా ఈ ఘనత సాధించిందని ఆయన పేర్కొన్నారు.

తాజాగా హిందీ మీడియాతో ముచ్చటించిన ఆయన ప్రస్తుత సినిమాల పోకడ గురించి మాట్లాడుతూ...‘ప్రస్తుతం భారతదేశ సినిమా ప్రపంచవ్యాప్తం అవుతోంది. భారతీయ సంస్కృతి సైతం ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతోంది. మన సినిమాలను విదేశీయులు సైతం ఎగబడి చూస్తున్నారు. భాషతో సంబంధం లేకుండా కంటెంట్‌ ఉన్న ప్రతి సినిమా భారీ వసూళ్లను సాధిస్తోంది. పాన్‌ ఇండియా సినిమా సంస్కృతికి ఆదరణ పెరుగుతోంది. కానీ ఇదంతా మనకెప్పుడో సాధ్యమయ్యింది. చాలా ఏళ్ల క్రితమే వచ్చిన షోలే చిత్రం.. సినిమాకి హద్దులు లేవని నిరూపించింది. భాష, ప్రాంతాలతో సంబంధం లేకుండా దేశం మొత్తం అప్పట్లో షోలేకు బ్రహ్మరథం పట్టింది. ప్రస్తుతం సినిమాలు తీసే విధానం మారింది. దర్శకుల ఆలోచనలు మారాయి. సినిమాలను ప్రసారం చేసే మాధ్యమాలు పెరిగాయి. ప్రేక్షకులు కొత్త సినిమాలను సైతం సులభంగా ఇంట్లోనే చూస్తున్నారు. కానీ సినిమాకు ఎటువంటి ఆధునిక  సదుపాయాలు లేని ఆ రోజుల్లో ‘షోలే’ పాన్‌ ఇండియా హోదాని పొందింది’ అని అన్నారు.

1975 ఆగస్టు 15న విడుదలైన షోలే అఖండ విజయాన్ని సాధించింది. భారతదేశ సినిమా చరిత్రలో ఏ సినిమాకు సాధ్యం కాని రికార్డులను షోలే అప్పట్లోనే నెలకొల్పింది. రూ.3 కోట్ల వ్యయంతో తెరకెక్కి రూ.35 కోట్ల వసూళ్లను రాబట్టింది. దాదాపు ముప్పై థియేటర్లలో రెండు సంవత్సరాలకు పైగా ఆడిన చిత్రంగా ఇప్పటికీ చెరగని రికార్డు సాధించింది. ప్రముఖ బ్రిటిష్ పత్రిక బీబీసీ ఈ సినిమాని ‘ఫిల్మ్‌ ఆఫ్‌ ది మిలీనియం’గా అభివర్ణించింది. 2014లో త్రీడీ ఫార్మాట్లో  రెండోసారి విడుదలై రూ.25కోట్ల వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని