Naa samiranga:నా సామిరంగ.. మాస్‌ జాతర

నా సామిరంగ’తో సంక్రాంతి బరిలో మాస్‌ జాతర చూపిస్తానంటున్నారు నాగార్జున. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంతో నృత్య దర్శకుడు విజయ్‌ బిన్నీ దర్శకుడిగా మారుతున్న సంగతి తెలిసిందే.

Updated : 18 Dec 2023 09:26 IST

నా సామిరంగ’తో సంక్రాంతి బరిలో మాస్‌ జాతర చూపిస్తానంటున్నారు నాగార్జున. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంతో నృత్య దర్శకుడు విజయ్‌ బిన్నీ దర్శకుడిగా మారుతున్న సంగతి తెలిసిందే. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఆషికా రంగనాథ్‌ కథానాయిక. అల్లరి నరేశ్‌, రాజ్‌తరుణ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను ఆదివారం విడుదల చేశారు. ‘‘ఏం సేత్తున్నాడేంటి మీవోడు’’ అంటూ ఆషికా ప్రశ్నించడం.. ‘‘నిన్నే మామిడితోటలో 20మందిని ఊత కొట్టుడు కొట్టేశాడు’’ అంటూ అల్లరి నరేశ్‌ బదులివ్వడం.. ఈ క్రమంలో వచ్చే యాక్షన్‌ సీక్వెన్స్‌తో నాగార్జున మాస్‌ అవతారంలో పరిచయమవడం.. ఇలా ఆరంభమైన టీజర్‌ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. సినిమాలో యాక్షన్‌కు తగ్గట్లుగానే రొమాంటిక్‌ అంశాలకు ప్రాధాన్యత ఉన్నట్లు ప్రచార చిత్రంతో స్పష్టత ఇచ్చారు. నాగ్‌ - ఆషికాల లవ్‌ట్రాక్‌.. వాళ్లిద్దరి కెమిస్ట్రీ కొత్తగా కనిపించింది. అల్లరి నరేశ్‌, రాజ్‌తరుణ్‌ల పాత్రలకు కథలో ప్రాధాన్యత ఉన్నట్లు టీజర్‌తో చెప్పే ప్రయత్నం చేశారు. ఆఖర్లో ‘‘దెబ్బలు గట్టిగా తగిల్నాయా’’ అంటూ ఆషిక ప్రశ్నించగా.. ‘‘మనోడికేం తగల్లేదు. వాళ్లకి మాత్రం గట్టిగా తగిలేశాయి’’ అంటూ నరేశ్‌ బదులివ్వడం.. దానికి కొనసాగింపుగా ‘‘నేనడిగింది వాళ్ల గురించే’’ అంటూ ఆషిక తిరిగి కౌంటరివ్వడం హైలైట్‌గా నిలిచింది. ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంగీతం: ఎంఎం కీరవాణి, ఛాయాగ్రహణం: శివేంద్ర దాశరథి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని