Usha Mulpuri: అందుకే నిర్ణయం మార్చుకున్నా

‘మా అబ్బాయితోనే కాకుండా... వేరే హీరోలతోనూ సినిమాలు చేస్తాం’ అన్నారు ఉషా మూల్పూరి. ఐరా క్రియేషన్స్‌ పతాకంపై వరుసగా సినిమాలు రూపొందిస్తున్న నిర్మాత ఆమె. యువ కథానాయకుడు నాగశౌర్యకి తల్లి. ప్రస్తుతం ‘కృష్ణ వ్రింద విహారి’ సినిమాని నిర్మిస్తున్నారు.

Updated : 25 Aug 2022 07:06 IST

‘మా అబ్బాయితోనే కాకుండా... వేరే హీరోలతోనూ సినిమాలు చేస్తాం’ అన్నారు ఉషా మూల్పూరి. ఐరా క్రియేషన్స్‌ పతాకంపై వరుసగా సినిమాలు రూపొందిస్తున్న నిర్మాత ఆమె. యువ కథానాయకుడు నాగశౌర్యకి (Naga Shourya) తల్లి. ప్రస్తుతం ‘కృష్ణ వ్రింద విహారి’ (Krishna Vrinda Vihari) సినిమాని నిర్మిస్తున్నారు. నాగశౌర్య కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్‌ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఉషా మూల్పూరి బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...

‘‘మరో మంచి సినిమా చేయాలని ఎదురు చూస్తున్న సమయంలోనే ఈ కథని నాగశౌర్య విని నాకు చెప్పారు. చాలా నచ్చింది. మొదట ఒక తల్లిగా కథకి కనెక్ట్‌ అయ్యాను. దాంతో కరోనా సమయంలోనే సినిమాని మొదలుపెట్టా. ఒక పల్లెటూరికి చెందిన బ్రాహ్మణ కుర్రాడిగా, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా నాగశౌర్య కనిపిస్తాడు. మా పెద్దబ్బాయి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగే. ఓ కొడుకుగా, ప్రేమికుడిగా, భర్తగా, స్నేహితుడిగా... ఇలా భిన్న కోణాల్లో నాగశౌర్య పాత్ర కనిపిస్తుంది. తన కెరీర్‌లో ఉత్తమమైన చిత్రం అవుతుందని నమ్మా. కరోనాలో ఇబ్బందులెదురయ్యాయి. అన్ని అధిగమించి సినిమాని సెప్టెంబర్‌ 23న విడుదల చేయాలని నిర్ణయించాం’’.

* ‘‘పాత్ర కోసం నాగశౌర్య రెండు నెలలు శిక్షణ తీసుకున్నారు. దర్శకుడు ఓ ట్రైనర్‌ని ఏర్పాటు చేశారు. డబ్బింగ్‌ పరంగానూ చాలా శ్రద్ధ తీసుకుని చేశారు. అనీష్‌ తనదైన శైలిలో ఈ సినిమాని చాలా బాగా తీర్చిదిద్దాడు.  టాలీవుడ్‌కి హీరోయిన్ల కొరతని తీరుస్తుంది షెర్లీ సెటియా. ఇందులో తను వ్రిందా పాత్రలో కనిపిస్తుంది. హీరో పేరేమో కృష్ణ. అందుకే సినిమాకి ‘కృష్ణ వ్రింద విహారి’ అని పేరు పెట్టాం’’.

* ‘‘ఒక నిర్మాతగా ఎప్పటికప్పుడు కథలు వింటూనే ఉంటా. పరిశ్రమకి నేను అనుకోకుండానే వచ్చా. ఎప్పటికప్పుడు చేస్తున్న ఈ సినిమా పూర్తయ్యాక వెళ్లిపోదామనే ఆలోచనలోనే ఉంటాను. ఈ సినిమా జరిగేటప్పుడు ఇదే చివరి చిత్రం అనుకున్నా. మా స్నేహితులు, శ్రేయోభిలాషుల  సలహాతో నిర్ణయం మార్చుకున్నా. అందుకే ఇక నుంచి మా అబ్బాయితోనే కాకుండా... వేరే హీరోలతో సినిమాలు చేయాలనే ఆలోచన ఉంది’’.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని