Randeep hooda: మతం కన్నా దేశం గొప్పది

‘హిందుస్థాన్‌ని ప్రేమించేవాళ్లంతా హిందువులే’ అంటున్నారు రణ్‌దీప్‌ హుడా. స్వాతంత్య్ర సమరయోధుడు, హిందూ అతివాది, వివాదాస్పద నేత.. వీర్‌సావర్కర్‌ పాత్రధారిగా.. స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న చిత్రం ‘స్వాతంత్య్ర వీర్‌ సావర్కర్‌’.

Updated : 06 Mar 2024 09:36 IST

‘హిందుస్థాన్‌ని ప్రేమించేవాళ్లంతా హిందువులే’ అంటున్నారు రణ్‌దీప్‌ హుడా. స్వాతంత్య్ర సమరయోధుడు, హిందూ అతివాది, వివాదాస్పద నేత.. వీర్‌సావర్కర్‌ పాత్రధారిగా.. స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న చిత్రం ‘స్వాతంత్య్ర వీర్‌ సావర్కర్‌’. మంగళవారం ట్రైలర్‌ విడుదలైంది. ఇందులోని దృశ్యాలు.. భారత్‌ని ఆంగ్లేయులు పరిపాలిస్తున్న కాలంలో జరిగిన మారణకాండ.. ఆనాటి స్వతంత్ర సంగ్రామాన్ని మరోసారి గుర్తుకు తెచ్చేలా సాగాయి. ‘అహింస ద్వారానే మన దేశానికి స్వాతంత్య్రం దక్కిందని అంతా పుస్తకాల్లో చదువుకుంటున్నారు. కానీ చరిత్ర వేరే ఉంది’ అనే సంభాషణ సావర్కర్‌ అతివాద, హింసాత్మక భావజాలానికి అద్దం పడుతోంది. ‘మతం కన్నా దేశం గొప్పది. మాజిని ఇటలీని ఏకం చేసినట్టే మేం అఖండ భారత్‌ని నిర్మిస్తాం’, ‘1912 నాటికల్లా మేం బ్రిటిషర్లను తరిమితరిమి కొడతాం. ప్రాణభీతితో వాళ్లు దేశం వదిలి పారిపోయేలా చేస్తాం.. లేదా వాళ్లని చంపుతూ చంపుతూ మేమూ వీరమరణం పొందుతాం’ లాంటి డైలాగులు రోమాంఛితంగా ఉన్నాయి. ఈ సందర్భంగా రణ్‌దీప్‌ హుడా మాట్లాడుతూ.. ‘వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ గొప్ప దేశభక్తుడు. కానీ ఆయన ఎంచుకున్న మార్గం కారణంగా మనవాళ్లే అపార్థం చేసుకున్నారు. ఆయన తిరుగుబాటు ధోరణి సహింపక ఆంగ్లేయులు తీవ్రవాది అనే ముద్ర వేశారు. కానీ ఆయన జీవితంలోని వాస్తవాలేంటి? స్వతంత్ర ఉద్యమంలో అసామాన్యమైన ఆయన పాత్ర.. ఎంతో పరిశోధన చేసి ఇవన్నీ వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేశాం. జాతి అందించిన ఒక గొప్ప యోధుడి చరిత్రను ఈ సినిమా ద్వారా మీ ముందుకు తీసుకురావడాన్ని ఒక గౌరవంగా భావిస్తున్నా’మన్నారు. అంకితా లోఖాండే, అమిత్‌ సియాల్‌ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం మార్చి 22న విడుదలవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని