Chiranjeevi: రొటీన్‌ చిత్రమే కానీ గొప్ప ఎమోషన్‌ ఉంది

‘‘ప్రతి ఒక్కరూ ప్రేమను పంచి.. ప్రేమను పొంది చేసిన చిత్రమే ‘వాల్తేరు వీరయ్య’. ఈ సినిమా గురించి మీరు ఎంతైనా ఊహించుకోండి.. కచ్చితంగా దాన్ని మించేలాగే ఉంటుంది. ’’ అన్నారు చిరంజీవి.

Updated : 28 Dec 2022 10:02 IST

‘‘ప్రతి ఒక్కరూ ప్రేమను పంచి.. ప్రేమను పొంది చేసిన చిత్రమే ‘వాల్తేరు వీరయ్య’. ఈ సినిమా గురించి మీరు ఎంతైనా ఊహించుకోండి.. కచ్చితంగా దాన్ని మించేలాగే ఉంటుంది. ’’ అన్నారు చిరంజీవి. ఆయన కథానాయకుడిగా బాబీ (కె.ఎస్‌.రవీంద్ర) తెరకెక్కించిన చిత్రమే ‘వాల్తేరు వీరయ్య’. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించింది. శ్రుతిహాసన్‌ కథానాయిక. రవితేజ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హీరో చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘బాబీ కథ చెప్పినప్పుడే ఇందులో ఏదో విషయం ఉందనిపించింది. కచ్చితంగా బ్లాక్‌బస్టర్‌ హిట్టవుతుంది అనిపించింది. ఇది రొటీన్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనరే.. కానీ, లోపల మీరు షాక్‌ తినేంత వైవిధ్యమైన ఎమోషన్‌ దాగి ఉంది. అలాగే ఇందులో నా కామెడీ చాలా బాగా పండింది. ఈ సినిమాకి క్లాస్‌కు క్లాస్‌.. మాస్‌కు మాస్‌ చాలా అద్భుతమైన పాటలిచ్చారు దేవిశ్రీ ప్రసాద్‌. రామ్‌ - లక్ష్మణ్‌, పీటర్‌ హెయిన్స్‌ పోరాటాలు, ప్రకాష్‌ ఆర్ట్‌ వర్క్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. నృత్య దర్శకుడు శేఖర్‌ మాస్టర్‌ నా శైలిని చక్కగా పట్టేశారు. చాలా తక్కువ రోజుల్లో పాటలన్నీ పూర్తి చేశారు. శ్రుతిహాసన్‌ గడ్డ కట్టించే చలిలో ఎంతో అద్భుతంగా నటించింది. ఆ పాట చాలా అద్భుతంగా వచ్చింది’’ అన్నారు. ‘‘సినిమా చూసి చెబుతున్నా.. రాబోయే రోజుల్లో చాలా వేడుకలు ఉండబోతున్నాయి. ఈ చిత్రం ఇంత అద్భుతంగా వచ్చిందంటే దానికి చిరంజీవి, రవితేజ అందించిన ప్రోత్సాహమే కారణం’’ అన్నారు దర్శకుడు బాబీ. నటుడు రాజేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ కథ విన్నప్పుడే మళ్లీ ఓ మెగా హిట్‌ తప్పదనిపించింది. ఈ సంక్రాంతికి నిజమైన పండగ ‘వాల్తేరు వీరయ్య’’ అన్నారు. ‘‘ఇది మాకు చాలా పెద్ద సినిమా. బాబీ అద్భుతమైన కథ సిద్ధం చేశారు. ఈ చిత్రంలో చిరంజీవి, రవితేజ కాంబినేషన్‌లో వచ్చే సన్నివేశాలు రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటాయి. 13నే ఈ చిత్రాన్ని హిందీలోనూ విడుదల చేయనున్నాం’’ అన్నారు నిర్మాత రవిశంకర్‌. ఈ కార్యక్రమంలో రవితేజ, ఊర్వశీ రౌతేలా, చెర్రీ, రామ్‌ - లక్ష్మణ్‌, ప్రకాష్‌, దేవిశ్రీ ప్రసాద్‌, చంద్రబోస్‌, శ్రీనివాస్‌ రెడ్డి, శేఖర్‌ మాస్టర్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని