RGV: ‘ఆర్‌ఆర్‌ఆర్‌ కంటే కార్తికేయ - 2 బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌’

నిఖిల్ (Nikhil) హీరోగా నటించిన ‘కార్తికేయ - 2’ (karthikeya 2) చిత్రంపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ (RGV) ప్రశంసల....

Published : 21 Aug 2022 11:44 IST

ట్వీట్‌ చేసిన రాంగోపాల్‌ వర్మ

హైదరాబాద్‌: నిఖిల్ (Nikhil) హీరోగా నటించిన ‘కార్తికేయ - 2’ (karthikeya 2) చిత్రంపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ (RGV) ప్రశంసల వర్షం కురిపించారు. ఈ చిత్రానికి వస్తోన్న కలెక్షన్లు చూస్తుంటే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) కంటే కూడా బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ ఇదేనంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఆర్జీవీ తాజాగా ట్వీట్‌ చేశారు. ‘‘బాలీవుడ్‌ స్టార్‌హీరోలు ఆమిర్‌ఖాన్‌, అక్షయ్‌కుమార్‌ నటించిన ‘లాల్‌ సింగ్‌ చడ్డా’, ‘రక్షాబంధన్’ కంటే నిఖిల్‌ హీరోగా తెరకెక్కిన ‘కార్తికేయ-2’ రెండో శుక్రవారం డబుల్‌ కలెక్షన్లు సాధించింది. దీనిని బట్టి చూస్తుంటే.. రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’, ప్రశాంత్‌ నీల్‌ రూపొందించిన ‘కేజీయఫ్ ‌- 2’ (KGF 2) కంటే ‘కార్తికేయ - 2’ బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌. దర్శకుడు చందు మొండేటి, నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌కు నా అభినందనలు’’ అని వర్మ పేర్కొన్నారు.

శ్రీ కృష్ణ తత్వం, ద్వారకా నగర రహస్యం నేపథ్యంలో రూపుదిద్దుకున్న సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘కార్తికేయ - 2’. ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అంతటా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.   కేవలం బాలీవుడ్‌లోనే ఇప్పటివరకూ రూ.8 కోట్లు వసూళ్లు చేసినట్లు సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ అంచనా వేశాడు. ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహించారు. నిఖిల్‌, అనుపమ పరమేశ్వరన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో అనుపమ్‌ ఖేర్‌, శ్రీనివాస రెడ్డి, ప్రవీణ్‌, ఆదిత్యా మేనన్‌ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఇక, సుమారు ఎనిమిదేళ్ల క్రితం విడుదలైన ‘కార్తికేయ’కు ఫ్రాంచైజీగా ‘కార్తికేయ - 2’ తెరకెక్కిన విషయం తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని