Manchu Vishnu: నమ్మకంతో చెబుతున్నా.. ‘జిన్నా’ ఓ మైలురాయి కానుంది: మంచు విష్ణు

‘జిన్నా’పై (GINNA) తాను గట్టి నమ్మకంతో ఉన్నట్లు నటుడు మంచు విష్ణు (Manchu Vishnu) తెలిపారు. ఆయన హీరోగా సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా...

Updated : 09 Sep 2022 19:42 IST

హైదరాబాద్‌: ‘జిన్నా’పై (GINNA) తాను గట్టి నమ్మకంతో ఉన్నట్లు నటుడు మంచు విష్ణు (Manchu Vishnu) తెలిపారు. ఆయన హీరోగా సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టీజర్‌ విడుదల కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. పాయల్‌ రాజ్‌పుత్‌ - సన్నీలియోనీ కథానాయికలు. ‘‘జిన్నా టైమ్‌కే వస్తాడు. వచ్చేటప్పుడు బ్యాడ్‌ టైమ్‌ తీసుకువస్తాడు’’ అంటూ రఘుబాబు చెప్పే డైలాగ్స్‌తో ప్రారంభమైన ఈ టీజర్‌ ఫన్‌ + హారర్‌ ఎలిమెంట్స్‌తో సాగింది. ‘‘నేను ఈ అప్పుల నుంచి బయటపడాలంటే సాక్షాత్తూ లక్ష్మీదేవే పచ్చబస్సు ఎక్కి నేరుగా మన రంగంపేటలో దిగాల్సిందే’’ అంటూ రాయలసీమ యాసలో విష్ణు చెప్పిన సంభాషణలు నవ్వులు పూయించేలా ఉన్నాయి.

టీజర్‌ విడుదల అనంతరం విష్ణు మాట్లాడుతూ.. ‘‘మీ ప్రేమాభిమానాల కోసమే మేము సినిమాలు చేస్తున్నాం. సినిమా చూసే అభిమానులు లేకపోతే నటులుగా మేము లేము. ‘జిన్నా’ నా మనసుకు దగ్గరైన చిత్రం. ఎందుకంటే, ఈ సినిమాతో నాకెంతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. నా బంగారు తల్లులు అరియానా, విరియానా ఈ సినిమాలో పాట పాడారు. మీ అందరూ ఆ పాటను ఎలా స్వాగతిస్తారోనని మేమంతా భయపడ్డాం. మీ నుంచి వచ్చిన మంచి స్పందనకు ధన్యవాదాలు. నాగేశ్వర రెడ్డి ఈ కథ రాశారు. నా కెరీర్‌లో ఆయన పేరుని సువర్ణాక్షరాలతో లిఖించాలి. ఎందుకంటే ఆయన నాకు మూడు హిట్స్‌ ఇచ్చారు. కోనవెంకట్‌ ఓసారి నన్ను కలిసి ఈ కథ చెప్పారు. ఈ కథ విన్న వెంటనే.. ‘‘బాగుంది. చిన్న చిన్న మార్పులు చేయాలి. అయినా సన్నీలియోనీని ఎందుకు తీసుకుంటున్నారు? ఆమె స్థానంలో వేరే ఎవరినైనా ఎంచుకోండి’’ అని చెప్పా. ఆ తర్వాత నాకు తెలిసిన మీడియా వారితో సన్నీలియోనీపై ఓ సర్వే చేయించాం. 73 శాతం మంది సన్నీలియోనీకే ఓటు వేశారు. అలా టీమ్‌ మాటకు ఓకే అని సన్నీలియోనీ, పాయల్‌ రాజ్‌పుత్‌ కథానాయికలుగా జిన్నా మొదలుపెట్టాం. గట్టి నమ్మకంతో చెబుతున్నా ‘జిన్నా’ నా లైఫ్‌లో ఓ మైలురాయి కానుంది. అక్టోబర్‌లో మా చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని విష్ణు వివరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని