Tollywood: సంక్రాంతికి వచ్చేదెవరు?

సినీ క్యాలెండర్‌లో ఎన్ని పండగ సీజన్లున్నా.. సంక్రాంతి ఎప్పుడూ ప్రత్యేకమే. అంచనాలు మించేలా విజయాలు దక్కించుకోవాలన్నా.. భారీ వసూళ్లతో రికార్డులు తిరగరాయాలన్నా అగ్ర తారలంతా మొగ్గు చూపేది ఈ పండగ సీజన్‌ వైపే.

Updated : 23 Jun 2024 09:56 IST

ముగ్గుల పండగ లక్ష్యంగా చిత్రీకరణను పరుగులు పెట్టిస్తున్న తారలు

సినీ క్యాలెండర్‌లో ఎన్ని పండగ సీజన్లున్నా.. సంక్రాంతి ఎప్పుడూ ప్రత్యేకమే. అంచనాలు మించేలా విజయాలు దక్కించుకోవాలన్నా.. భారీ వసూళ్లతో రికార్డులు తిరగరాయాలన్నా అగ్ర తారలంతా మొగ్గు చూపేది ఈ పండగ సీజన్‌ వైపే. అందుకే ఈ పెద్ద పండగ బెర్తుల కోసం ఏడెనిమిది నెలల ముందు నుంచే పోటీ మొదలైపోతుంటుంది. ఇక ఈ ఏడాది సంక్రాంతికి విడుదలల విషయంలో సినిమాల మధ్య కనిపించిన పోటీ.. థియేటర్ల కేటాయింపు విషయంలో జరిగిన రచ్చ చూశాక ప్రణాళికలన్నీ మారిపోయాయి. సంక్రాంతిని లక్ష్యం చేసుకుంటున్న తారలంతా సెట్‌లోకి అడుగు పెట్టడానికి ముందే ‘సంక్రాంతికి వస్తున్నాం’ అని కబురు వినిపించేయడం పరిపాటిగా మారిపోయింది. ఇప్పటికే ఇలా ముందస్తు కబురు వినిపించిన వాళ్లు తెలుగు చిత్రసీమలో చాలా మందే ఉన్నారు. మరి వారిలో లక్ష్యం దిశగా చకచకా ముందుకు సాగుతున్నదెవరు? అనుకున్న తేదీకి బాక్సాఫీస్‌ ముందుకొచ్చేదెవరు? అనేది ఆసక్తికరంగా మారింది.

నిజానికి ఈ ఏడాది క్యాలెండర్‌లో ఆరు నెలలు ఇంకా పూర్తవ్వనే లేదు. మరో ఆరు నెలల ప్రయాణం మిగిలే ఉంది. ఈ మధ్యలో వచ్చే దసరా, దీపావళి, క్రిస్మస్‌ సీజన్ల కోసం చిత్రసీమ ఇప్పటికే సిద్ధమైపోయింది. ఈ ఆరు నెలల్లో డజనుకు పైగా భారీ సినిమాలు థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. అందుకే ఇప్పుడు అందరి దృష్టీ సంక్రాంతి వైపు మళ్లింది. ‘‘సంక్రాంతికి వస్తున్నాం’’ అంటూ ఇప్పటికే విడుదల కబురు వినిపించిన వాళ్లలో చిరంజీవి, వెంకటేశ్, రవితేజ లాంటి అగ్రతారలున్నారు. అయితే ఆ లక్ష్యం దిశగా వడివడిగా అడుగులేస్తూ చిత్రీకరణను ఓ కొలిక్కి తీసుకొచ్చిన వాళ్లలో చిరునే అందరి కన్నా ముందున్నారు. ఆయన ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో ‘విశ్వంభర’ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 10న థియేటర్లలోకి రానుంది. సోషియో ఫాంటసీ అంశాలతో నిండిన ఈ అడ్వెంచరస్‌ థ్రిల్లర్‌ ఇప్పటికే ముగింపు దశ చిత్రీకరణకు చేరుకుంది. వచ్చే నెలాఖరు నాటికి చిత్రీకరణ పూర్తి చేసుకున్నా.. డిసెంబరు కల్లా గ్రాఫిక్స్‌ పనుల్ని ముగించి జనవరి నాటికి సినిమాని సిద్ధం చేయడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. ప్రస్తుతం ఈ గ్రాఫిక్స్‌ పనులు శరవేగంగానే జరుగుతున్నట్లు చిత్ర వర్గాల నుంచి సమాచారం అందుతోంది. అందుకే ఈ పండగ సినిమాపై ప్రేక్షకుల్లోనూ భరోసా కనిపిస్తోంది. ఈ ఏడాది సంక్రాంతికి ‘సైంధవ్‌’గా ప్రేక్షకుల్ని పలకరించారు కథానాయకుడు వెంకటేశ్‌. ప్రస్తుతం దర్శకుడు అనిల్‌ రావిపూడితో కలిసి సినిమా చేసేందుకు సమాయత్తమవుతున్నారు. మూడు నెలల క్రితం ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటిస్తూనే.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ అంటూ చెప్పేశారు. కానీ, ఇంత వరకైతే చిత్రీకరణను ప్రారంభించలేదు. కాకపోతే సినిమాల్ని చకచకా పూర్తి చేయడంలో అనిల్‌ రావిపూడిది అందెవేసిన చేయ్యి. గతంలో మహేశ్‌బాబు లాంటి స్టార్‌తో ఐదు నెలల్లో ‘సరిలేరు నీకెవ్వరు’ లాంటి సినిమా తీసి పండగ బరిలో నిలిపిన రికార్డు ఆయన సొంతం. అందుకే ఆగస్టులో మొదలు కానున్న ఈ ప్రాజెక్ట్‌పైనా అందరిలోనూ ఓ నమ్మకం కనిపిస్తోంది. ఈ ఏడాది సంక్రాంతికి ‘ఈగల్‌’తో బాక్సాఫీస్‌ ముందు జోరు చూపించాలనుకున్నారు కథానాయకుడు రవితేజ. కానీ, పండగ బరిలో రద్దీని తగ్గించడం కోసం ఆఖరి నిమిషంలో సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్నారు. అయితే తనిప్పుడు వచ్చే ముగ్గుల పండక్కి ఎట్టి పరిస్థితుల్లోనూ సినీప్రియుల్ని అలరించాలన్న లక్ష్యంతో సాగుతున్నారు. ప్రస్తుతం ఆయన భాను భోగవరపు దర్శకత్వంలో కొత్త చిత్రాన్ని పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. ఈ కాంబోని అధికారికంగా ప్రకటించిన రోజే 2025 సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు చెప్పేసింది ఆ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌. ఇప్పుడా లక్ష్యాన్ని చేరుకోవడం కోసం చిత్రీకరణను పరుగులు పెట్టిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్ర తొలి షెడ్యూల్‌ మొదలు కాగా.. ఈ నెలాఖరు నుంచి రవితేజ సెట్లోకి అడుగు పెట్టనున్నారని తెలిసింది. అన్నీ అనుకున్నట్లుగా సాగితే రవితేజ వేగానికి నాలుగు నెలల్లో సినిమాని పూర్తి చేయడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చన్న భావన సినీవర్గాల్లో కనిపిస్తోంది. అందుకే ఈ చిత్రంపైనా ప్రేక్షకుల్లో ఓ ధీమా కనిపిస్తోంది.

వీళ్లూ వచ్చేనా!

ప్రస్తుతం ‘కల్కి 2898 ఎ.డి’తో థియేటర్లలో సందడి చేసేందుకు సమాయత్తమవుతున్నారు కథానాయకుడు ప్రభాస్‌. దీని తర్వాత ఆయన నుంచి రానున్న మరో సినిమా ‘రాజాసాబ్‌’. మారుతి దర్శకత్వంలో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే సగ భాగానికి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. త్వరలో మిగిలిన చిత్రీకరణను పూర్తి చేసి సంక్రాంతి బరిలో నిలపాలన్న ఆలోచన చిత్ర వర్గాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఇదే విషయమై ఈ చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ను ప్రశ్నించగా.. సంక్రాంతి బరిలో నిలవాలనుకుంటే ప్రభాస్‌కు తప్పకుండా ఓ బెర్తు ఉంటుందని బదులిచ్చారు. దీన్ని బట్టి ఈ సినిమాని పండగ రేసులో చూసినా ఆశ్చర్యపోనవసరం లేదని అర్థమవుతోంది. ఇటీవల కాలంలో కథానాయకుడు నాగార్జున సంక్రాంతి సెంటిమెంట్‌ను బాగా అనుసరిస్తున్నారు. ప్రతి పండక్కి తన చిత్రాన్ని చూపించాలని తాపత్రయపడుతున్నారు. ఆ కోరికను ఈ ఏడాది ‘నా సామిరంగ’తో తీర్చుకున్నారు. పండగ బరిలో నిలవాలన్న లక్ష్యంతో దీన్ని కేవలం మూడున్నర నెలల్లో పూర్తి చేయడం విశేషం. ఈ చిత్ర విజయోత్సవ వేడుకలోనే నాగ్‌ ‘మళ్లీ వచ్చే సంక్రాంతికి కలుద్దామ’ని ప్రేక్షకులకు ఓ కబురు వినిపించేశారు. ఇప్పటికైతే ఆయన సోలోగా ఏ చిత్రం పట్టాలెక్కించకున్నా.. ‘నా సామిరంగ’ తరహాలో మరో సినిమాని శరవేగంగా పూర్తి చేసి వచ్చే ముగ్గుల పండగ బరిలో నిలిపినా ఆశ్చర్యపోనవసరం లేదన్న సంకేతాలు అందుతున్నాయి. ఇప్పుడు దీనికి తగ్గట్లుగా తెర వెనుక కథా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని