Sravanthi Ravi Kishore: అందుకే వేగంగా సినిమాలు చేయట్లేదు

పండగలంటే స్టార్‌ హీరోల సినిమాలే కాదు... పరిమిత వ్యయంతో రూపొందే ఒకట్రెండు చిన్న చిత్రాలూ సందడి చేస్తుంటాయి.

Updated : 08 Nov 2023 14:01 IST

పండగలంటే స్టార్‌ హీరోల సినిమాలే కాదు... పరిమిత వ్యయంతో రూపొందే ఒకట్రెండు చిన్న చిత్రాలూ సందడి చేస్తుంటాయి. అలా ఈసారి ‘దీపావళి’కి అదే పేరుతో ఓ సినిమా వస్తోంది. నిర్మాత స్రవంతి రవికిశోర్‌ తమిళంలో నిర్మించిన ‘కిడ’కి తెలుగు అనువాదం ఈ చిత్రం. రాము, కాళీ వెంకట్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ఆర్‌.ఎ.వెంకట్‌ దర్శకుడు. ఈ చిత్రం ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా స్రవంతి రవికిశోర్‌ మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు.

‘దీపావళి’ సినిమాని దీపావళి సందర్భంగానే విడుదల చేయడానికి కారణం?

మనకి సంక్రాంతి ఎలాగో... అలా తమిళనాడు ప్రజలకి పెద్ద పండగ దీపావళి. ముందు ఈ కథ విన్నప్పుడు తెలుగులో సంక్రాంతి నేపథ్యంలో... తనికెళ్ల భరణితో చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించా. అలా చేస్తే దర్శకుడు రాసుకున్న కథకి న్యాయం జరగదనిపించింది. తమిళనాడు, చిత్తూరు సరిహద్దుల్లో సాగే కథ ఇది. సహజమైన ఆ నేపథ్యంలో తీస్తేనే బాగుంటుందని ఈ సినిమాని తమిళంలో ‘కిడ’ పేరుతో తెరకెక్కించాం. తెలుగులో ‘దీపావళి’ పేరుతో ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. కరోనా తర్వాత భాషల మధ్య హద్దులు చెరిగిపోయాయి. అన్ని భాషల సినిమాల్నీ సమానంగా ఆదరిస్తున్నారు. తమిళంలో తీసినా తెలుగు ప్రేక్షకుల్ని హత్తుకునే భావోద్వేగాలు ఇందులో ఉన్నాయి. దిల్‌రాజు సంస్థ నుంచి వచ్చిన ‘బలగం’ సినిమా సాధించిన విజయాన్ని చూశాక, ‘దీపావళి’పై మరింత నమ్మకం పెరిగింది.

ఇదివరకు అవార్డ్‌ సినిమాలు, కమర్షియల్‌ సినిమాలు అంటూ వేర్వేరుగా చూసేవారు. ఇప్పుడు ఆ భేదాలు కూడా లేవు కదా...

ఓ నిర్మాతగా అన్ని రకాల సినిమాలూ తీయాలనుకుంటా. ఏ సినిమా తీసినా దీని తర్వాత మరొకటి చేయడానికి డబ్బుంటే చాలనే దృక్పథంతోనే ప్రయాణం చేస్తూ వచ్చా. దురదృష్టవశాత్తూ ఇదివరకటిలాగా ఇప్పుడు శాటిలైట్‌, ఓటీటీ మార్కెట్‌ నుంచి ఎక్కువ డబ్బు రావడం లేదు. థియేటర్ల నుంచి వచ్చే వసూళ్లే కీలకం. ఏ స్థాయి సినిమాకైనా కథ, భావోద్వేగాలు కీలకం. మనసులకి హత్తుకునేలా భావోద్వేగాలు పండాయంటే... ఇది అవార్డ్‌ సినిమానా, లేక కమర్షియల్‌ సినిమానా అనే పట్టింపు ఉండదు.

నిర్మాతగా మీ ప్రయాణాన్ని వెనుదిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది?

దాదాపుగా అన్ని సినిమాలూ తృప్తినిచ్చినవే. ఆర్థికంగా అన్నీ ఒకే రకమైన ఫలితాన్నివ్వలేదేమో కానీ, చేసిన అన్ని సినిమాల పట్ల గర్వపడుతున్నా. ఇది ఎందుకు చేశానని ఒక్క సినిమా విషయంలోనూ బాధపడింది లేదు. ఆ తృప్తితోనే నా ప్రయాణం సాగుతోంది. వేగంగా సినిమాలు చేయకపోవడానికి కారణం కూడా అదే. కథ విషయంలో అంతా పక్కాగా అనిపించినప్పుడే ముందడుగు వేస్తాను.

రామ్‌తో మళ్లీ సినిమా ఎప్పుడు చేస్తున్నారు?

ప్రస్తుతం ఓ స్క్రిప్ట్‌కి సంబంధించి పనులు జరుగుతున్నాయి. నేను చేసిన సినిమాల కంటే, చేయకుండా మధ్యలో ఆపేసిన స్క్రిప్టులే ఎక్కువ. నచ్చలేదనిపిస్తే రామ్‌ వరకూ వెళ్లకుండా చాలా కథలు పక్కన పెట్టేస్తుంటా. కథ సంతృప్తిగా అనిపిస్తే రామ్‌ హీరోగా సినిమా చేస్తా. రామ్‌ - త్రివిక్రమ్‌ కలయికలో సినిమా చేయాలని నాకూ ఉంది. దానికి అన్నీ కుదరాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని