Manisha Koirala: బికినీ ధరించలేదని తిట్టాడు: చేదు అనుభవాన్ని గుర్తుచేసుకున్న నటి

కెరీర్ ప్రారంభంలో ఎదురైన ఓ చేదు అనుభవాన్ని నటి మనీషా కొయిరాల గుర్తుచేసుకున్నారు. 

Published : 09 Jul 2024 10:03 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘బొంబాయి’తో దక్షిణాది సినీప్రియులకు చేరువయ్యారు నటి మనీషా కొయిరాల (Manisha Koirala). ఆ సినిమా విజయం తర్వాత పలు కోలీవుడ్‌ చిత్రాల్లో నటించి మెప్పించారు. కెరీర్‌ ప్రారంభంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని మనీషా తాజాగా గుర్తుచేసుకున్నారు. 

‘‘కెరీర్‌ ప్రారంభంలో ఫొటోషూట్‌లు చేస్తామని కొందరు అడిగేవారు. ఆ సమయంలో ఓ ఫొటోగ్రాఫర్‌ నన్ను తెగ ప్రశంసించాడు. నేను సూపర్‌స్టార్‌ అవుతానంటూ పొగిడాడు. ఆ తర్వాత టూ పీసెస్ డ్రెస్‌ తీసుకొచ్చి వేసుకోవాలని సూచించాడు. నేను స్విమ్మింగ్‌ చేసే సమయంలోనే ఇలాంటి డ్రెస్‌లు వేసుకుంటానని.. సినిమాల్లో అవకాశాల కోసం ఇలాంటి డ్రెస్‌లు వేసుకోను అని నిర్మొహమాటంగా చెప్పేశాను. దీంతో ఆయన నన్ను తిట్టి అక్కడినుంచి వెళ్లిపోయాడు. ‘కరగడానికి నిరాకరించే మట్టిముద్ద నుంచి ఎవరూ బొమ్మను తయారుచేయలేరు’ అని అన్నాడు. నేను ఆ మాటలను ఇప్పటికీ మర్చిపోలేదు. అందరి మనస్తత్వం ఒకేలా ఉండదని అర్థం చేసుకున్నా. పెద్ద సెలబ్రిటీ అయ్యాక అతడే వచ్చి నాకు ఫొటోషూట్‌ చేశాడు’’ అని మనీషా గుర్తుచేసుకున్నారు. 

‘కల్కి’ టీమ్‌కు హ్యాట్సాఫ్‌.. ప్రతి ఫ్రేమ్‌ కళాఖండమే..: మహేశ్‌ బాబు

1991లో ఇండస్ట్రీకి వచ్చిన మనీషా ఆతర్వాత పలు భాషల్లో వరుస హిట్‌ చిత్రాల్లో నటించి అలరించారు.  ‘బొంబాయి’ (Bombay)తో తెలుగు ప్రేక్షకులకు అభిమాన నటిగా మారారు. 2012లో ఆమె అండాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్నట్లు వెల్లడించారు. 2014లో దానినుంచి కోలుకున్నట్లు తెలిపారు. క్యాన్సర్‌ బారినపడడంతో కొన్నేళ్లపాటు విరామం తీసుకున్న ఆమె ఇటీవల సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘హీరామండి’ వెబ్‌ సిరీస్‌లో మల్లికాజాన్‌గా తన నటనతో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఇది నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రసారమవుతోంది. త్వరలోనే ఈ వెబ్‌సిరీస్‌ రెండో భాగం ప్రారంభం కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని