Paruchuri: ‘ఈనాడు’ అంటే ప్రజలకు అంత నమ్మకం: పరుచూరి గోపాలకృష్ణ

రామోజీరావుతో ఉన్న అనుబంధాన్ని పరుచూరి గోపాలకృష్ణ గుర్తుచేసుకున్నారు. క్రమశిక్షణకు, నమ్మకానికి రామోజీ మారుపేరని కొనియాడారు. 

Published : 29 Jun 2024 17:37 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రామోజీ గ్రూప్‌ సంస్థల అధినేత రామోజీరావు జీవితం నుంచి ఎన్నో మంచి పాఠాలు నేర్చుకోవచ్చని ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopala Krishna) అన్నారు. క్రమశిక్షణకు, నమ్మకానికి రామోజీ మారుపేరని కొనియాడారు. ఆయన గొప్పతనాన్ని వివరిస్తూ పరుచూరి ప్రత్యేక వీడియో షేర్‌ చేశారు. రామోజీ (Ramoji Rao) సంస్మరణ సభను ఏర్పాటు చేసినందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి పరుచూరి కృతజ్ఞతలు చెప్పారు. 

‘ఏ పత్రికలో అయినా వార్త వస్తే.. ఇది ‘ఈనాడు’లో వచ్చిందా అని ప్రజలు అడుగుతారు. అంటే ఈనాడులో వస్తే ఏ వార్తనైనా నమ్మొచ్చని దానర్థం. రామోజీరావు జర్నలిజం విషయంలో రాజీపడలేదు. ఆయన పడినన్ని ఇబ్బందులు, చేసినన్ని పోరాటాలు ఎవరూ చేయలేదు. ఒక పత్రికాధిపతిగా ఆయనకు హ్యాట్సాఫ్ చెప్పాలి. నిజాలే రాయమని చెప్పేవారు. నందమూరి తారకరామారావు, రామోజీరావు ఇద్దరూ భారతరత్నకు అర్హులు. సినిమా రంగంలో ఎన్టీఆర్‌ (NTR), పత్రికా రంగంలో రామోజీ ఎన్నో అద్భుతాలను సృష్టించారు. వీళ్లిద్దరూ ప్రపంచానికి దశ, దిశ నిర్దేశించిన మహానుభావులు. ఈసారి భారతరత్న అవార్డులను ప్రకటించే సమయంలో ఈ ఇద్దరికీ (ఎన్టీఆర్‌, రామోజీరావు) ఇవ్వాలని తెలుగువారందరి తరఫున ప్రధాని మోదీని కోరుతున్నాను’. 

‘కల్కి’ పార్ట్‌-2 రిలీజ్‌ ఎప్పుడంటే? ఆసక్తికర విషయాలు చెప్పిన అశ్వనీదత్‌

‘మా కుటుంబానికి రామోజీతో (Ramoji Rao) మంచి అనుబంధం ఉంది. ఆయన నిర్మించిన ‘మౌనపోరాటం’ సినిమా కోసం మొదటిసారి మేం వర్క్ చేశాం. రామోజీ ఎప్పుడూ సందేశాత్మక చిత్రాలనే నిర్మించేవారు. ఆయనకు చాలా విషయాలపై పట్టు ఉండేది. ‘మౌనపోరాటం’ కోసం చర్చలు జరిపినప్పుడు ఆ విషయం అర్థమైంది. ‘మయూరి’ సినిమా ఒక సంచలనం. ఎంతో ధైర్యంగా తీసి విజయాన్ని అందుకున్నారు. సినిమా, పత్రిక ఇవి రెండూ ఆయనకు రెండు కళ్లు. గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి’ అంటూ రామోజీరావుతో ఉన్న అనుబంధాన్ని పరుచూరి గోపాలకృష్ణ గుర్తుచేసుకున్నారు. ఆరోగ్యం సహకరించని కారణంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్మరణ సభకు హాజరుకాలేకపోయినట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు