Ramabanam: పాత్ర వల్గర్‌గా అనిపిస్తుందంటూ డింపుల్‌కు ప్రశ్న.. హీరోయిన్‌ రియాక్షన్‌ ఏంటంటే?

‘మీ పాత్ర వల్గర్‌ ఉన్నట్టు అనిపిస్తుంది’ అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు హీరోయిన్‌ డింపుల్‌ హయాతి తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ఆమె ఏం చెప్పారంటే?

Published : 26 Apr 2023 22:35 IST

హైదరాబాద్‌: ‘లక్ష్యం’, ‘లౌక్యం’ తర్వాత హీరో గోపీచంద్‌ (Gopichand), దర్శకుడు శ్రీవాస్‌ (Sriwass) కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘రామబాణం’ (Ramabanam). డింపుల్‌ హయాతి (Dimple Hayathi) కథానాయిక. జగపతిబాబు (Jagapathi Babu), ఖుష్బూ (Kushboo) కీలక పాత్రలు పోషించారు. టీజీ విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిభొట్ల సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా మే 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో చిత్ర బృందం పాల్గొంది. విలేకర్లు అడిగిన ప్రశ్నలకు ‘రామబాణం’ టీమ్‌ చెప్పిన సమాధానాలేంటో చూసేయండి..

* ఏ నమ్మకంతో ఈ సినిమాని ఎంపిక చేసుకున్నారు?

గోపీచంద్‌: కథపై ఉన్న నమ్మకంతో ఈ సినిమాలో నటించా. ఇందులో ఫ్యామిలీ ఎమోషన్‌, యాక్షన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌.. ఇలా కమర్షియల్‌ హంగులన్నీ ఉంటాయి. ఏ స్టోరీనైనా ప్రేక్షకుడి కోణంలోనే వింటా.

* హిందీ ప్రేక్షకుల్లో మీకు క్రేజ్‌ ఉంది. ఎందుకు పాన్‌ ఇండియా స్థాయిలో సినిమాలు చేయట్లేదు?

గోపీచంద్‌: ప్రత్యేక కారణం ఏం లేదు. నిర్మాత మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా శాటిలైట్‌ రైట్స్‌ ‘బిఫోర్‌ యు’ సంస్థ తీసుకుంది. వారం క్రితం నాకు ఫోన్‌ చేసి హిందీలో విడుదల చేద్దామని ఆ సంస్థ వారు చెప్పారు. 245 స్క్రీన్లలో ప్రదర్శించేందుకు సన్నాహాలు చేస్తున్నామని, త్వరగా సెన్సార్‌ పూర్తి చేయమని కోరారు’’ అని తెలిపారు.

* ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ప్రభాస్‌ వచ్చే అవకాశం ఉందా?

వివేక్: ప్రస్తుతానికి అలాంటిదేం లేదు. మేం ఆయన్ను సంప్రదించలేదు.

*  ఈ సినిమాలో మీ పాత్ర వల్గర్‌గా ఉన్నట్టు అనిపిస్తుంది. దానిపై మీరేమంటారు?

డింపుల్‌: నాకు తెలిసి ఈ సినిమాలో అలాంటి సన్నివేశాలే లేవు. మీరు ఈ సినిమా పోస్టర్లు చూసినా, వీడియో సాంగ్స్‌ చూసినా నేను పూర్తి వస్త్రధారణతోనే కనిపిస్తా. దర్శకుడు స్పందిస్తూ.. ‘‘ ప్రమోషన్స్‌కు ఆమె ఎలాంటి దుస్తుల్లో వస్తుందో గమనిస్తే సినిమాలో ఎలా కనిపిస్తుందో మీకు అర్థమవుతుంది. సంప్రదాయ పాత్రకావడంతో వెస్ట్రన్‌ డ్రెస్సు వేసుకోకుండా ట్రెడిషనల్‌ డ్రెస్సుల్లోనే నటించింది’’ అని తెలిపారు.

*  కీలక పాత్రకు ఖుష్బూని ఎంపిక చేయడానికి కారణమేంటి?

శ్రీవాస్‌: కొందరు తమ అనుభవంతో ఆయా పాత్రలకు ప్రాణం పోస్తారు. ఖుష్బూ అలాంటి వారే. ఇందులో ఆమె తల్లిని తలపించే వదిన క్యారెక్టర్‌ ప్లే చేశారు. షూటింగ్‌ తొలినాళ్లలో ఆమెతో కలిసి పనిచేసేటపుడు జాగ్రత్తగా ఉండాలేమో అని భయపడ్డా. కానీ, ఆవిడ చాలా సింపుల్‌, సాఫ్ట్‌గా ఉంటారు.

* ఆహార కల్తీ అంశాన్ని ఎందుకు ప్రస్తావించాలనుకున్నారు?

శ్రీవాస్‌: అది కథలో ఓ భాగం మాత్రమే. పూర్తి సినిమా ఆ అంశంపై ఉండదు. ఇంత పెద్ద సినిమా ద్వారా సామాజిక అంశాన్ని ప్రస్తావిస్తే చైతన్యం కలుగుతుందనే ఉద్దేశంతో ఆ పాయింట్‌ తీసుకున్నాం.

* ‘సాక్ష్యం’ తర్వాత ఐదేళ్లు గ్యాప్‌ తీసుకోవడానికి కారణం?

శ్రీవాస్‌: నేను కావాలని విరామం తీసుకోలేదు. ‘సాక్ష్యం’ తర్వాత వెంటనే రెండు సినిమాలు తెరకెక్కించే ప్రయత్నం చేశా. అవి పలు కారణాల వల్ల చివరి దశలో క్యాన్సిల్‌ అయ్యాయి. అనంతరం, ‘రామబాణం’ సినిమాని ప్రారంభించా. సుమారు సంవత్సరన్నర నుంచి దీంతో ప్రయాణిస్తున్నా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని