Tollywood: కొత్త రూపు... తారల ముందు చూపు

ప్రతి సినిమాకీ కథ...ఆ కథకు తగ్గట్టుగా పాత్ర... పాత్రకు తగ్గట్టుగా రూపం మారుతూనే ఉంటాయి. అలా ప్రతి విషయంలోనూ కొత్తదనం చూపిస్తూ, తమని తాము తెరపై సరికొత్తగా ఆవిష్కరించుకోవడంపై నేటితరం కథానాయకులు ఎంతో ఆసక్తి చూపుతున్నారు.

Updated : 01 Jul 2024 06:09 IST

ప్రతి సినిమాకీ కథ...ఆ కథకు తగ్గట్టుగా పాత్ర... పాత్రకు తగ్గట్టుగా రూపం మారుతూనే ఉంటాయి. అలా ప్రతి విషయంలోనూ కొత్తదనం చూపిస్తూ, తమని తాము తెరపై సరికొత్తగా ఆవిష్కరించుకోవడంపై నేటితరం కథానాయకులు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. అందుకోసం కఠోర శిక్షణకీ వెనకాడటం లేదు. అవసరమైతే ఆహార నియమాల్ని పాటిస్తూ, ఆయా పాత్రల మనస్తత్వాలకు తగ్గట్టుగా శారీరకంగా, మానసికంగా సన్నద్ధమవుతుంటారు. కొత్త సినిమాని ఆరంభించే ప్రతిసారీ హీరోల కొత్త లుక్‌కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తుంటాయి. మహేశ్‌బాబు ఇప్పటికే రాజమౌళి తెరకెక్కించనున్న సినిమా కోసం బల్క్‌ బాడీ సిద్ధం చేస్తున్నారు. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ కూడా ముందు చూపుతో ఇప్పటికే రాబోయే చిత్రాలకు సంబంధించిన సన్నాహాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది.  

కప్పుడు కొత్త లుక్‌ అంటే తలకట్టు, గడ్డం మీసకట్టులో  చిన్నపాటి మార్పు చేర్పులు చేసుకుని రంగంలోకి దిగేవాళ్లు. కానీ ఇప్పుడు అక్కడితో  సరిపెట్టడం లేదు. కథానాయకులు శారీరకంగానూ మారిపోతున్నారు. కొన్ని పాత్రలకు నాజూగ్గా, కొన్ని పాత్రలకు బొద్దుగా మారిపోతూ ఆ పాత్రలకి జీవం పోస్తున్నారు. దర్శకులూ తమ ఊహలకు తగ్గట్టుగా, సహజంగా తెరపై పాత్రలు   కనిపించే వరకూ రాజీ పడటం లేదు. దాంతో తారలు ప్రతి సినిమాకి ముందూ  కొన్ని నెలలపాటు అందులోని పాత్రల్ని ఆకళింపు చేసుకుని, అందుకు తగ్గట్టుగా సిద్ధం అవుతున్నారు. అగ్ర తారలు చాలా వరకూ  పాన్‌ ఇండియా స్థాయిలో భారీ సినిమాలు చేస్తుండడంతో, లుక్‌  విషయంపై మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దేహం పెంచాలన్నా, తగ్గించాలన్నా కొన్ని నెలల సమయం కావల్సిందే. అందుకే భవిష్యత్తులో చేయబోయే పాత్రల్ని దృష్టిలో ఉంచుకుని ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకుంటుంటారు తారలు.

స్పోర్ట్స్‌ డ్రామాకి తగ్గట్టుగా... 

రామ్‌చరణ్‌ ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో ‘గేమ్‌ ఛేంజర్‌’ చేస్తున్నారు. దాదాపు చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఇందులో చరణ్‌ యువ ఐఏఎస్‌ అధికారిగా కనిపిస్తారు. ఆ పాత్రకు తగ్గట్టుగానే ఆయన ప్రత్యేకమైన తలకట్టుతో, మరింత ఫిట్‌గా సన్నద్ధమై సెట్స్‌పైకి వెళ్లారు. ఇప్పటికీ ఆ లుక్‌లోనే ఉన్నారు. తదుపరి ఆయన బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్‌ డ్రామా కోసం రంగంలోకి దిగనున్నారు. ఆగస్టు నుంచి ప్రారంభం కానున్న ఆ సినిమా కోసం రామ్‌చరణ్‌ శారీరకంగానూ ప్రత్యేకంగా సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. స్పోర్ట్స్‌ నేపథ్యానికి తగ్గట్టుగా లుక్‌ని మార్చాల్సిందే. జులై నెలంతా ఆ పాత్ర లుక్‌పైనే ఆయన దృష్టి పెట్టనున్నట్టు సమాచారం. 


‘స్పిరిట్‌’ సన్నాహాలు

ల్కి’ సినిమాతో సందడి చేస్తున్న ప్రభాస్‌ ప్రస్తుతం యూరప్‌లో ఉన్నట్టు సమాచారం. అక్కడి నుంచి రాగానే ఆయన ‘స్పిరిట్‌’  పనులపై దృష్టి పెట్టనున్నట్టు సమాచారం. సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న ‘స్పిరిట్‌’లో ప్రభాస్‌ పోలీసుగా కనిపించనున్నారు. పోలీసు పాత్ర అంటే నాజూగ్గా, ఫిట్‌గా కనిపించాల్సిందే. రానున్న కొన్ని నెలలపాటు ప్రభాస్‌ ఈ సినిమాలోని పాత్రకోసమే సన్నద్ధం కానున్నట్టు సమాచారం. ఈ ఏడాది అక్టోబరు, డిసెంబరు మధ్యలో సినిమా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.  ప్రభాస్‌ ప్రస్తుతం ‘రాజాసాబ్‌’ సినిమా చేస్తున్నారు. అందులోనూ ఆయన కలర్‌ఫుల్‌గా, స్టైలిష్‌గా కనిపించనున్నారు. 


ఎన్టీఆర్‌ కూడా... 

టు ‘దేవర’, అటు ‘వార్‌ 2’... ఎన్టీఆర్‌ ఇప్పుడు ఈ రెండు సినిమాలపైనా దృష్టిపెట్టారు. ‘వార్‌ 2’ సెట్స్‌కి వెళ్లే ముందు ఆయన గెటప్‌ మారిన సంగతి తెలిసిందే. తదుపరి ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో చేయనున్న కొత్త సినిమాలో ఎన్టీఆర్‌  మరింత మాస్‌గా కనిపించనున్నట్టు ప్రచార చిత్రాలు చాటి చెప్పాయి. ఎన్టీఆర్‌ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తి కాగానే, కొత్త చిత్రం లుక్‌పై దృష్టి పెట్టనున్నారు. అల్లు అర్జున్‌ కొన్నేళ్లుగా ‘పుష్ప’ గెటప్‌లోనే ఉన్నారు. పొడవాటి జుట్టు, గడ్డంతోనే కనిపిస్తున్నారు. తదుపరి సినిమా కోసం ఆయన గెటప్‌ తప్పకుండా మారుతుంది. ‘పుష్ప 3’ కోసం కథ సిద్ధమైనప్పటికీ, మరో కొత్త కథతో, కొత్త లుక్‌లో కనిపించాలనే ప్రయత్నంలో అల్లు అర్జున్‌ ఉన్నట్టు తెలుస్తోంది. ‘తండేల్‌’ కోసం నాగచైతన్య, ‘మట్కా’ కోసం వరుణ్‌ తేజ్‌ రకరకాల గెటప్పుల్లో సందడి చేయనున్నారు. నిఖిల్‌ ‘స్వయంభూ’ కోసం, అఖిల్‌ తన కొత్త చిత్రం కోసం జుట్టు, దేహం పెంచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని