Mrunal Thakur: ఇప్పటికీ వాళ్లే నాకు స్ఫూర్తి

‘‘కష్టనష్టాల్ని కూడా స్వీకరించినప్పుడే చిత్రపరిశ్రమలో నటిగా నిలదొక్కుకోగలం’’ అని అంటోంది కథానాయిక మృణాల్‌ ఠాకూర్‌. ఓ పక్క కథానాయికగా మంచి అవకాశాలు అందుకుంటూనే ఇటీవలే విడుదలైన ‘కల్కి2898 ఎ.డి’లో అతిథి పాత్రలో తళుక్కున మెరిసిందీమె.

Published : 30 Jun 2024 01:52 IST

‘‘కష్టనష్టాల్ని కూడా స్వీకరించినప్పుడే చిత్రపరిశ్రమలో నటిగా నిలదొక్కుకోగలం’’ అని అంటోంది కథానాయిక మృణాల్‌ ఠాకూర్‌. ఓ పక్క కథానాయికగా మంచి అవకాశాలు అందుకుంటూనే ఇటీవలే విడుదలైన ‘కల్కి2898 ఎ.డి’లో అతిథి పాత్రలో తళుక్కున మెరిసిందీమె. ఇందులో తన నటనకు గానూ మంచి ప్రశంసలు అందుకుంటోంది. త్వరలో ‘పూజా మేరీ జాన్‌’తో తెరపై సందడి చేయడానికి సిద్ధమవుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్‌ తను ఎంచుకునే పాత్రలు, రాబోయే ప్రాజెక్టుల గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది.

నేను తెరపై కనిపించాలని ఎప్పుడూ కోరుకోలేదు. నటి కావాలనేది నా చిన్ననాటి కల కాకపోయినా.. విధి నన్ను నటనా ప్రపంచంలోకి అడుగుపెట్టేలా చేసింది. దాదాపు 18ఏళ్ల వయసులోనే బుల్లితెరపైకి వచ్చిన నాకు.. నువ్వు ఇది చేయలేవని ఎవరైనా అంటే.. వారి మాటలను సవాలుగా తీసుకొని నిరూపించడం అలవాటు. ఆ సవాళ్లే నా సంకల్పానికి ఆజ్యం పోశాయి. నేను కళాశాలలో ఉన్నప్పుడు ఓ వ్యక్తి నా గురించి తక్కువ చేసి మాట్లాడారు. అది తప్పు అని నిరూపించుకోవాలని నిర్ణయించుకున్నాను. ఆ క్షణమే నన్ను ఆడిషన్‌కి నడిపించింది. అలా టెలివిజన్‌ రంగంలోకి అడుగుపెట్టాను.

  • నేను ఎప్పుడూ విజయాల గురించి పెద్దగా ఆలోచించను. ముందున్న ప్రయాణంపై మాత్రమే దృష్టి పెడతాను. ఒక నటిగా ఎదగడానికి నిరంతం కృషి చేయాలనేది నా అభిప్రాయం. కొన్ని సార్లు మనం ఎంచుకునే కథలు, పాత్రలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోవచ్చు. నష్టాలు కూడా ప్రతి నటుడి జీవితంలో ఒక భాగమని నమ్ముతాను. చేసిన తప్పుల్ని స్వీకరించినప్పుడే చిత్రపరిశ్రమలో నటిగా ఎదగడానికి దోహదపడుతుంది.
  • నేను ప్రాజెక్టులు ఎంచుకునేటప్పుడు నా విలువలకు అనుగుణంగా.. ప్రేక్షకులకు దగ్గరయ్యే కథనాలకు ప్రాధాన్యమిస్తాను. ఒక నటిగా నా పరిధిని మాత్రమే పరిమితం చేసే పాత్రలకు నేను చాలా దూరంగా ఉంటాను. ప్రతి ప్రాజెక్ట్‌తో సమాజాన్ని ప్రభావితం చేయడమే లక్ష్యం కానప్పటికీ, అర్థవంతమైన సందేశాలను అందించే కథాంశాలకు నేను ఆకర్షితురాలిని. ‘లవ్‌ సోనియా’, ‘సూపర్‌ 30’లాంటి ప్రాజెక్టులు అప్పుడు ఒప్పుకోవడానికి కారణం కూడా ఇదే. ఎంచుకునే పాత్రల్లో రిస్క్‌ తీసుకోవడం చాలా ఇష్టం. ఇవే నన్ను నేను నిరంతరం మెరుగుపరుచుకునేలా చేస్తాయి. భాషతో సంబంధం లేకుండా ఆకట్టుకునే కథలతో ప్రపంచ ప్రేక్షకులకు చేరువ కావాలనుకుంటున్నాను. ప్రస్తుతం నా లక్ష్యం అదే.
  • ‘హాయ్‌ నాన్న’, ‘సీతారామం’ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులు అందించిన ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను. ఇటీవలే విడుదలైన ‘కల్కి 2898ఎ.డి’లో కూడా అతిథి పాత్రలో నటించినందుకు మంచి ప్రశంసలు వస్తున్నాయి. నిజానికి ఇందులో అతిథి పాత్ర చేయాలని చిత్రబృందం నన్ను సంప్రదించినప్పుడు నేను ఈ ప్రాజెక్టు గురించి ఏం అడగలేదు. కనీసం సినిమా కథ గురించి, నా పాత్ర గురించి తెలియకుండానే ఒప్పుకున్నాను. ఎందుకంటే కచ్చితంగా కల్కి విడుదలయ్యాక సంచలనం సృష్టిస్తుందని ముందే తెలుసు. ఇలాంటి గొప్ప ప్రాజెక్టులో భాగం అయినందుకు సంతోషంగా ఉంది.
  • చిత్రపరిశ్రమకు వచ్చినప్పటి నుంచి ఎంతో మంది నటీనటులను ఆదర్శంగా తీసుకుంటూ ముందుకు సాగుతున్నాను. వహీదా జీ, మధుబాలా, స్మితా పాటిల్‌ లాంటి దిగ్గజాలు పరిశ్రమపై చెరగని ముద్ర వేశారు. ఇప్పటికీ నేను వారినే స్ఫూర్తిగా తీసుకుంటాను. త్వరలో నేను నటిస్తున్న ‘పూజా మేరీ జాన్‌’ విడుదలకు సిద్ధంగా ఉంది. వచ్చే నెలలో నా తదుపరి ప్రాజెక్టు చిత్రీకరణను మొదలు పెట్టబోతున్నాను.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని