Nag Ashwin: ఆరోజు భయపడ్డాం.. ఈరోజు సాధించాం: వైరలవుతోన్న నాగ్ అశ్విన్‌ పోస్ట్‌..

తన కెరీర్‌ ప్రారంభంలో ఎదురైన సంఘటనను దర్శకుడు నాగ్ అశ్విన్‌ గుర్తుచేసుకున్నారు. స్వప్నదత్‌, ప్రియాంక దత్‌లతో దిగిన ఫొటోను పంచుకున్నారు.

Published : 01 Jul 2024 17:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుతం ఎక్కడ విన్నా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) పేరే వినిపిస్తోంది. ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD)తో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకర్షించారు. అయితే, తన ప్రయాణం సులభం కాదని.. కెరీర్‌ ప్రారంభంలో ఎదుర్కొన్న ఓ సంఘటనను ఆయన తాజాగా గుర్తుచేసుకుంటూ పోస్ట్ పెట్టారు. అది వైరల్‌గా మారింది.

‘‘సుమారు 10ఏళ్ల క్రితం మేం ముగ్గురం (నాగ్‌ అశ్విన్‌, ప్రియాంక దత్‌, స్వప్న దత్‌) కలిసి మా తొలి చిత్రం ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ ప్రారంభించాం. నిర్మాణ సంస్థ అప్పుడు ఉన్న పరిస్థితుల్లో దాన్ని తెరకెక్కించడం రిస్క్‌తో కూడుకున్నది. ఎంతో జాగ్రత్తగా దాన్ని రూపొందించాం. అప్పటి ఓ సంఘటన నాకింకా గుర్తుంది. ఒక రోజు వర్షం కారణంగా షూటింగ్ చేయలేకపోయాం. దీంతో మరుసటి రోజు మళ్లీ సెటప్‌ వేయాల్సి వచ్చింది. దానికి అదనంగా చాలా ఖర్చయింది. దీంతో భయాందోళనలకు గురయ్యాం. సరిగ్గా 10 ఏళ్ల తర్వాత.. ఇప్పుడు మా ప్రతి సినిమా బాక్సాఫీస్‌ వద్ద విజయం సాధించడమే కాదు.. సినిమా చరిత్రలో మైలు రాళ్లుగా నిలుస్తున్నాయి. ఇలా గుర్తింపు తెచ్చుకోవడం ఎంతో ఆనందంగా, గర్వంగా ఉంది. వీళ్లిద్దరి మధ్యలో నిల్చోవడం అదృష్టంగా భావిస్తున్నా. మాలోని లోపాలను మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగుతాం. మమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్నందకు మీ అందరికీ ధన్యవాదాలు’’ అని నాగ్ అశ్విన్‌ రాసుకొచ్చారు.

రికార్డులు సృష్టిస్తున్న ‘కల్కి’.. రూ.500 కోట్ల క్లబ్‌లో చేరిక

ఇక ఈ పోస్ట్‌కు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. ‘ఇది చదువుతుంటే భావోద్వేగంతో కన్నీళ్లు వస్తున్నాయి’ అని స్వప్నదత్‌ కామెంట్ చేశారు. మీ నుంచి మరెన్నో అద్భుతమైన చిత్రాలు రావాలని కోరుకుంటున్నాం అని ఫ్యాన్స్ రిప్లై ఇస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని