Nenu student sir: ఓటీటీలోకి ‘నేను స్టూడెంట్‌ సర్‌’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

బెల్లంకొండ గణేశ్‌ హీరోగా దర్శకుడు ఉప్పలపాటి రాకేశ్‌ తెరకెక్కించిన చిత్రం.. ‘నేను స్టూడెంట్‌ సర్‌’. అవంతిక దస్సాని హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది.

Published : 03 Jul 2023 18:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘స్వాతిముత్యం’తో తొలి ప్రయత్నంలోనే హీరోగా మెప్పించిన బెల్లంకొండ గణేశ్‌ (Bellamkonda Ganesh) చేసిన ద్వితీయ ప్రయత్నం.. ‘నేను స్టూడెంట్‌ సర్‌’ (Nenu student sir). ఈ సినిమా ఓటీటీ (ott) విడుదల తేదీ తాజాగా ఖరారైంది. తెలుగు ఓటీటీ ‘ఆహా’ (aha)లో జులై 14 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కానుంది. ఈ వివరాలు తెలియజేస్తూ ‘స్టూడెంట్‌ వచ్చేస్తున్నాడు..! థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌కి సిద్ధమవ్వండి’ అని సదరు సంస్థ పేర్కొంది. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా కొత్త పోస్టర్‌ని పంచుకుంది. రాకేశ్‌ ఉప్పలపాటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా థియేటర్లలో జూన్‌ 2న విడుదలైన సంగతి తెలిసిందే.

ఈ స్టూడెంట్‌ కథేంటంటే: సుబ్బు అలియాస్‌ సుబ్బారావు (బెల్లంకొండ గణేశ్‌) ఫోరెన్సిక్‌ స్టూడెంట్‌. వివేకానంద యూనివర్సిటీలో చదువుతుంటాడు. తనకు ఐఫోన్‌ అంటే చాలా ఇష్టం. రాత్రింబవళ్లూ కష్టపడి.. రూ. 90 వేలు పోగేసి ఐఫోన్‌ 12 సిరీస్‌ కొనుక్కుంటాడు. దానికి బుచ్చిబాబు అని పేరు పెట్టుకొని సొంత తమ్ముడిలా చూసుకుంటుంటాడు. ఓ రోజు కాలేజీలో జరిగిన విద్యార్థుల అల్లర్ల విషయంలో అందరితో పాటు సుబ్బును కూడా పోలీసులు అరెస్టు చేస్తారు. ఆ సమయంలో వారు విద్యార్థులందరి నుంచి ఫోన్లు రికవరీ చేసుకుంటారు. ఆ తర్వాత తన ఫోన్‌ తిరిగి తీసుకునేందుకు స్టేషన్‌కు వెళ్లగా.. సుబ్బుకు ఫోన్‌ దొరకదు. దాన్ని స్టేషన్‌లోని పోలీసులే కొట్టేశారని అనుమానించిన సుబ్బు.. వారిపై కేసు పెట్టేందుకు పోలీస్‌ కమిషనర్‌ అర్జున్‌ వాసుదేవన్‌ (సముద్ర ఖని) వద్దకు వెళ్తాడు. కానీ, వాసుదేవన్‌ ఆ ఫిర్యాదు తీసుకునేందుకు అంగీకరించకపోవడంతో.. తన ఫోన్‌ను ఎలాగైనా తిరిగి దక్కించుకునేందుకు మరో పథకం వేస్తాడు సుబ్బు. ఆ కమిషనర్‌ కూతురు శ్రుతి వాసుదేవన్‌ (అవంతిక దస్సాని)కు దగ్గరై తన ఫోన్‌ను దక్కించుకోవాలని ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో అనుకోకుండా ఓ హత్య కేసులో చిక్కుకుంటాడు సుబ్బు. అదే సమయంలో తన బ్యాంక్‌ ఖాతాకు రూ. 1.75 కోట్లు జమవుతాయి. మరి, సుబ్బును హత్య కేసులో ఇరికించిందెవరు? తన ఫోన్‌ పోవడానికి కమిషనర్‌కు ఏమైనా సంబంధం ఉందా? ఈ కేసు నుంచి సుబ్బు ఎలా బయటపడ్డాడు? తన ఫోన్‌ తిరిగి దొరికిందా? లేదా? శ్రుతితో అతని ప్రేమకథ ఏమైంది? అన్నది మిగతా కథ.

పూర్తి రివ్యూ కోసం క్లిక్‌ చేయండి..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని