Sai madhav: భయపడి చెప్పకపోతే.. అది ద్రోహమే!

‘‘వీరసింహారెడ్డి’ కథలో ప్రేక్షకులు ఇంతకు ముందు చూడని ఓ అద్భుతమైన కొత్త అంశం ఉంది. బలమైన ఎమోషన్‌ దాగి ఉంది. అందుకే ఈ చిత్రానికి మాటలు రాయడానికి నాకు రెండు నెలలు పట్టింది’’ అన్నారు ప్రముఖ రచయత సాయిమాధవ్‌ బుర్రా.

Updated : 31 Dec 2022 06:48 IST

‘‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy) కథలో ప్రేక్షకులు ఇంతకు ముందు చూడని ఓ అద్భుతమైన కొత్త అంశం ఉంది. బలమైన ఎమోషన్‌ దాగి ఉంది. అందుకే ఈ చిత్రానికి మాటలు రాయడానికి నాకు రెండు నెలలు పట్టింది’’ అన్నారు ప్రముఖ రచయత సాయిమాధవ్‌ బుర్రా (Sai Madhav Burra). బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్‌ మలినేని తెరకెక్కించిన చిత్రమే ‘వీరసింహారెడ్డి’. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకి సంభాషణలందించిన సాయిమాధవ్‌ బుర్రా శుక్రవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు.

‘‘బాలకృష్ణతో (Balakrishna) నాకిది నాలుగో చిత్రం. ఈ కథ చాలా కొత్తగా ఉంటుంది. మాస్‌, క్లాస్‌, ఫ్యామిలీ.. ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలన్నీ ఇందులో ఉన్నాయి. బాలయ్య నుంచి కోరుకునే అన్ని అంశాలతో.. ఫుల్‌ ప్యాకేజీలా ఉంటుంది. ఒక పక్కా కమర్షియల్‌ సినిమాకి ఇలాంటి కథ చాలా అరుదుగా దొరుకుతుంది. ఈ కథ విన్నప్పుడే నేను చాలా ఆనందించా.ఇందులో బలమైన భావోద్వేగాలున్నాయి. ఈ చిత్రంలో విషయం లేని సన్నివేశం ఒక్కటి కూడా కనిపించదు. బాలకృష్ణను అభిమానులు ఎలా చూడాలనుకుంటారో.. ఆయన నుంచి ఎలాంటి డైలాగ్స్‌ వినాలనుకుంటారో అన్నీ ఇందులో ఉన్నాయి’’.


బాలకృష్ణలో ఉన్న గొప్ప లక్షణమదే..

‘‘దర్శకుడు గోపీచంద్‌ మలినేనికి (Gopichand Malineni) నాకు మధ్య మంచి స్నేహం ఉంది. ఆయనతో నాకిది రెండో సినిమా. కథ పరంగా మా మధ్య మంచి చర్చలు జరుగుతాయి. గోపీచంద్‌ ఇప్పటికే అగ్ర దర్శకుడిగా ఉన్నారు. భవిష్యత్తులో ప్రపంచం మొత్తం మాట్లాడుకునే స్థాయిలో ఉంటారు. తనది అద్భుతమైన వ్యక్తిత్వం. ఆయనకు కన్విన్స్‌ అవడం తెలుసు.. కన్విన్స్‌ చేయడమూ తెలుసు. ఒక గొప్ప దర్శకుడికి ఉండాల్సిన లక్షణాలివి. ఇక బాలయ్యలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే.. ఒకసారి కథకు ఓకే చెప్పిన తర్వాత ఇక అందులో వేలు పెట్టరు’’.


* ‘‘దర్శకత్వంపై ప్రస్తుతానికి దృష్టి లేదు. భవిష్యత్తులో ఒక కథని దర్శకుడిగా చెప్పాలని అనిపించినప్పుడు దాని గురించి ఆలోచిస్తాను. రాజమౌళి చిత్రానికి మళ్లీ పని చేయాలని ఉంది. ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌ ‘హరి హర వీరమల్లు’, సమంత ‘శాకుంతలం’, రామ్‌చరణ్‌ - శంకర్‌ల చిత్రానికీ సంభాషణలు అందిస్తున్నా. అలాగే ప్రభాస్‌ ‘ప్రాజెక్ట్‌ కె’కు పని చేస్తున్నా. చాలా కొత్త జానర్‌లో సాగే చిత్రమిది. అందరూ అనుకుంటున్నట్లు ఇది టైమ్‌ ట్రావెల్‌ చిత్రమైతే కాదు. అర్జున్‌ సినిమాతో పాటు కె.ఎస్‌.రామారావుతోనూ ఓ చిత్రం చేస్తున్నా’’.


అలాంటప్పుడు చాలా కష్టపడాల్సి వస్తుంది..

‘‘ప్రత్యేకంగా ఫలానా కథ కోసమే విపరీతంగా కష్టపడ్డానని చెప్పడానికి ఏమీ లేదు. నేను ప్రతి కథనీ ఓ సవాల్‌గానే స్వీకరిస్తా. అలాగని ఎప్పుడూ ఒత్తిడి తీసుకోను. ఎందుకంటే ఒత్తిడికి లోనైతే అవుట్‌పుట్‌ సరిగా రాదు. కథని, పాత్రని, సన్నివేశాన్ని, హీరో ఇమేజ్‌ను.. ఇలా అనేక అంశాల్ని దృష్టిలో పెట్టుకొని అన్నింటినీ జాగ్రత్తగా బ్యాలెన్స్‌ చేస్తూ రాయాలి. నిజానికి ఓ రచయతకు అసలైన కష్టం ఎప్పుడు ఎదురవుతుందంటే.. కథలోనో, సీన్‌లోనో విషయం లేనప్పుడు. అలాంటప్పుడు మనం ఏం రాయాలో అస్సలు అర్థం కాదు. చాలా కష్టపడాల్సి వస్తుంది. నేనూ అలాంటి సందర్భాలు ఎదుర్కొన్నా. కాకపోతే అవి ఫలానా అని నేను చెప్పలేను (నవ్వుతూ)’’.


విషయమేదైనా దర్శకుడితో చెప్పాలి..

‘‘దర్శకులకు నాకు మధ్య కథ పరంగా ఆరోగ్యకరమైన చర్చలెప్పుడూ జరుగుతూనే ఉంటాయి. కథలో ఏదైనా సరిగా లేదనుకోండి.. అది మనం దర్శకుడితో పంచుకోకపోతే తప్పవుతుంది. ఒకవేళ అలా చెబితే అవతలి వాళ్లు ఏమన్నా అనుకొని మనల్ని దూరం పెట్టేస్తారేమోనని భయపడి చెప్పకపోతే.. అది ద్రోహం, మోసమవుతుంది. ఎందుకంటే విషయం ఏదైనా సరే.. అది దర్శకుడితో చెప్పాలి. దాని వల్ల ఆయనెందుకు అలా చేయాల్సి వచ్చిందో స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేస్తారు’’.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని