RaviTeja: ప్రతి తరానికీ రవితేజలాంటి వారుంటారు.. అది మాటల్లో చెప్తే అర్థం కాదు: నాని

రవితేజ అన్న గురించి మాట్లాడే అవకాశం లభిస్తుందనే ఉద్దేశంతో ఈ వేడుకకు వచ్చా. రవితేజ అన్నకు చిరంజీవి స్ఫూర్తి అయితే నాకు రవితేజ స్ఫూర్తి. ఇప్పుడాయన చిరంజీవితో కలిసి నటిస్తున్నారు.

Published : 24 Jul 2022 23:16 IST

హైదరాబాద్‌: రవితేజ (RaviTeja) ప్రభుత్వాధికారిగా నటించిన చిత్రం ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ (RamaRao On Duty). దివ్యాంశ కౌశిక్‌ (Divyansha Kaushik), రజిషా విజయన్‌ (Rajisha Vijayan). కథానాయికలు. శరత్‌మండవ (Sarath Mandava) దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రీ రిలీజ్‌ ఈవెంట్ నిర్వహించింది. నటుడు నాని (Nani), దర్శకుడు బాబీ ముఖ్య అతిథిగా హాజరై, సందడి చేశారు.

వేడుకనుద్దేశించి నాని మాట్లాడుతూ.. ‘‘రవితేజ అన్న గురించి మాట్లాడే అవకాశం లభిస్తుందనే ఉద్దేశంతోనే ఈ వేడుకకు వచ్చా. రవితేజ అన్నకు చిరంజీవి స్ఫూర్తి అయితే నాకు రవితేజ స్ఫూర్తి. ఇప్పుడాయన చిరంజీవితో కలిసి నటిస్తున్నారు. అలానే ఆయన సినిమాలో నేనూ నటించాలనుకుంటున్నా. ‘నేను అనుకున్నది సాధించాను కదా నువ్వు ఎందుకు సాధించలేవ్‌’ అని ధైర్యాన్నిచ్చే రవితేజలాంటి నటులు ప్రతి తరానికీ  ఒకరుంటారు. ఆయనకు ఏదైనా సినిమా నచ్చితే తప్పకుండా ఆయా చిత్ర బృందాల్ని ప్రశంసిస్తాడు. రవితేజ వరుసగా సినిమాల్లో నటిస్తూ సినీ కార్మికులకు ఎంత సాయం చేశాడో మాటల్లో చెప్తే మీకు అర్థం కాదు. 20 ఏళ్ల నుంచి ‘రవితేజ ఆన్‌ డ్యూటీ’.. 29 నుంచి ‘రామారావు ఆన్‌ డ్యూటీ’. ‘హనుమాన్‌ జంక్షన్‌’ సినిమాలో వేణు తొట్టెంపూడి చేసిన ‘ఆవు’ సీన్‌ నా ఫేవరెట్‌. కొన్నాళ్ల తర్వాత ఆయన మళ్లీ సినిమాల్లోకి రావడం సంతోషంగా ఉంది’’ అని నాని అన్నారు. ‘‘పవన్‌ కల్యాణ్‌తో ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ సినిమా తెరకెక్కించే అవకాశం వచ్చినప్పుడు నా కుటుంబం కంటే ముందు రవితేజకే చెప్పా. ఆయన భుజం తట్టి ధైర్యంగా ముందుకు పంపించారు. ఆ చిత్రం ఆశించిన ఫలితం అందుకోలేదు. అయినా, నాకు ఫోన్‌ చేసి సినిమా కోసం ఓ కథ అడిగారు. రవితేజ ఏదైనా సెట్‌ చేయటమే కాదు రీసెట్‌ కూడా చేస్తారు’’ అని దర్శకుడు బాబీ అన్నారు.

రవితేజ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా సాంకేతిక నిపుణులతో తొలిసారి కలిసి పనిచేశా. జాతీయ అవార్డు గ్రహీత ఎడిటర్‌ ప్రవీణ్‌, సినిమాటోగ్రాఫర్‌ సత్యన్‌సూర్యన్‌, సంగీత దర్శకుడు సామ్‌ సీ.. ఇలా ప్రతి ఒక్కరూ తమ విభాగాలకు వందశాతం న్యాయం చేశారు. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా నాని అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడ ఇంతకు ముందు ప్రదర్శించిన ఓ వీడియోలో ‘తెలుగు ఇండస్ట్రీలోని గొప్ప నటుల్లో ఒకరు’ అని ఆయన గురించి అన్నారు. దక్షిణాది చిత్ర పరిశ్రమలోని గొప్ప నటుల్లో ఒకడు. వేణు తొట్టెంపూడితో కలిసి గతంలో ‘స్వయంవరం’ అనే సినిమా చేయాలి కానీ అది మిస్‌ అయింది. ఇప్పుడు ‘రామారావు’లో కలిసి నటించాం. మా దర్శకుడు శరత్‌ ఇచ్చినన్ని ఇంటర్వ్యూలు ఏ దర్శకుడూ ఇచ్చి ఉండడు. ఇది ఆయన తొలి సినిమాలా అనిపించదు’’ అని రవితేజ తెలిపారు. ఈ కార్యక్రమంలో వేణు తొట్టెంపూడి, చిత్ర  కథానాయికలు తదితరులు పాల్గొన్నారు.







Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు