sita ramam: అలా తీసుంటే ‘సీతారామం’ వేరే లెవెల్లో ఉండేది : పరుచూరి గోపాలకృష్ణ

 పరుచూరి పాఠాల ద్వార తాజా సినిమాలపై తన అభిప్రాయం చెబుతున్నారు ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ(Paruchuri Gopala Krishna). తాజాగా ఆయన గతనెలలో(ఆగస్టు 5) విడుదలై మంచి విజయం సాధించిన సీతారామం(Sita Ramam)పై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. హృద్యమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి, భారీ విజయం సాధించిన...

Published : 10 Sep 2022 01:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పరుచూరి పాఠాల ద్వారా తాజా సినిమాలపై తన అభిప్రాయం చెబుతున్నారు ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ(Paruchuri Gopala Krishna). తాజాగా ఆయన ‘సీతారామం’(Sita Ramam)పై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. హృద్యమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి, భారీ విజయం సాధించిన ఈ చిత్రం తనకూ నచ్చిందని ఆయన తెలిపారు. విభిన్న పార్శ్వాలను స్పృశించే ప్రేమ, ఆకట్టుకునే యుద్ధ నేపథ్యం, ప్రేక్షకుల మదిలో అలజడి రేపే విషాదాంతంలాంటి అంశాలు సినిమాను మరుపురాని చిత్రంగా నిలబెట్టాయన్నారు.

గతంలో ఇదే నేపథ్యంతో వచ్చిన కొన్ని సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుని, కమర్షియల్‌గానూ విజయం సాధించాయని పరుచూరి తెలిపారు. ముఖ్యంగా షారుఖ్‌ ఖాన్‌, ప్రీతీ జింటా, రాణీ ముఖర్జీ ప్రధాన పాత్రలు పోషించిన వీర్‌జారా(Veer-Zaara)(2004) చిత్రం కూడా ఇదే కథాంశం అని ఆయన గుర్తు చేశారు. కానీ సగటు ప్రేక్షకుడు ఆశించే సుఖాంతానికి తావివ్వకుండా, దర్శకుడు సినిమాని విషాదాంతంగా ముగించడంతో ‘సీతారామం’ భిన్నమైన ప్రేమకథ చిత్రంగా నిలిచిందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే క్లైమాక్స్‌లో వాళ్లిద్దరూ కలిసినట్లు సినిమాని మార్చి ఉంటే వేరే లెవెల్లో ఉండేదని, హీరో పాత్రను ప్రశ్నార్థకంగా ముగించేయడం ప్రేక్షకులను కంటతడి పెట్టించిందని ఆయన తెలిపారు.

ఏదేమైనా చక్కని ప్రేమకావ్యం తీయడంలో దర్శకుడు హను రాఘవపూడి(Hanu Raghavapudi) కృతార్థుడయ్యాడని పరుచూరి ప్రశంసించారు. ఇంకా ఈ చిత్రంలో నటించిన దుల్కర్‌ సల్మాన్(Dulquer Salmaan)‌, మృణాల్‌ ఠాకూర్(Mrunal Thakur)‌, రష్మిక (Rashmika Mandanna) తమ నటనతో సన్నివేశాలను రక్తి కట్టించారని ఆయన తెలిపారు. తక్కువ నిడివి ఉన్న పాత్రలకు సైతం పెద్ద నటులను తీసుకుని, ఏ మాత్రం రాజీపడకుండా ఉన్నత విలువలతో ‘సీతారామం’ ను నిర్మించిన అశ్వనీదత్‌, ఆయన కుమార్తెలను అభినందించాల్సిందేనని పరుచూరి అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని