Rules Ranjan Review: రివ్యూ: రూల్స్‌ రంజన్‌.. కిరణ్ అబ్బవరం మూవీ హిట్టా..? ఫట్టా..?

Rules Ranjan Review: కిరణ్‌ అబ్బవరం.. నేహాశెట్టి జంటగా నటించిన ‘రూల్స్‌ రంజన్‌’ ఎలా ఉందంటే?

Updated : 06 Oct 2023 15:38 IST

Rules Ranjan Review | చిత్రం: రూల్స్‌ రంజన్‌; నటీనటులు: కిరణ్‌ అబ్బవరం, నేహాశెట్టి, మెహర్‌ చాహల్‌, వెన్నెల కిషోర్‌, సుబ్బరాజు, హైపర్‌ ఆది, వైవా హర్ష తదితరులు; సంగీతం: అమ్రిష్‌; సినిమాటోగ్రఫీ: దులిప్‌ కుమార్‌ ఎం.ఎస్‌; నిర్మాత: దివ్యాంగ్‌ లావనియా, మురళీకృష్ణ వేమూరి; దర్శకత్వం: రత్నం కృష్ణ; విడుదల: 06-10-2023

థియేటర్లలో ఈవారం చిన్న చిత్రాల జోరు కనిపించింది. పలు చిన్న సినిమాలు బాక్సాఫీస్‌ ముందు వరుస కట్టాయి. వాటిలో అందరి దృష్టినీ ఆకర్షించింది ‘రూల్స్‌ రంజన్‌’. కిరణ్‌ అబ్బవరం హీరోగా నటించిన ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత ఏ.ఎం.రత్నం సమర్పకుడిగా వ్యవహరించగా.. ఆయన తనయుడు రత్నం కృష్ణ తెరకెక్కించారు. విడుదలకు ముందే పాటలు, ప్రచార చిత్రాలకు మంచి ఆదరణ దక్కడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి ఈ ‘రూల్స్‌ రంజన్‌’ కథేంటి? (Rules Ranjan Review in telugu) అతని ప్రయాణం ప్రేక్షకులకు ఎలాంటి వినోదాలు పంచింది?

కథేంటంటే: తిరుపతికి చెందిన మధ్యతరగతి కుర్రాడు మనో రంజన్‌ (కిరణ్‌ అబ్బవరం). తను చదువులో యావరేజ్‌ అయినా కష్టపడి క్యాంపస్‌ సెలక్షన్‌లో ఉద్యోగం సంపాదిస్తాడు. దాని కోసం ముంబయికి మకాం మారుస్తాడు. అయితే అతనికి హిందీ రాకపోవడం వల్ల ఆరంభంలో ఆఫీస్‌లో కొన్ని అవమానాలు ఎదుర్కొంటాడు. ఈ సమస్యకు అలెక్సాతో చెక్‌ పెడతాడు. తన ప్రతిభతో బాస్‌ను మెప్పించి.. టీమ్‌ లీడర్‌గా ఎదుగుతాడు. అక్కడి నుంచి ఆఫీస్‌లోని ఉద్యోగులంతా తన రూల్స్‌ ప్రకారం నడిచేలా కట్టుదిట్టం చేస్తాడు. దీంతో వాళ్లంతా అతన్ని రూల్స్‌ రంజన్‌ అని పిలవడం మొదలు పెడతారు. అయితే ఒంటరిగా సాగిపోతున్న రంజన్‌ జీవితం సనా (నేహాశెట్టి) రాకతో మరో మలుపు తిరుగుతుంది. ఆమెను కాలేజీ రోజుల్లోనే రంజన్‌ గాఢంగా ప్రేమిస్తాడు. కానీ, భయంతో ఆ ప్రేమను ఏనాడూ బయట పెట్టడు. చాలా ఏళ్ల తర్వాత ముంబయిలో సనాని కలుసుకున్నాక రంజన్‌ తన మనసులోని ఇష్టాన్ని ఆమెకు తెలియజేస్తాడు. ఇద్దరూ కలిసి ఒకరోజంతా సరదాగా గడుపుతారు. ఈ క్రమంలో ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుంది. ఆ తర్వాత మళ్లీ ఆమె దూరమవడంతో తనని వెతుక్కుంటూ తిరుపతికి వెళ్తాడు. మరి ఆ తర్వాత ఏమైంది? ఆమెను పెళ్లి చేసుకునేందుకు రంజన్‌ వేసిన ఎత్తులేంటి? (Rules Ranjan Review) ఈ క్రమంలో ఎదుర్కొన్న సవాళ్లేంటి? ఈ కథలో కామేశ్‌ (వెన్నెల కిషోర్‌), సనా అన్న (సుబ్బరాజు)ల పాత్రలేంటి? రంజన్‌ పెళ్లి చెడగొట్టాలని అతని స్నేహితులు ఆది, వైవా హర్ష, నెల్లూరు సుదర్శన్‌ ఎందుకు ప్రయత్నించారు? అన్నది మిగతా కథ.

ఎవరెలా చేశారంటే: ఇదొక రొటీన్‌ రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌. కథలోనూ.. సినిమా సాగిన తీరులోనూ ఏమాత్రం కొత్తదనం కనిపించదు. ప్రథమార్ధంలో అసలు కథే కనిపించదు. ద్వితీయార్ధంలో అసలు కథ మొదలైనా.. అది గాడి తప్పిన బండిలా సాగిపోయింది. టైటిల్‌ కార్డ్స్‌ నుంచే రంజన్‌ తన కథను.. నేపథ్యాన్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తూ తన ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. తనకు హిందీ రాకున్నా.. వచ్చని చెప్పి ఉద్యోగం సంపాదించడం.. దాని కోసం ముంబయి వెళ్లడం.. అక్కడ ఆఫీసులో హిందీ రాక అవమానాలు పాలవ్వడం.. ఇలా డల్‌గా కథ సాగిపోతుంటుంది. కామేశ్‌గా వెన్నెల కిషోర్‌ తెరపైకి వచ్చినప్పటి నుంచి అటు కథలోనూ.. ఇటు ప్రేక్షకుల్లోనూ జోష్‌ వస్తుంది. (Rules Ranjan Review) రంజన్‌కు అతనికి మధ్య వచ్చే ఎపిసోడ్స్‌ ఇరికించినట్లు ఉన్నా.. వినోదాన్ని పంచిస్తాయి. ప్రథమార్ధానికి అవే కాస్త బలం. కాలేజీ రోజుల్లోని రంజన్‌ ప్రేమకథను ఓ పాటతో సింపుల్‌గా పరిచయం చేశారు. కానీ, అందులో ఏ ఫీల్‌ కనిపించదు. విరామానికి ముందు నేహా పాత్ర కథలోకి ఎంట్రీ ఇస్తుంది. ఓ ఇంటర్వ్యూ కోసం ముంబయి వచ్చిన ఆమెను రంజన్‌ చూడటం.. ఆమెకు సాయం చేసే క్రమంలో ఓ రోజంతా తనతో తిరిగే అవకాశం రావడం.. ఈ ప్రయాణంలో సనా అతనికి దగ్గరవడం.. ఇలా కథ కాస్త రొమాంటిక్‌ యాంగిల్‌లోకి టర్న్‌ తీసుకుంటుంది. విరామ సన్నివేశాలు పేలవంగా ఉంటాయి.

సనాని వెతుక్కుంటూ రంజన్‌ తిరుపతికి రావడంతో ద్వితీయార్ధం మొదలవుతుంది. అక్కడి నుంచి ఆమెను కలుసుకునేందుకు రంజన్‌ చేసే ప్రయత్నాలు.. వీరిద్దర్నీ ఎలాగైనా విడగొట్టాలని హైపర్‌ ఆది, హర్ష, సుదర్శన్‌ వేసే ఎత్తుగడలతో కథ కాస్త రసవత్తరంగా మారుతుంది. ఈ క్రమంలో రంజన్‌, ఆది గ్యాంగ్‌కు మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు నవ్విస్తాయి. అలాగే సనా అన్న సుబ్బరాజు - ఆది బృందానికి మధ్య వచ్చే బార్‌ ఎపిసోడ్‌ కూడా నవ్వులు పూయిస్తుంది. (Rules Ranjan Review) అయితే రంజన్‌-సనాల ప్రేమకథలో సరైన ఫీల్, బలమైన సంఘర్షణ లేకపోవడంతో సినిమా చాలా డల్‌గా సాగుతున్న అనుభూతి కలుగుతుంది. సనాకు దగ్గరయ్యే క్రమంలో రంజన్‌ అనుకోకుండా ఆమె స్నేహితురాలి కుటుంబానికి కనెక్ట్‌ అవ్వడం.. వాళ్లు ఆ ఇంటి అమ్మాయిని రంజన్‌కు ఇచ్చేందుకు సిద్ధపడటం.. మరోవైపు సనాకు తన స్నేహితురాలి అన్న అజయ్‌తో పెళ్లి చేసేందుకు నిశ్చయించడంతో తర్వాత ఏం జరుగుతుందా? అన్న ఆసక్తి మొదలవుతుంది. కానీ, ఈ పెళ్లిళ్లు చెడగొట్టేందుకు రంజన్‌ చేసే ప్రయత్నాలు అంతగా ఆకట్టుకోవు. పతాక సన్నివేశాలు లాజిక్‌ లేకుండా సాగినా.. వెన్నెల కిషోర్‌ పాత్ర చేసే హంగామాతో కాసేపు నవ్వుకొని బయటకొచ్చే అవకాశం దొరుకుతుంది.

మేకప్‌ వేసుకుని ఐదు గంటలకే బీచ్‌కు వెళ్తే..

ఎవరెలా చేశారంటే: మనో రంజన్‌ పాత్రలో కిరణ్‌ అబ్బవరం చక్కగా ఒదిగిపోయారు. కొన్ని సన్నివేశాల్లో అతని నటన కాస్త అతిగా అనిపిస్తుంది. అదే సమయంలో అక్కడక్కడా మంచి కామెడీ టైమింగ్‌ ప్రదర్శించాడు. సనాగా నేహా అందంగా కనిపించింది. నటన పరంగా చూపించేందుకు కథలో పెద్దగా ఆస్కారం దొరకలేదు. ‘‘సమ్మోహనుడా’’ పాటలో ఆమె పలికించిన హావభావాలు.. వేసిన స్టెప్పులు.. ఆ పాటను తీర్చిదిద్దిన విధానం ఆకట్టుకుంటాయి. ప్లేబాయ్‌లా వ్యవహరించే కామేశ్‌ పాత్రలో వెన్నెల కిషోర్‌ వినోదం సినిమాకి బలాన్నిచ్చింది. (Rules Ranjan Review in telugu) ఆది, హర్ష, సుదర్శన్‌ల పాత్రలూ అక్కడక్కడా నవ్వులు పంచాయి. నాగినీడు, గోపరాజు రమణ, సుబ్బరాజు, అజయ్‌ తదితరుల పాత్రలు పరిధి మేరకు ఉన్నాయి. దర్శకుడు ఎంచుకున్న కథలో ఏమాత్రం కొత్తదనం లేదు. ముఖ్యంగా లవ్‌ ట్రాక్‌ మరీ పేలవంగా ఉంది. అనవసరమైన సన్నివేేశాలు ఇబ్బడిముబ్బడిగా కనిపిస్తాయి. అమ్రిష్‌ సంగీతం ఫర్వాలేదనిపించింది. సమ్మోహనుడా పాట సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఛాయాగ్రహణం, నిర్మాణ విలువలు బాగున్నాయి.

  • బలాలు
  • + వెన్నెల కిషోర్, ఆదిల కామెడీ
  • + ‘సమ్మోహనుడా..’ పాట
  • + ద్వితీయార్ధం
  • బలహీనతలు
  • - కొత్తదనం లేని కథ
  • - నాయకానాయికల లవ్‌ ట్రాక్‌
  • చివరిగా: రొటీన్‌ ‘రూల్స్‌ రంజన్‌’.. (Rules Ranjan Movie Review)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని