Prabhas: జపాన్‌లో విడుదలకు సిద్ధమైన ఇండియన్‌ సినిమాలు.. ఏవంటే

ప్రభాస్‌, షారుక్‌ ఖాన్‌ల సినిమాలు జపాన్‌లో విడుదలకు సిద్ధమయ్యాయి. దీంతో సోషల్‌ మీడియాలో సందడి నెలకొంది.

Published : 04 Jul 2024 11:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇండియన్‌ సినిమాలు జపాన్‌లో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. మన అగ్ర హీరోల చిత్రాలు అక్కడ విడుదల కానున్నాయి. ప్రభాస్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్ తెరకెక్కించిన ‘సలార్‌’ (Salaar) జులై 5న జపాన్‌లో విడుదల కానుంది. అలాగే షారుక్‌ ఖాన్‌ ‘జవాన్‌’ కూడా అక్కడ రిలీజ్‌ డేట్‌ను ఖరారు చేసుకుంది.

ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ‘సలార్‌’ (Salaar) బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. రూ.270 కోట్లతో నిర్మించిన ఈ సినిమా సుమారు రూ.715 కోట్లు వసూళ్లు చేసింది. ఇప్పుడీ చిత్రం జులై 5న జపాన్‌లో విడుదల కానుంది. గతంలో ప్రభాస్‌ (Prabhas) నటించిన కొన్ని సినిమాలు అక్కడ మంచి కలెక్షన్స్‌ సొంతం చేసుకున్నాయి. ఇప్పడు ‘సలార్‌’ కోసం అక్కడి ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇటీవల విడుదలైన జపాన్‌ రిలీజ్ ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ విషయంపై ప్రభాస్‌ స్పెషల్‌ వీడియో పోస్ట్‌ చేశారు. ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ను చూసి ఎంజాయ్‌ చేయండి అని పేర్కొన్నారు.

ఘనంగా వరలక్ష్మీ శరత్‌కుమార్‌ రిసెప్షన్‌.. తారల సందడి

అలాగే షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan) హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జవాన్‌’ నవంబర్‌ 29న జపాన్‌లో విడుదల కానుంది. గతేడాది సెప్టెంబర్‌ 7న ఇక్కడ ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం రూ.1043 కోట్లకు పైగా వసూలు చేసింది. హిందీ చలనచిత్ర చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఇప్పుడు జపాన్‌లోను సంచలనం సృష్టించేందుకు సిద్ధమైంది. జులై 5న అడ్వాన్స్ బుకింగ్స్‌ ఓపెన్‌ చేయనున్నట్లు తెలుపుతూ పోస్టర్లు విడుదల చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని