Chandramukhi 2: ‘చంద్రముఖి2’ ఫ్లాప్‌పై స్పందించిన రాఘవ లారెన్స్‌

Jigarthanda DoubleX: ఇటీవల తాను నటించిన ‘చంద్రముఖి2’ ఫ్లాప్‌పై రాఘవ లారెన్స్‌ స్పందించారు.

Published : 11 Oct 2023 02:10 IST

హైదరాబాద్‌: హిట్‌, ఫ్లాప్‌ల గురించి ఆలోచించకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్లాలని నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్‌ (Raghava Lawrence) అన్నారు. కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో ఎస్‌జే సూర్యతో (S.J.Suryah) కలిసి ఆయన నటించి పీరియాడిక్‌ యాక్షన్‌ కామెడీ ఫిల్మ్‌ ‘జిగర్‌ తండ డబుల్‌ ఎక్స్‌’(Jigarthanda DoubleX). నిమేషా సజయన్‌, షైన్‌ టామ్‌ చాకో తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో లారెన్స్‌ మాట్లాడారు. ఇటీవల పి. వాసు దర్శకత్వంలో ఆయన నటించిన ‘చంద్రముఖి2’ ఫలితంపై స్పందించారు.

‘‘చంద్రముఖి2’ విషయంలో నా డబ్బులు నాకు వచ్చాయి. పైగా నలుగురు హీరోయిన్స్‌తో కలిసి చేశా. లైఫ్‌లో అన్నీ మనం గెలవాలని లేదు. గ్రూప్‌ డ్యాన్సర్‌ నుంచి డ్యాన్సర్‌ మాస్టర్‌ అయితే చాలు అనుకున్నా. అక్కడి నుంచి దర్శకుడినయ్యా. ఇప్పుడు హీరో.  ఈ గ్లామర్‌ను పెట్టుకుని హీరో అవకాశాలు ఇవ్వడమే దేవుడిచ్చిన వరం. మళ్లీ దానిలో ఫ్లాప్‌, హిట్‌లు గురించి ఆలోచించకూడదు. అవి మన వెనకాలే వస్తాయి. ‘జిగర్తాండ్‌ డబుల్‌ ఎక్స్‌’ డబ్బింగ్‌ పూర్తయ్యాక చూశా. ఇది దర్శకుడి సినిమా. ఇందులో మంచి కథ ఉంది. సినిమా హిట్‌ అవుతుందన్న నమ్మకం ఉంది. ఎంత పెద్ద హీరోయిజం చేసినా, డ్యాన్స్‌ చేసినా కథ లేకపోతే, సినిమా ఆడటం లేదు. కంటెంట్‌ బలంగా ఉండాలంటే దర్శకుడు కూడా అంతే బలంగా ఉండాలి. కార్తీక్‌ సుబ్బరాజు విషయంలో నాకు ఎలాంటి సందేహాలు లేవు’’ అని అన్నారు.

ఆ సినిమాలతో మనశ్శాంతి ఉండటం లేదు!

‘కాంచన4’ ఎప్పుడు తీస్తున్నారు? అని ప్రశ్నించగా, ‘అన్నీ దెయ్యాల సినిమాలు తీసి, నా మైండ్‌ పిచ్చి పిచ్చిగా అయిపోయింది. అలాంటి సినిమాలు తీస్తున్న సమయంలో నిద్రపోయినా కూడా అవే ఆలోచనలు వస్తున్నాయి. మనశ్శాంతిగా ఉండటం లేదు. ఏదో ఒక రోజు తీస్తా’ అంటూ సమాధానమిచ్చారు.

ఎస్‌జే సూర్య పాత్రకు నవీన్‌ పొలిశెట్టి!

ఈ సందర్భంగా దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజ్‌ మాట్లాడుతూ.. ‘‘జిగర్‌ తండ డబుల్‌ ఎక్స్‌’ కథను మొదట రాఘవ లారెన్స్‌గారికి చెప్పాను. ఆయనకు పాత్ర కూడా నచ్చింది. ఆ తర్వాత ఫిలింమేకర్‌ క్యారెక్టర్‌ను ఎస్‌జే సూర్యకు చెబితే ఆయన నో చెప్పారు. దీంతో అప్పుడు తెలుగులో నవీన్‌ పొలిశెట్టితో చర్చలు జరిపాం. అతనికి కూడా స్క్రిప్ట్‌ నచ్చింది. అయితే, తేదీలను సర్దుబాటు చేయడం కుదరలేదు. దీంతో నిర్మాత కార్తికేయన్‌ను పంపి ఎస్‌జే సూర్యను ఒప్పించాం’’ అని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని