Nag Ashwin: ‘కల్కి’లో కృష్ణుడిగా మహేశ్‌బాబు: నాగ్‌ అశ్విన్‌ సమాధానమేంటంటే?

‘కల్కి 2898 ఏడీ’ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ మీడియాతో ముచ్చటించారు. ఆ సినిమా గురించి పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు.

Updated : 05 Jul 2024 20:50 IST

హైదరాబాద్‌: ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD)తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin). ప్రభాస్‌ (Prabhas) హీరోగా ఆయన తెరకెక్కించిన సినిమా ఇది. ఆ మూవీ సెట్స్‌లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో నాగ్‌ అశ్విన్‌ పాల్గొన్నారు. సినిమా విజయంపై ఆనందం వ్యక్తం చేస్తూ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆ వివరాలివీ..

టైటిల్‌ని బట్టి ప్రభాసే కల్కిగా కనిపిస్తారని అందరూ అనుకున్నారు. కానీ, ఆయన్ను కర్ణుడిగా చూపించారు. మరి కల్కిగా నటించేదెవరు?

నాగ్‌ అశ్విన్‌: దానికి ఇంకా చాలా సమయం ఉంది.

ఇతిహాసాలను ఈ కథతో ముడిపెట్టాలనే ఆలోచన ఎలా వచ్చింది?

నాగ్‌ అశ్విన్‌: తెలుగు సినిమా అనగానే చాలామందికి ‘మాయాబజార్‌’ గుర్తొస్తుంది. అది ఓ రకంగా మహాభారతం ఆధారంగా రూపొందిందే. అక్కడి నుంచే నేను స్ఫూర్తి పొందా.

భవిష్యత్తు కాశీ గురించి చెప్పినప్పుడు ఒక్క సీన్‌లోనే పెయిన్‌ ఉన్నట్టు కనిపించింది. మిగిలిందంతా వినోదాత్మకంగా సాగుతుంది. ఎందుకని? శంబల ప్రజల పోరాట లక్ష్యమేంటి?

నాగ్‌ అశ్విన్‌: హీరో పాత్ర భైరవను సీరియస్‌గా కాకుండా సరదాగా ఉండాలనే ఉద్దేశంతోనే అలా క్రియేట్‌ చేశా. సినిమాని ఇంకా డార్క్‌గా చూపించాలని అనుకోలేదు. కాంప్లెక్స్‌.. వనరులన్నింటినీ స్వాధీనం చేసుకుంటుంది. దానిపైనే శంబల ప్రజల పోరాటం. దీని గురించి పార్ట్‌ 2లో మరింత స్పష్టత వస్తుంది.

ఈ చిత్రాన్ని పార్ట్‌లుగా చేయాలని ఎప్పుడనుకున్నారు?

నాగ్‌ అశ్విన్‌: ముందుగా ఒక్క సినిమాగానే ఈ కథను తెరకెక్కించాలనుకున్నా. కొన్ని షెడ్యూల్స్ చిత్రీకరణ పూర్తయిన తర్వాత ఇంత పెద్ద స్టోరీని ఒక్క భాగంలో చెప్పడం సవాలు అనిపించింది. అప్పుడే పార్ట్‌లుగా చూపించాలని నిర్ణయించుకున్నా. పార్ట్‌ 2కి సంబంధించిన 20 రోజులు చిత్రీకరణ చేశాం.

ఈ సినిమా విషయంలో ‘ఇది మైథాలజీనా, చరిత్రా?’ అనే చర్చ జరుగుతోంది. దానిపై మీ అభిప్రాయం?

నాగ్‌ అశ్విన్‌: చరిత్రగానే మేం కథను చెప్పాం. కానీ, మ్యాజికల్‌ పవర్స్‌పై నాకు నమ్మకం ఉంది.

రాజమౌళికి తగ్గ దర్శకుడు నాగ్ అశ్విన్‌ అనే టాక్‌ నడుస్తోంది. మీరేమంటారు?

నాగ్‌ అశ్విన్‌:  అలా ఎవరూ అనలేదు.. మీరే అంటున్నారు (నవ్వుతూ)

అగ్ర నటులతో బిజినెస్‌ చేయాలనుకున్నారా? కథతో బిజినెస్‌ చేద్దామనుకున్నారా?

నాగ్‌ అశ్విన్‌: ఈ విషయంలో నిర్మాతలే రిస్క్‌ తీసుకున్నారు. నేను ఓ లెక్క చెబితే దాని కంటే ఎక్కువే ఖర్చు పెట్టారు. పాత్రలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే పెద్ద నటులను తీసుకున్నా. ఒకవేళ కథలో బలం లేకపోయి ఉంటే ఆ నటుల ఎంపిక మాకు నెగెటివ్‌ అయ్యేది.

శ్రీ కృష్ణుడి పాత్రలో మహేశ్‌ బాబు నటిస్తే బాగుంటుందని సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ నడుస్తోంది. ఆయన్ను తీసుకునే అవకాశం ఉందా?

నాగ్‌ అశ్విన్‌: ఇందులో కాదుగానీ వేరే సినిమాలో ఆయన కృష్ణుడిగా నటిస్తే చాలా బాగుంటుంది.

నాలుగున్నర లక్షల సంవత్సరాల తర్వాత కలియుగం అంతమవుతుందనేది అందరికీ తెలిసిన విషయం. నాలుగో పాదంలో కల్కి ఉద్భవిస్తాడని చెబుతుంటారు. మీరేమో ఆరు వేల సంవత్సరాల తర్వాతే వచ్చాడని మీరు చెబుతున్నారు?

నాగ్‌ అశ్విన్‌: కలియుగాన్ని 4 లక్షల 32 వేల సంవత్సరాలుగా చెబుతుంటారు. కానీ, ఓ లాజిక్‌ ప్రకారం 72 ఏళ్లను ఒక్క సంవత్సరమనేది ఎక్కడో చదివా. 4,32,000ను 72తో భాగిస్తే 6 వేలు. ఆ ఐడియాతో ముందుకెళ్లాం. పార్ట్‌ 2 విషయానికొస్తే.. స్క్రిప్టే ఓ ఛాలెంజ్‌.

పార్ట్‌ 2లో ప్రభాస్‌ పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుందా?  అందులోనూ అతిథి పాత్రలు కనిపిస్తాయా?

నాగ్‌ అశ్విన్‌: తప్పకుండా ప్రభాస్‌ పాత్ర నిడివి ఎక్కువ ఉంటుంది. క్యామియో క్యారెక్టర్ల గురించి ఇంకా ఏం అనుకోలేదు.

పార్ట్‌ 1లో ప్రభాస్‌ను కర్ణుడిగా చూపించారు. పార్ట్‌ 2లో ఆయన్ను నెగెటివ్‌గా చూపించనున్నారా?

నాగ్‌ అశ్విన్‌: పార్ట్‌ 1 క్లైమాక్స్‌లో కర్ణుడి పాత్ర ఏ కోణంలోనూ నెగెటివ్‌గా లేదు. పార్ట్‌ 2లోనూ అంతే.

ఇలాంటి భారీ ప్రాజెక్టులోనూ ఓ లవ్‌స్టోరీని ఎలా చెప్పగలిగారు?

నాగ్‌ అశ్విన్‌: అన్నింటికంటే మానవ సంబంధాలే ముఖ్యమని కైరా పాత్ర ఓ డైలాగ్‌ చెబుతుంది. అందులోంచి వచ్చిందే ఆ ప్రేమ కథాలోచన.

మహాభారతాన్ని పూర్తిస్థాయిలో తెరకెక్కించే ఛాన్స్‌ ఉందా?

నాగ్‌ అశ్విన్‌: ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదు.

ఈ కథను ముందుగా చిరంజీవికి చెప్పారట. నిజమేనా?

నాగ్‌ అశ్విన్‌: అందులో నిజం లేదు.

మీ గత చిత్రం ‘మహానటి’లోనూ అతిథి పాత్రలున్నాయి. స్పెషల్‌ అప్పీరియన్స్‌ మీకు ఇష్టమా?

నాగ్‌ అశ్విన్‌: అవును. అతిథి పాత్రలంటే నాకు ఇష్టం. విజయ్‌ దేవరకొండది గెస్ట్‌ రోల్‌ కాదు.

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి విజయం సాధించికపోయి ఉంటే.. టికెట్‌ ధరల పెంపునకు అనుమతి లభించికపోయి ఉండొచ్చు. దీనిపై మీ అభిప్రాయం?

నాగ్‌ అశ్విన్‌: అదంతా జరగలేదు కదా ఆనందమే.

సినిమా విడుదలైన రోజు కర్ణుడికంటే అర్జునుడే గొప్ప అన్నట్టు చర్చ జరిగింది. మీరేమంటారు?

నాగ్‌ అశ్విన్‌: మహాభారతం గురించి లోతుగా చర్చ సాగడం, ధర్మం- అధర్మం గురించి తెలుసుకోవడం మంచిదే.

మీ గత చిత్రాల్లోని నటులంతా ‘కల్కి’లో ఉన్నారు. నాని, నవీన్‌ పొలిశెట్టిని ఎందుకు తీసుకోలేదు?

నాగ్‌ అశ్విన్‌: పార్ట్‌ 1లో వారిని తీసుకునే అవకాశం లభించలేదు. కానీ, తర్వాత ఎక్కడ వీలుంటే అక్కడ వారిని పెట్టేస్తా.

కమల్‌ హాసన్‌ పోషించి యాస్కిన్‌ పాత్ర ప్రధానంగా మరో సినిమా చేస్తారా? పార్ట్‌ 2లోనే దాని గురించి చెబుతారా?

నాగ్‌ అశ్విన్‌: దాని కోసం సెపరేట్‌ సినిమా ఏం లేదు. పార్ట్‌ 2లోనే ఆ పాత్ర గురించి ఎక్కువ రివీల్‌ చేస్తాం.

ఇంటర్నేషనల్‌ ప్రొడక్షన్‌ హౌజ్‌లతో కలిసి పార్ట్‌ 2ని రూపొందిస్తారా? సొంతంగా చేస్తారా?

నాగ్‌ అశ్విన్‌: ప్రొడక్షన్‌ పరంగా కాదుగానీ డిస్ట్రిబ్యూషన్‌ విషయంలో ఆలోచిస్తాం.

పార్ట్‌ 2 రిలీజ్‌ ఎప్పుడు?

నాగ్‌ అశ్విన్‌: షూటింగ్‌ ఎప్పుడు ప్రారంభిస్తామో తెలియదు. అప్పుడే రిలీజ్‌ డేట్‌ అడుగుతున్నారు (నవ్వుతూ).

తొలిభాగంలో కృష్ణుడి పాత్రధారి ముఖం ఎందుకు చూపించలేదు.

నాగ్‌ అశ్విన్‌: రూపం లేకుండా ఉంటేనే భగవంతుడి పాత్ర పవర్‌ఫుల్‌గా ఉంటుందని అలా చూపించా.

‘బుజ్జి’ వాహనానికి పేటెంట్‌ తీసుకున్నారా?

నాగ్‌ అశ్విన్‌: తీసుకున్నాం.

కాంప్లెక్స్‌, శంబలపై వెబ్‌సిరీస్‌లు ఏమైనా ప్లాన్‌ చేస్తున్నారా?

నాగ్‌ అశ్విన్‌: బుజ్జి- భైరవకు సంబంధించిన మరో రెండు ఎపిసోడ్లు వస్తాయి.

విజయ్‌ దేవరకొండ, మాళవిక నాయర్‌లను మీ అన్ని చిత్రాల్లో తీసుకోవడానికి కారణం?

నాగ్‌ అశ్విన్‌: తొలి సినిమా నటులు కాబట్టి నాకెప్పుడూ ప్రత్యేకమే. వారు నాకు లక్కీ ఛార్మ్‌. వాళ్లతో కలిసి పనిచేయడం కంఫర్ట్‌గా ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని