Shivani Nagaram: హీరోయినంటే నమ్మలేకపోయా

‘‘భావోద్వేగాలు నిండిన కథతో రూపొందిన చిత్రం ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’. సినిమాలో ప్రతి పాత్ర అందంగా ఉంటుంది. అందర్నీ అలరిస్తుంది’’ అంది శివాని నాగరం.

Updated : 30 Jan 2024 09:27 IST

‘‘భావోద్వేగాలు నిండిన కథతో రూపొందిన చిత్రం ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’. సినిమాలో ప్రతి పాత్ర అందంగా ఉంటుంది. అందర్నీ అలరిస్తుంది’’ అంది శివాని నాగరం (Shivani Nagaram). సుహాస్‌ హీరోగా దుశ్యంత్‌ కటికినేని తెరకెక్కించిన చిత్రమే ‘అంబాజీపేట  మ్యారేజి బ్యాండు’ (Ambajipeta Marriage Band). ఈ సినిమాతోనే కథానాయికగా తెలుగు తెరకు పరిచయమవుతోంది శివాని. ఈ చిత్రం ఫిబ్రవరి 2న విడుదల కానున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో సోమవారం విలేకర్లతో ముచ్చటించింది శివాని.

  • ‘‘ఇంత మంచి కథా బలమున్న సినిమాతో కథానాయికగా తెలుగు చిత్రసీమలోకి అడుగు పెడుతుండటం అదృష్టంగా భావిస్తున్నా. ఇప్పటికే నేనీ చిత్రం చూశా కాబట్టి దీనిపై చాలా నమ్మకంగా ఉన్నా. ఈ చిత్రంలో అవకాశం నాకు ఆడిషన్‌ ద్వారానే వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా మెసేజ్‌ పంపితే హీరోయిన్‌ ఫ్రెండ్‌ రోల్‌ కోసం ఆడిషన్‌ ఇచ్చా. కానీ, ఆ తర్వాత నన్ను హీరోయిన్‌గా తీసుకుంటున్నట్లు చెప్పారు. తొలిరోజు షూట్‌లో పాల్గొనే వరకు నేనే కథానాయికని అనేది నమ్మలేకపోయా’’.
  • ‘‘ఈ సినిమాలో నేను లక్ష్మి అనే పాత్రలో కనిపిస్తా. ఈ చిత్రం కోసం మేము నెల రోజుల పాటు బాగా సిద్ధమయ్యాం. స్క్రిప్ట్‌లోని ప్రతి డైలాగ్‌ను నేర్చుకున్నా. ఇలా ముందే సిద్ధమై వెళ్లడం వల్ల సెట్‌లో నటించడం పెద్దగా కష్టమనిపించలేదు. అయితే దీంట్లో కొన్ని భావోద్వేగభరిత సన్నివేశాలు చేయడం సవాల్‌గా అనిపించింది. సుహాస్‌ ‘కలర్‌ ఫొటో’ చిత్రానికి జాతీయ అవార్డు దక్కింది. తనతో కలిసి పని చేయడం చాలా సౌకర్యంగా ఉండేది. సెట్లో తను నన్నెంతో ప్రోత్సహించేవారు’’.
  • ‘‘ప్రతిభ గల తెలుగమ్మాయిలు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. వాళ్లందరికీ మంచి అవకాశాలు రావాలి. తెలుగు అమ్మాయి తెలుగు సినిమాల్లో నటిస్తే చాలా ఉపయోగాలుంటాయి. సెట్లో ఒక డైలాగ్‌ మార్చి ఇస్తే వెంటనే నేర్చుకొని చెప్పగలను. కానీ, మరో భాష నటి అయితే అర్థం చేసుకోవడానికే టైమ్‌ పడుతుంది. నేను కథానాయిక పాత్రలే చేయాలని నియమాలేం పెట్టుకోలేదు. కథలో కీలకంగా ఉండి నటిగా ప్రతిభ చూపించే అవకాశమున్న ఏ పాత్ర చేయడానికైనా సిద్ధమే’’.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని