Kalki 2898 AD Review: రివ్యూ: ‘కల్కి 2898 ఏడీ’.. ప్రభాస్‌ సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ ఎలా ఉంది?

kalki 2898 ad review in telugu: ప్రభాస్‌ కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో వచ్చిన ఎపిక్‌ సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ మూవీ ప్రేక్షకులను మెప్పించిందా?

Updated : 27 Jun 2024 14:40 IST

Kalki 2898 AD Review; చిత్రం: కల్కి 2898 ఏడీ; నటీనటులు: ప్రభాస్‌, అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకొణె, దిశా పటానీ, రాజేంద్రప్రసాద్‌, బ్రహ్మానందం, శోభన, స్వాస్థ ఛటర్జీ, పశుపతి, కీర్తి సురేశ్‌ (వాయిస్‌ఓవర్‌), విజయ్‌ దేవరకొండ, మృణాళ్‌ఠాకూర్‌, దుల్కర్‌ సల్మాన్‌ తదితరులు; సంగీతం: సంతోష్‌ నారాయణన్‌; ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరావు; సినిమాటోగ్రఫీ: జోర్డే స్టోవిల్కోవిచ్‌; సంభాషణలు: సాయి మాధవ్‌ బుర్రా; నిర్మాత: సి.అశ్వనీదత్‌; కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నాగ్‌ అశ్విన్‌; విడుదల తేదీ: 27-06-2024

‘బాహుబలి’ చిత్రాల తర్వాత  ప్రభాస్‌ పూర్తిగా పాన్‌ ఇండియా హీరో అయిపోయారు. అందుకు తగినట్లే ఆయన ఎంచుకునే కథలు ఉంటున్నాయి. ఇక ‘మహానటి’ తీసి జాతీయ స్థాయిలో తనదైన ముద్ర వేశారు నాగ్‌ అశ్విన్‌. వీరిద్దరి (Prabhas and Nag Ashwin) కాంబినేషన్‌లో సినిమా అంటే అంచనాలు భారీగానే ఉంటాయి. అందుకు తగినట్లుగానే ఓ పాన్‌ వరల్డ్‌ సబ్జెక్ట్‌ను ఎంచుకుని పురాణాలను ముడిపెడుతూ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki Movie)తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భారీ బడ్జెట్‌, (Kalki 2898 AD Budget) నాలుగేళ్ల నిర్మాణం, అమితాబ్‌, కమల్‌ వంటి అగ్ర తారాగణం నటించడంతో యావత్‌ భారతీయ సినీ పరిశ్రమ దృష్టిని ఆకర్షించింది. మరి ఆ అంచనాలను ఈ చిత్రం అందుకుందా? ప్రభాస్‌ ఖాతాలో హిట్‌ పడిందా? వెండితెరపై నాగ్‌ అశ్విన్‌చేసిన మేజిక్‌ ఏంటి?

క‌థేంటంటే (Kalki Story): కురుక్షేత్రం త‌ర్వాత ఆరు వేల ఏళ్లకు మొద‌ల‌య్యే క‌థ ఇది. భూమిపై తొలి న‌గ‌రంగా పురాణాలు చెబుతున్న కాశీ, అప్ప‌టికి చివ‌రి న‌గ‌రంగా మిగిలి ఉంటుంది. భూమిపై ఉన్న అన్ని వనరులను పీల్చేసి స్వ‌ర్గంలాంటి కాంప్లెక్స్‌ని నిర్మించి పాలిస్తుంటాడు సుప్రీం యాస్కిన్ (క‌మ‌ల్‌హాస‌న్‌). కాశీలో బౌంటీ ఫైట‌ర్ అయిన భైర‌వ (ప్ర‌భాస్‌) యూనిట్స్‌ని సంపాదించి కాంప్లెక్స్‌కి వెళ్లి అక్క‌డ స్థిర‌ప‌డిపోవాల‌నే ప్ర‌య‌త్నాల్లో ఉంటాడు. సుప్రీం యాస్కిన్ త‌ల‌పెట్టిన ప్రాజెక్ట్ కె కోసం, కాంప్లెక్స్ సైన్యం కాశీకి వ‌చ్చి గర్భం దాల్చే అవకాశాలున్న అమ్మాయిల్ని కొనుగోలు చేసుకుని వెళుతూ ఉంటుంది. అలా ఎంతోమంది అమ్మాయిల్ని ప్రాజెక్ట్‌-కె కోసం గ‌ర్భ‌వ‌తుల్ని చేసి, వారి నుంచి సీరమ్ సేక‌రిస్తూ ప్ర‌యోగాలు చేప‌డుతుంటారు. అలా సుమతి (దీపికా ప‌దుకొణె) కాంప్లెక్స్‌లో చిక్కుకుపోయి గ‌ర్భం దాలుస్తుంది. మ‌రోవైపు రేప‌టి కోసం అంటూ శంబ‌ల ప్ర‌జ‌లు ఎన్నో త్యాగాలు చేస్తూ ఓ త‌ల్లి కోసం ఎదురు చూస్తుంటారు. ఆ త‌ల్లి సుమ‌తి అని న‌మ్ముతారు. మ‌రి ఆమెని కాంప్లెక్స్  ప్ర‌యోగాల నుంచి ఎవ‌రు కాపాడారు? చిరంజీవి అయిన అశ్వ‌త్థామకీ, భైర‌వ‌కీ సంబంధం ఏమిటి?సుప్రీం యాస్కిన్ ప్రాజెక్ట్ - కె (Kalki Telugu Movie) ల‌క్ష్య‌మేమిటి?అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే: హాలీవుడ్ చిత్రాలు చూస్తున్న‌ప్పుడు మ‌నం ఇలాంటి సినిమాలు తీయలేమా? ఇలా ప్ర‌పంచం మొత్తాన్ని కూర్చోబెట్టి మ‌న క‌థలు చెప్ప‌లేమా?అనే ప్ర‌శ్న‌లు త‌లెత్తుతూ ఉంటాయి. ఆ ప్ర‌య‌త్నాన్ని విజ‌య‌వంతంగా మ‌న‌దైన క‌థ‌తో చేసి చూపించారు ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్‌ (Director Nag Ashwin). క‌ళ్లు చెదిరే విజువ‌ల్స్‌, లీనం చేసే క‌థ‌, బ‌ల‌మైన పాత్ర‌ల‌తో మ‌న రేప‌టి సినిమా కోసం బాటలు వేశాడు. హాలీవుడ్ సినిమాల స్ఫూర్తితో కూడిన పాత్ర‌లు, క‌ల్పిత ప్ర‌పంచాలు ఈ సినిమాలో కనిపించిన‌ప్ప‌టికీ, వాటికి మ‌న పురాణాల్ని మేళ‌విస్తూ క‌థ చెప్పిన తీరు అబ్బుర ప‌రుస్తుంది.

కురుక్షేత్ర సంగ్రామం స‌న్నివేశాల‌తో సినిమా ప్రారంభ‌మ‌వుతుంది. క‌థా ప్ర‌పంచాన్ని, పాత్ర‌ల్ని ప‌రిచ‌యం చేస్తూ మెల్ల‌గా అస‌లు క‌థ‌లోకి తీసుకెళుతుంది సినిమా. ప్ర‌భాస్ కూడా ఆల‌స్యంగానే తెర‌పైకొస్తాడు. నీటి జాడ లేని భ‌విష్య‌త్తు కాశీ న‌గ‌రం, ఆక్సిజ‌న్ కోసం, ఆహారం కోసం త‌ల్లడిల్లే ప్ర‌జ‌లు, కాంప్లెక్స్ దురాగ‌తాలు క‌థ‌లో లీనం చేస్తాయి. పాన్ ఇండియా (Pan India) ట్రెండ్ మొద‌ల‌య్యాక అడుగ‌డుగునా హీరోల ఎలివేష‌న్ స‌న్నివేశాల్ని చూపిస్తూ స‌గం సినిమాని న‌డిపిస్తుంటారు ద‌ర్శ‌కులు. (Kalki 2898 AD Review Telugu) కానీ, నాగ్ అశ్విన్ ఇందులో హీరోయిజం కంటే కూడా, క‌థ‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ స‌న్నివేశాల్ని మ‌ల‌చ‌డం విశేషం. క‌థ‌లోని మూడు ప్ర‌పంచాలు వేటిక‌దే భిన్నంగా ఉండేలా ఆవిష్క‌రించిన తీరు క‌ట్టి ప‌డేస్తుంది. ప్ర‌థ‌మార్ధంలో అక్క‌డ‌క్కడా స‌న్నివేశాల్లో కొంత వేగం త‌గ్గిన‌ట్టు అనిపించినా ప్ర‌భాస్‌, అమితాబ్ బ‌చ్చ‌న్ (Amitabh Bachchan) మ‌ధ్య స‌న్నివేశాలు మొద‌లైన‌ప్ప‌టి నుంచి త‌ర్వాత ఏం జ‌రుగుతుంద‌నే ఉత్సుక‌త మొద‌ల‌వుతుంది. చిన్న పిల్ల‌లు సైతం ఇష్ట‌ప‌డేలా ప్ర‌భాస్ పాత్ర కామిక్ ట‌చ్‌తో సాగుతుంది.

ఎవరీ అశ్వత్థామ.. కృష్ణుడు అతడికి ఇచ్చిన శాపం ఏంటి?

ప్ర‌భాస్ చేసే తొలి ఫైట్‌, కాంప్లెక్స్‌లో దిశా ప‌టానీతో క‌లిసి చేసే సంద‌డి, విరామానికి ముందు వ‌చ్చే స‌న్నివేశాలు ప్రథమార్ధానికి హైలైట్‌. ద్వితీయార్ధంలోనూ అమితాబ్, ప్ర‌భాస్ మ‌ధ్య స‌న్నివేశాలు, సుమ‌తి పాత్రతో ముడిప‌డిన క‌థ కీల‌కం.  ప‌తాక స‌న్నివేశాలు సినిమాని మ‌రో స్థాయిలో నిల‌బెట్టాయి. భార‌తీయ పురాణాల్లోని సూప‌ర్‌హీరోలు ఎలా ఉంటారో  మచ్చుకు కొంచెం చాటేలా ఉంటాయి ఆ స‌న్నివేశాలు. రెండో భాగం సినిమా క‌థ భైరవ Vs యాస్కిన్‌తో ఉంటుంద‌నే సంకేతాలతో తొలి భాగం క‌థ ముగుస్తుంది. ప్రభాస్‌ (Prabhas) పాత్రకు సంబంధించి క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌ అభిమానులతో విజిల్స్‌ వేయించడం ఖాయం. భ‌విష్య‌త్తు కాశీకీ, కాంప్లెక్స్‌కీ మ‌ధ్య కొన్ని స‌న్నివేశాలు లాజిక్‌కి దూరంగా ఉన్నా, వెండితెరపై ఓ కొత్త ప్ర‌పంచాన్ని తెర‌పై ఆవిష్క‌రించ‌డంలో ద‌ర్శ‌క‌నిర్మాత‌లు, సాంకేతిక బృందం విజ‌య‌వంత‌మైంది. భార‌తీయ సినిమాని మ‌రో మెట్టు ఎక్కించిన సినిమాగా ఇది నిలుస్తుంది.

ఎవ‌రెలా చేశారంటే: ప్ర‌భాస్ (Actor Prabhas) త‌న క‌టౌట్‌కి త‌గ్గ పాత్ర‌లో ఒదిగిపోయారు. కథే ప్ర‌ధానంగా సాగే సినిమా కావ‌డంతో ప్ర‌భాస్‌తో పాటు ఇత‌ర పాత్ర‌లూ బ‌లంగా క‌నిపిస్తాయి. కొన్నిసార్లు క‌థంతా అమితాబ్ బ‌చ్చ‌న్‌, దీపికా ప‌దుకొణె చుట్టూనే సాగుతున్న‌ట్టు అనిపిస్తుంది. అమితాబ్ బ‌చ్చ‌న్ ఇమేజ్‌, ఆయ‌న న‌ట‌న ఈ సినిమా (Kalki Prabhas Movie)కి బాగా ఉప‌యోగ‌ప‌డింది. ఈ వ‌య‌సులోనూ ఆయన పోరాట ఘ‌ట్టాలు చేసిన తీరు ప్రేక్ష‌కుల్ని క‌ట్టి ప‌డేస్తుంది. (Kalki 2898 Movie Review) బాహుబ‌లి ప్ర‌భాస్ క‌టౌట్‌కి దీటుగా క‌నిపించే పాత్ర‌లో మ‌రొక‌రిని ఊహించ‌లేని విధంగా అమితాబ్ బ‌చ్చ‌న్ న‌టించారు. డీ గ్లామ‌ర‌స్‌గానే అయినా దీపికా పదుకొణె (Deepika Padukone) బ‌ల‌మైన పాత్ర‌లో క‌నిపిస్తుంది. దిశా ప‌టానీ పాత్ర అలా మెరిసి, ఇలా మాయ‌మైపోతుంది. శోభ‌న, అన్నాబెన్‌, ప‌శుప‌తి, మాన‌స్ పాత్ర‌లో స్వాస్థ్‌ ఛటర్జీ త‌దిత‌రులు పోషించిన పాత్ర‌ల ప‌రిధి త‌క్కువే అయినా ప్ర‌భావం చూపించారు. బ్ర‌హ్మానందం, ప్ర‌భాస్‌తో క‌లిసి కొన్ని న‌వ్వులు పంచారు.

సుప్రీమ్‌  యాస్కిన్‌గా విల‌న్ పాత్ర‌లో క‌మ‌ల్‌హాస‌న్ (Kamal Hasaan) క‌నిపిస్తారు. ఆయ‌న గెట‌ప్ భ‌య‌పెట్టేలా ఉంటుంది. ఇందులో ఆ పాత్ర ప‌రిధి త‌క్కువే అయినా, ప‌రిచ‌యం చేసిన తీరు, మంచిత‌నం ఎలా మారుతుందో చెప్పే కొన్ని  మాట‌లు ఆలోచింప‌జేస్తాయి. రెండో భాగంలో మాత్రం భూకంపమే అని సంకేతాలిచ్చారు. మరోవైపు మూడు గంటలు నిడివి (Kalki Movie Time Duration) ఉన్నా సినిమా అలా సాగిపోతూ ఉండటానికి కారణం అతిథి పాత్రలు. అవి కనిపించిన ప్రతిసారీ థియేటర్‌లో ఓ జోష్‌ వస్తుంది. (kalki Review Telugu) సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయిన పేర్లు రామ్‌గోపాల్‌ వర్మ, రాజమౌళి, విజయ్‌ దేవరకొండ, మృణాళ్‌ ఠాకూర్‌, దుల్కర్‌ సల్మాన్‌ తదితర పాత్రలు కథానుసారం ప్రవేశపెట్టిన తీరు అలరిస్తుంది.

‘కల్కి’ మూవీకి వెళ్తున్నారా? ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా?

సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. సంతోష్‌నారాయ‌ణ్ నేప‌థ్య సంగీతం, జోర్డే కెమెరా ప‌నిత‌నం చిత్రానికి ప్ర‌ధాన‌బ‌లం. ప్రొడ‌క్ష‌న్ డిజైన్, విజువ‌ల్ ఎఫెక్ట్స్ సినిమాని మ‌రోస్థాయిలో నిల‌బెట్టాయి. ‘నిజానికి నమ్మకంతో పనిలేదు సమయం వచ్చినప్పుడు కళ్ల ముందే కనిపిస్తుంది’ వంటి సంభాషణలు బాగున్నాయి. ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ విజువ‌లైజేష‌న్‌, ఆయ‌న చెప్పిన క‌థ మ‌న‌సుల్ని హ‌త్తుకుంటుంది. వైజ‌యంతీ మూవీస్ సంస్థ నిర్మాణం స్ఫూర్తి దాయ‌కం. ఆ సంస్థ యాభ‌య్యేళ్ల ప్ర‌యాణానికి దీటైన సినిమా ఇది.  

  • బ‌లాలు
  • + భార‌తంతో ముడిప‌డిన క‌థ..
  • ప్ర‌భాస్‌, అమితాబ్ బ‌చ్చ‌న్ మ‌ధ్య స‌న్నివేశాలు
  • విజువ‌ల్స్‌, సంగీతం, ఛాయాగ్ర‌హ‌ణం
  • బ‌ల‌హీన‌త‌లు  
  • - అక్కడక్కడా నెమ్మ‌దిగా సాగే కొన్ని స‌న్నివేశాలు
  • చివ‌రిగా...: ‘క‌ల్కి 2898 ఏడీ’.. ఇది మ‌రో ప్ర‌పంచానికి ఆరంభం (Kalki 2898 AD Review)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు