Rakesh Sashii: కథ, దర్శకుడు... కుదిరితేనే..!

‘‘నేను తీసే సినిమా కుటుంబమంతా కలిసి చూసేలా ఉండాలనుకుంటా. ‘ఊర్వశివో రాక్షసివో’ అలాంటి చిత్రమే’’ అన్నారు యువ దర్శకుడు రాకేశ్‌ శశి.

Updated : 07 Dec 2022 19:06 IST

‘‘నేను తీసే సినిమా కుటుంబమంతా కలిసి చూసేలా ఉండాలనుకుంటా. ‘ఊర్వశివో రాక్షసివో’ అలాంటి చిత్రమే’’ అన్నారు యువ దర్శకుడు రాకేశ్‌ శశి (Rakesh Sashii). ‘జతకలిసే’ సినిమాతో మెగాఫోన్‌ పట్టిన ఈయన.... ‘విజేత’తో మెప్పించారు. తన మూడో చిత్రంగా ‘ఊర్వశివో రాక్షసివో’ (Urvasivo Rakshasivo) తెరకెక్కించారు. అల్లు శిరీష్‌ (Allu Sirish) కథానాయకుడిగా జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా రాకేశ్‌ శశి గురువారం ‘ఈనాడు సినిమా’తో ముచ్చటించారు.

* ‘‘కథానాయకుడు అల్లు శిరీష్‌తో ఆరేళ్లుగా పరిచయం ఉంది. మేం కలిసి సినిమా చేయాలని రెండు మూడుసార్లు అనుకున్నాం. కానీ కుదరలేదు. అనుకోకుండా నిర్మాత అల్లు అరవింద్‌ నుంచి పిలుపు వచ్చింది. ఆయన నేను తీసిన ‘విజేత’ని చూసి అప్పట్లో మెచ్చుకున్నారు. ఆయనే ఓ మంచి కథతో సినిమా చేద్దామని ప్రోత్సహించారు. అలా కుదిరిందే ‘ఊర్వశివో రాక్షసివో’. ప్రేమ, జీవితం, వృత్తి తదితర విషయాల్లో యువతరం ఎదుర్కొంటున్న సంఘర్షణ చుట్టూ సాగే కథ ఇది.  ఇవే విషయాల్ని యువతరం చూసే కోణం వేరు, పెద్దలు చూసే కోణం వేరుగా ఉంటుంది. ఈ అంశాన్ని భిన్న మనస్తత్వాలున్న ఓ జంటతో ముడిపెట్టి తీసిన సినిమానే ఇది. ఇంటిల్లిపాదీ కలిసి చూసేలా వినోదం మేళవించి చేసిన సినిమా ఇది. శ్రీకుమార్‌, సింధు పాత్రల్లో శిరీష్‌, అను ఇమ్మానుయేల్‌ కనిపిస్తారు. రొమాంటిక్‌ సన్నివేశాలైనా, కామెడీ అయినా... ప్రతిదీ కథలో భాగంగానే పుట్టింది. అదే ఈ సినిమా ప్రత్యేకత’’.

* ‘‘విభిన్నమైన కథలతో సినిమాలు  చేయడమంటేనే ఇష్టం. నా దగ్గర రకరకాల కాన్సెప్ట్‌లు ఉన్నాయి.  ‘ఊర్వశివో రాక్షసివో’ కంటే ముందు కూడా యుద్ధం నేపథ్యంలో ఓ పీరియాడికల్‌ కథని తెరకెక్కించాలనుకున్నా. కానీ ముందు ఇదే చేయాల్సి వచ్చింది. అన్నీ కుదిరితే తదుపరి పీరియాడికల్‌ కథతోనే సినిమా చేస్తానేమో. కథానాయకులు, నిర్మాతలు, వాళ్ల అభిరుచులు... ఇలా ఇక్కడ అన్నీ కుదరాలి. అప్పుడే అనుకున్న సినిమాల్ని చేయగలుగుతాం. కేవలం నా కథలతోనే సినిమాలు చేయాలనుకోవడం లేదు. మంచి కథ అనుకున్నప్పుడు బయట కథలతోనూ సినిమా చేస్తా. ఆ విషయంలో నిర్మాత అల్లు అరవింద్‌ చెప్పిన మాటలే స్ఫూర్తి. ‘ఒక మంచి కథని సరైన దర్శకుడు చేయకపోతే సమస్య అవుతుంది. ఎంత మంచి దర్శకుడైనా,  సరైన కథ లేదంటే సమస్య అవుతుంది. కథ ఎంత ముఖ్యమో, దాన్ని డీల్‌ చేసే దర్శకుడు కూడా అంతే ముఖ్యం. కథల విషయంలో  పరిమితులు పెట్టుకోవద్దు’ అని చెప్పారు ఒకసారి. ‘ఊర్వశివో రాక్షసివో’ విడుదల తర్వాత కొత్త ప్రాజెక్ట్‌ గురించి ఆలోచించాలి. జీఏ2 సంస్థలో మరో సినిమా చేయాల్సి ఉంది’’.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని