Mirzapur Season 3: రక్తంతో రాసిన కథ ‘మీర్జాపూర్‌’.. మూడో సీజన్‌ వస్తోంది!

Mirzapur Season 3: గత రెండు సీజన్లుగా యువతను విశేషంగా ఆకట్టుకున్న వెబ్‌సిరీస్‌ ఏదైనా ఉందంటే అది ‘మీర్జాపూర్‌’ మాత్రమే. ఇప్పుడు ‘మీర్జాపూర్‌: సీజన్‌3’ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.

Updated : 03 Jul 2024 10:33 IST

Mirzapur Season 3: మీర్జాపూర్‌.. భాషలతో సంబంధం లేకుండా ఓటీటీ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన వెబ్‌సిరీస్‌. క్రైమ్‌ యాక్షన్‌ జానర్‌లో వచ్చిన ఈ సిరీస్‌ రెండు సీజన్లు ప్రేక్షకులను  ముఖ్యంగా యువతను విశేషంగా అలరించాయి. ఈ సీజన్‌లోని పాత్రలపై వచ్చినన్ని మీమ్స్‌ మరే వెబ్‌సిరీస్‌పైనా రాలేదంటే అతిశయోక్తి కాదు. ఇందులోని నటీనటులను అసలైన పేర్లకంటే కూడా కాలీన్‌భయ్యా (Pankaj Tripathi), గుడ్డు పండిత్‌ (Ali Fazal) బబ్లూ పండిత్‌ (Vikrant Massey), మున్నా భాయ్‌ (Divyenndu) గోలు (Shweta Tripathi) పేర్లతోనే ఎక్కువ పాపులర్‌ అయ్యారు. ఆ రెండు సీజన్లను మించి మూడో సీజన్‌ (Mirzapur Season 3) స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. రక్తంతో రాసిన ‘మీర్జాపూర్‌’.. ఈ కథ ముందుకు సాగాలంటే మళ్లీ రక్తాన్నే కోరుతుంది. జులై 5వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ‘సీజన్‌3’ స్ట్రీమింగ్‌ కానుంది. ఈ క్రమంలో మీర్జాపూర్‌: సీజన్‌-1, సీజన్‌-2లలో ఏం జరిగిందో ఓసారి గుర్తు చేసుకుందామా?

పూర్తి యాక్షన్‌, క్రైమ్‌ హంగామా సీజన్‌-1

Mirzapur Season 1: మీర్జాపూర్‌లో అఖండానంద్‌ అలియాస్‌ కాలీన్‌ భాయ్‌ (పంకజ్‌ త్రిపాఠి) మాఫియా సామ్రాజ్యానికి కిరీటం లేని మహారాజు. డ్రగ్స్‌, ఆయుధాలే అతడి ప్రధాన వ్యాపారం. ఒకరోజు రాత్రి పెళ్లి వేడుకలో కాలీన్‌ భాయ్‌ కొడుకు మున్నా (దివ్యేందు) తుపాకీ పేల్చడంతో  పెళ్లికొడుకు మరణిస్తాడు. దీంతో చనిపోయిన పెళ్లి కొడుకు కుటుంబం నిజాయతీపరుడైన లాయర్‌ రమాకాంత్‌ పండిత్‌ (రాజేశ్‌  తైలాంగ్‌)ను కేసు వాదించడానికి నియమించుకుంటుంది. రమాకాంత్‌కు ముగ్గురు పిల్లలు గుడ్డు పండిత్‌ (అలీ ఫజల్‌), బబ్లూ పండిత్‌ (విక్రాంత్‌ మస్సే), డింపీ (హర్షిత). కాలీన్‌ భాయ్‌ కొడుకును కాదని తన వ్యాపార సామ్రాజ్య నిర్వహణను అనూహ్యంగా గుడ్డు, బబ్లూలకు అప్పగిస్తాడు. దీంతో మున్నా తీవ్ర అసంతృప్తితో రగిలిపోతూ ఉంటాడు. దీనికి తోడు డింపీ స్నేహితురాలైన స్వీటీని గుడ్డు ప్రేమిస్తాడు.

స్వీటీని ఎలాగైనా దక్కించుకోవాలని కోరికతో మున్నా ఉంటాడు. సమయం చూసుకుని గుడ్డు, అతడి స్నేహితులను చంపాలనుకుంటాడు మున్నా. ఈ క్రమంలో ఓ పెళ్లి వేడుకకు హాజరైన గుడ్డు, గోలు (శ్వేతా త్రిపాఠి), స్వీటీ, బబ్లూ, డింపీలపై తన గ్యాంగ్‌తో కలిసి మున్నా అటాక్‌ చేస్తాడు. ఈ దాడిలో గర్భిణి అయిన స్వీటీతో పాటు బబ్లూ చనిపోతారు. గుడ్డును కూడా చంపాలని ప్రయత్నించినా గోలుతో కలిసి తప్పించుకుంటాడు. మరోవైపు ప్రజల్లో తన పట్ల ఉన్న భయాన్ని మరింత పెంచడానికి కాలీన్‌ భాయ్‌ ఓ పోలీస్‌ ఆఫీసర్‌ను దారుణం హత్య చేయడం తదితర సన్నివేశాలతో సీజన్‌-1ను ముగించారు.


బలమైన ఎమోషనల్‌ డ్రామా సీజన్‌-2

Mirzapur Season 2: సీజన్‌-1 పాత్రల పరిచయంతో పాటు మీర్జాపూర్‌ను పూర్తిగా ఎస్టాబ్లిష్‌ చేశారు దర్శకులు. అదే సమయంలో గన్‌ ఫైర్స్‌, ఛేజింగ్‌లు ఓ ఫుల్‌ యాక్షన్‌ మూవీని తలపించేలా తీర్చిదిద్దగా, సీజన్‌-2లో యాక్షన్‌ మోతాదు తగ్గించి,  డ్రామాపై ఎక్కువ దృష్టి పెట్టారు. మీర్జాపూర్‌లోని పాత్రల మధ్య బలమైన ఎమోషన్స్‌తో కూడిన కథను నడిపించారు. మున్నా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆరంభమయ్యే సన్నివేశాలతో సీజన్‌-2 మొదలవుతుంది. మున్నా చేసిన దాడి నుంచి తప్పించుకున్న గోలు, గుడ్డులు ఓ డాక్టర్‌ను కిడ్నాప్‌ చేసి, చికిత్స పొందుతారు. అంతేకాదు, మున్నా చేసిన దారుణానికి ప్రతీకారం తీర్చుకోవాలని పగతో రగిలిపోతూ ఉంటారు. ఈ క్రమంలో గోలు తుపాకీ షూటింగ్‌ నేర్చుకుంటుంది.

కాలీన్‌భాయ్‌కు అత్యంత విశ్వాస పాత్రుడు మక్బూల్‌. ఒకప్పుడు మున్నా కారణంగా తన కుటుంబ సభ్యుడిని కోల్పోవడంతో ఇదే అదనుగా భావించి, కాలీన్‌ తండ్రిని చంపి పగతీర్చుకోవాలనుకుంటాడు. ఆశ్చర్యకరంగా బీనా (కాలీన్‌ భార్య) కూడా మక్బూల్‌తో చేతులు కలిపి అతడి తండ్రిని చంపుదామని అంటుంది. దీంతో కాలీన్‌ సామ్రాజ్యం పునాదులు కదిలిపోయి మీర్జాపూర్‌పై అతడి ఆధిపత్యం పోతుందని భావిస్తుంది. మరోవైపు తన తండ్రి కాలీన్ భాయ్‌ను మోసం చేసేందుకు శరద్‌ శుక్లాతో చేతులు కలుపుతాడు మున్నా. అదే సమయంలో ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం కుమార్తె మాధురి (ఇషా తల్వార్‌)ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు.

మీర్జాపూర్‌ డాన్‌ సింహాసనాన్ని ఎక్కేందుకు తన తండ్రి కాలీన్‌ భాయ్‌ను చంపడానికి మున్నా ప్లాన్‌లు వేస్తుండగా, మున్నాపై పగతీర్చుకునేందుకు గుడ్డు, గోలు సిద్ధమవుతారు. అదను చూసి దాడికి దిగడంతో తీవ్రంగా గాయపడిన కాలీన్‌భాయ్‌ను శరద్‌ కాపాడతాడు. మున్నాను గుడ్డు చంపేసి, తన సోదరుడు బబ్లూ ప్రేయసి స్వీటీ చావులకు ప్రతీకారం తీర్చుకుంటాడు. అంతేకాదు, మీర్జాపూర్‌ మాఫియా సింహాసనాన్ని అధిరోహిస్తాడు.


సీజన్‌-3లో ఏం చూపించబోతున్నారు?

Mirzapur Season 3: మీర్జాపూర్‌ సింహాసనాన్ని దక్కించుకున్న తర్వాత పూర్వాంచల్‌లో ప్రతి దాన్ని శాసించే శక్తిగా ఎదగాలనుకుంటాడు గుడ్డు. ఈ క్రమంలో మీర్జాపూర్‌లో కాలీన్‌ భాయ్‌ గుర్తులు లేకుండా చెరిపేసేందుకు ప్రయత్నిస్తాడు. మున్నాభాయ్‌ మరణంతో మాధురీ యాదవ్‌ రాజకీయాల్లో అడుగుపెడుతుంది. కాలీన్‌భయ్యాపై సింపథీని క్రియేట్‌ చేసి, ప్రజలకు చేరువకావాలని భావిస్తుంది. మరోవైపు కాలీన్‌ వెనక్కి తిరిగి వస్తాడు. ‘ఈ సింహాసనం.. వారసత్వం.. నేను, నా తండ్రి కలిసి నిర్మించాం. ఇప్పటివరకూ పూర్వాంచల్‌లో జరగనిది చేయాల్సిన సమయం వచ్చింది’ అని కాలీన్‌ భయ్యా మాటలతో సీజన్‌-3పై ఆసక్తిని పెంచారు దర్శకులు గుర్మీత్‌ సింగ్‌, ఆనంద్‌ అయ్యర్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని