Mirzapur Season 3 Review: రివ్యూ: వెబ్‌సిరీస్‌: మీర్జాపూర్‌ సీజన్‌-3.. క్రైమ్‌, యాక్షన్‌ సిరీస్‌-3 మెప్పించిందా?

Mirzapur Season 3 Review: యువతను విశేషంగా ఆకట్టుకున్న సిరీస్‌ల్లో మీర్జాపూర్‌ ఒకటి. ఇప్పుడు మూడో సీజన్‌ స్ట్రీమింగ్‌ అవుతోంది.

Updated : 05 Jul 2024 18:44 IST

Mirzapur Web Series; నటీనటులు: పంకజ్‌ త్రిపాఠి, అలీ ఫజల్‌, శ్వేత త్రిపాఠి, మాధురీ యాదవ్‌, విజయ్‌ వర్మ తదితరులు; దర్శకత్వం: గుర్మీత్‌ సింగ్‌, ఆనంద్‌ అయ్యర్‌

క్రైమ్‌ యాక్షన్‌ జానర్‌లో వచ్చిన మీర్జాపూర్‌ వెబ్‌సిరీస్‌ యువతను ఎంతో ఆకట్టుకుంది. ఇప్పుటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ సిరీస్‌ మూడో సీజన్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ అవుతోంది. మరి కొత్త సీజన్‌ అలరించేలా ఉందా?

పదవి, అధికారం మత్తు పదార్థాలలాంటివి. ఒకసారి అవి తలకెక్కితే మనిషి అన్నీ మర్చిపోతాడు. ప్రాణం పోయిన పర్వాలేదు.. పదవిని మాత్రం వదులుకోలేడు. ఎందుకంటే ఇక్కడ తలలు శాశ్వతం కాదు.. కిరిటాలే శాశ్వతం. ‘మీర్జాపూర్‌’ వెబ్‌సిరీస్‌ ఎన్ని సీజన్లు మారినా ‘కింగ్‌ ఆఫ్‌ మీర్జాపూర్‌’ అనిపించుకోవడానికే అందులోని పాత్రలు పోటీపడుతూ ప్రాణాలను సైతం పోగొట్టుకుంటాయి. అందుకే ఈ సరికొత్త ‘రక్తచరిత్ర’ భారతీయ ఓటీటీ వీక్షకులను ఎంతగానో అలరించింది. (Mirzapur Season 3 Review) అయితే, మొదటి రెండు సీజన్లు ఆకట్టుకున్న స్థాయిలో మాత్రం మూడో సీజన్‌ ఆకట్టుకోలేకపోయింది.

మొదటి రెండు సీజన్లకు కొనసాగింపుగానే మూడో సీజన్‌ కథ మొదలవుతుంది. గుడ్డు (అలీ ఫజల్‌), గోలు (శ్వేత త్రిపాఠి) చేసిన దాడిలో మున్నా (దివ్యేందు) చనిపోగా.. కాలీన్‌ భయ్యా (పంకజ్‌ త్రిపాఠి) తీవ్రంగా గాయపడి కనిపించకుండా పోతాడు. దీంతో మీర్జాపూర్‌ సింహాసనాన్ని దక్కించుకునే క్రమంలో పూర్వాంచల్‌లో ప్రతి దాన్ని శాసించే శక్తిగా ఎదగాలనుకుంటాడు గుడ్డు. కాలీన్‌ భాయ్‌ గుర్తులు లేకుండా చెరిపేసేందుకు ప్రయత్నిస్తాడు. మున్నాభాయ్‌ మరణంతో మాధురీ యాదవ్‌ (ఇషా తల్వార్‌) రాజకీయాల్లోకి అడుగు పెట్టడమే కాకుండా సీఎం కూడా అవుతుంది. కనిపించకుండా పోయిన కాలీన్‌ భయ్యాపై సింపథీని క్రియేట్‌ చేసి, ప్రజలకు చేరువ కావాలని భావిస్తుంది. మరోవైపు గుడ్డు దాడిలో గాయపడిన కాలీన్‌ను శరద్‌ శుక్లా (అంజుమ్‌ శర్మ) కాపాడి, అతడి సహాయంతో మీర్జాపూర్‌ కుర్చీని దక్కించుకోవాలనుకుంటాడు. (Mirzapur Season 3 Review)  మరి వీరిలో ఎవరు ‘కింగ్‌ ఆఫ్‌ మీర్జాపూర్‌’ అయ్యారన్నదే సీజన్‌-3 కథ.

ఒక ప్రాంతంపై ఆధిపత్యం కోసం సాగే పోరు నేపథ్యంలో ఇప్పటికే ఎన్నో కథలు వచ్చినా.. ‘మీర్జాపూర్‌’ ప్రత్యేకంగా నిలవడానికి కారణం అందులోని పాత్రలు, వాటి వ్యవహారశైలి, అంతకుమించి దర్శకుల టేకింగ్‌. సిరీస్‌ను వాస్తవ పరిస్థితులను దగ్గరగా చూపించడం వల్లే యువతకు నచ్చింది. మూడో భాగాన్ని కూడా అలాగే తీర్చిదిద్దినా ఆసాంతం కుర్చీ కోసం గుడ్డు, శరద్‌ శుక్లాల మధ్య సాగే డ్రామాతో సిరీస్‌ మొత్తాన్ని సాగదీశారు. తొలి భాగంలో ఉన్న సంభాషణల మెరుపులు, యాక్షన్‌ సన్నివేశాలు గానీ, రెండో భాగంలో ప్రధాన పాత్రల మధ్య ఉన్న సంఘర్షణ గానీ మూడో భాగంలో కనిపించదు. మొత్తం పది ఎపిసోడ్స్‌ (ఒక్కో ఎపిసోడ్‌ 40 నుంచి 50 నిమిషాలు పైనే) మరీ సాగదీత వ్యవహారంలా సాగింది. (Mirzapur Season 3 Review)  సిరీస్‌కే సింహంలాంటి కాలీన్‌భాయ్‌ను మంచానికే పరిమితం చేశారు. మీర్జాపూర్‌ కుర్చీ కోసం గుడ్డు, శుక్లా పోరాటం ఏమాత్రం ఆసక్తిగా గానీ, ఉత్కంఠగా గానీ అనిపించదు.

పూర్వాంచల్‌లో ఆధిపత్యం సాధించేందుకు శరద్‌ శుక్లా ఇతర ప్రాంతాలకు చెందిన కీలక వ్యక్తుల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తుంటే.. గుడ్డు మాత్రం హింస, రక్తపాతంతోనే అధికారం కైవసం చేసుకోవాలని భావిస్తుంటాడు. అందుకు తగినట్లుగానే శుక్లా సన్నివేశాలన్నీ రాజకీయ తంత్రాలతో కూడినవి ఉంటే, గుడ్డు పాత్రతో యాక్షన్‌ హంగామా చేయించారు దర్శకులు. గోలు పాత్ర కూడా మొదటి రెండు ఎపిసోడ్స్‌ కీలకంగా వ్యవహరించగా.. అక్కడి నుంచి ఆమె ప్రభావం పెద్దగా ఉండదు. (Mirzapur Season 3 Review)  శుక్లా, సీఎం మాధురీ మధ్య సన్నివేశాలతో కూడిన డ్రామా విసిగించేస్తుంది. సర్లే తర్వాతి ఎపిసోడ్‌ నుంచి సిరీస్‌ వేగం పుంజుకుంటుందేమో అనుకుని చూస్తూ ఉంటే.. ఏడు ఎపిసోడ్స్ అలా గడిచిపోతాయి.

ఎనిమిదో ఎపిసోడ్‌ నుంచి అసలు కథ మొదలవుతుంది. కుర్చీ కోసం సాగే డ్రామా, పాత్ర వ్యవహారశైలి, కథగమనం ఒక్కసారిగా వేగం పుంజుకుంటాయి. గుడ్డు జైలు వెళ్లడం, అక్కడి అతడిని ఖైదీలు చావగొట్టడం, మరోవైపు కాలీన్‌ భయ్యా అండతో శుక్లా ‘మీర్జాపూర్‌’ కుర్చీ ఎక్కాలనుకోవడం, కిడ్నాప్‌ అయిన గోలు బయటపడటం ఇలా సిరీస్‌ పరుగులు పెడుతుంది. పదో ఎపిసోడ్‌ మొత్తం సిరీస్‌కే ఆయువు పట్టు, క్లైమాక్స్‌ ఊహించని ట్విస్ట్‌లు ఇచ్చి, నాలుగో సీజన్‌కు బాటలు వేశారు.

సిరీస్‌ మొత్తం గుడ్డు, శరద్‌ శుక్లా మధ్య సాగింది. ఆయా పాత్రలకు వాళ్లు న్యాయం చేశారు. పంకజ్‌ త్రిపాఠికి పెద్దగా ప్రాధాన్యం లేదు. తర్వాతి సీజన్‌ను కాలీన్‌ భయ్యా vs గుడ్డు, గోలుగా ఉంటుందని చెప్పారు. సాంకేతికంగా సిరీస్‌లో కొత్తదనం ఏమీలేకపోగా, నిడివితో విసిగెత్తించారు. (Mirzapur Season 3 Review)  మొదటి సీజన్‌లో ఉన్న మెరుపులు రెండో దానికి తగ్గగా.. మూడో సీజన్‌లో ఆ వెలుగులు మసకబారాయి.

కుటుంబంతో కలిసి చూడొచ్చా: హింస, రక్తపాతం, అసభ్య పదజాలం ఈ సిరీస్‌లోనూ ఆసాంతం కనిపిస్తూ, వినిపిస్తూ ఉంటుంది. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో తెలుగులోనూ అందుబాటులో ఉంది.

  • బలాలు
  • + నటీనటులు
  • + చివరి మూడు ఎపిసోడ్స్‌
  • బలహీనతలు
  • - నిడివి
  • - నెమ్మదిగా సాగే కథాగమనం
  • చివరిగా: చివరి మూడు ఎపిసోడ్స్‌లోనే ‘మీర్జాపూర్‌’3 మెరుపులు (Mirzapur Season 3 Review)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని