SPY Trailer: చరిత్రని వెతికిన.. స్పై

‘‘అన్నీ చేయి దాటిపోతున్నప్పుడే కదా...  మనం వేరే దారుల్ని వెతుక్కుంటాం’’ అంటున్నారు నిఖిల్‌. ఆయన ఓ గూఢచారి పాత్రలో ఎలాంటి దారుల్ని వెతుక్కుని తన మిషన్‌ని పూర్తి చేశాడో తెలియాలంటే ‘స్పై’ చూడాల్సిందే.

Updated : 23 Jun 2023 07:10 IST

‘‘అన్నీ చేయి దాటిపోతున్నప్పుడే కదా...  మనం వేరే దారుల్ని వెతుక్కుంటాం’’ అంటున్నారు నిఖిల్‌ (Nikhil Siddharth). ఆయన ఓ గూఢచారి పాత్రలో ఎలాంటి దారుల్ని వెతుక్కుని తన మిషన్‌ని పూర్తి చేశాడో తెలియాలంటే ‘స్పై’ చూడాల్సిందే. ఆయన  కథానాయకుడిగా తెరకెక్కిన పాన్‌ ఇండియా చిత్రమిది. ఐశ్వర్య మేనన్‌ కథానాయిక. సన్యా మేనన్‌, ఆర్యన్‌ రాజేశ్‌, అభినవ్‌ గోమటం కీలక పాత్రలు పోషించారు. గ్యారీ బీహెచ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనే ఎడిటర్‌. కె.రాజశేఖర్‌ రెడ్డి కథని సమకూరుస్తూ, స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ నెల 29న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా గురువారం ట్రైలర్‌ని (SPY Trailer) విడుదల చేశారు.

‘చరిత్ర మనకు ఎప్పుడూ నిజం చెప్పదు. దాస్తుంది. దానికి సమాధానం మనమే వెతకాలి’ అంటూ మొదలయ్యే ట్రైలర్‌లో... ‘స్వాతంత్య్రం అంటే ఒకరు ఇచ్చేది కాదు, లాక్కునేది. ఇది నేను చెప్పింది కాదు, నేతాజీ చెప్పింది’ అంటూ కథానాయకుడు రానా దగ్గుబాటి తళుక్కున మెరవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇందులో ఆయన అతిథి పాత్రలో నటించారు. కీలకమైన ఓ మిషన్‌ బాధ్యతల్ని భుజాన వేసుకున్న జై అనే గూఢచారి పాత్రలో నిఖిల్‌ నటించినట్టు స్పష్టమవుతోంది.

ట్రైలర్‌ విడుదల కార్యక్రమాన్ని గురువారం  హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా నిఖిల్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలో  వివాదానికి దారితీసే అంశాలేమీ ఉండవు. సినిమా ఎవరినీ ఇబ్బంది పెట్టేలా ఉండదు. చరిత్రలో మనకి తెలియని కోణాన్ని ఇందులో చూస్తారు. దక్షిణాది భాషలతోపాటు, హిందీలోనూ, బెంగాలీ, మరాఠీ భాషల్లోనూ సినిమాని విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్రబృందం  పాల్గొంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని