Krishna vamsi interview: ఆఫీస్‌ బాయ్‌ అనుకొని టీ తీసుకురమ్మన్నారు..: కృష్ణవంశీ

గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి (sirivennela sitarama sastry) ని చాలా ఎక్కువగా అనుసరించే వాడినని దర్శకుడు కృష్ణవంశీ (Krishna vamsi) అన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు.

Updated : 09 Jul 2024 14:48 IST

Krishna Vamsi Interview: అర్ధాకలితో గడిపిన రోజులు, అరిగిన చెప్పుల్లో అరికాళ్ల పగుళ్లు జీవితంలో ఆయనకు ఎన్నో పాఠాలు నేర్పించాయి. ఖాళీ జేబుని, బరువైన పర్సుని కూడా జీవితం ఆయనకి చూపించింది. పరస్పర, విరుద్ధమైన భావజాలం కలిగిన ముగ్గురు వ్యక్తులు సిరివెన్నెల సీతారామశాస్త్రి, యండమూరి వీరేంద్రనాథ్‌, రామ్‌గోపాల్‌ వర్మ వీరి నుంచి జీవితంలో ఎప్పుడూ ఏదోకటి నేర్చుకుంటూ ఉండేవాడినని ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ అన్నారు. ఈటీవీ ‘నా ఉచ్ఛ్వాసం కవనం’ (Naa Uchvasanam Kavanam) కార్యక్రమానికి అతిథిగా హాజరైన ఆయన సీతారామశాస్త్రితో ఉన్న పరిచయాన్ని, దత్త పుత్రుడిగా, మానస పుత్రుడిగా, ఆయనపై ఉన్న ప్రేమను పంచుకున్నారు.

మీ సినిమాల్లో పాటల చిత్రీకరణకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. సినిమాకు పాట అవసరమా? పాటకున్న ఔచిత్యం ఏంటి? ఎలాంటి సందర్భంలో పాట పెట్టాలని మీరు అనుకుంటారు?

కృష్ణవంశీ: చాలా పెద్ద ప్రశ్నే ఇది. సినిమాకి పాట అవసరమా? కాదా! అని చెప్పే స్థాయి ఉందనుకోవట్లేదు. వ్యక్తిగతంగా పాటలంటే ఇష్టం. చూడటం కూడా అంతే ఇష్టం. అందుకే కేవలం పాటలతోనే సినిమా తీయమంటే తీసేస్తాను. పాట లేకుండా సినిమా అంటే ఇష్టం ఉండదు. పాట అనేది సినిమాకి, జీవితానికి చాలా ముఖ్యమని నా పర్సనల్‌ ఫీలింగ్‌.

శాస్త్రిగారి సాహిత్యంతో మీ ప్రయాణం ఎప్పుడు మొదలైంది?

కృష్ణవంశీ: ప్రయాణం అనే దానికన్నా అనుసరణ అంటే బాగుంటుంది. ఆయనతో నా పరిచయం చాలా విచిత్రంగా మొదలైంది. తాడేపల్లిగూడెంలో డిగ్రీ పూర్తి చేసి సినిమాల్లోకి వెళ్లాలనుకొనే సమయంలో సిరివెన్నెల సినిమా రిలీజ్‌ అయ్యింది. ‘శంకరాభరణం’ నుంచి విశ్వనాథ్‌ గారి సినిమాలు చూడటం అలవాటైంది. సినిమా చూస్తున్నా కానీ హీరో, హీరోయిన్లు అంధుడు, మూగమ్మాయి కావడంతో నచ్చట్లేదు. అయితే, మ్యూజిక్‌ అద్భుతంగా ఉంది. ఆ సినిమాకి వేటూరిగారు సాహిత్యం అందించారనుకున్నా. సీతారామశాస్త్రిగారని ఆ తర్వాత తెలిసింది. నాకు బాగా నచ్చిన సినిమా పాటల పుస్తకాలు కొని వాటిని నోట్‌బుక్‌లో రాసుకునే అలవాటుంది. ఆయన రాసిన ఒక పాటలో దేవుడిని తిట్టారు. అది లాజికల్‌గా అనిపించింది. జీవితం గురించి తెలిసేలా ఉంది. ఆ తర్వాత నుంచి ఆయన ప్రతి పాటనీ వినడం మొదలుపెట్టా.

త్రిపురనేని చిట్టి దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా జాయిన్‌ అయ్యా. ‘నా పేరు దుర్గన్‌’ సినిమా చేశా అది విడుదల కాలేదు. తర్వాత సిల్క్‌స్మిత గారి ప్రొడక్షన్‌లో ఆమె హీరోయిన్‌గా ‘బ్రహ్మ అనే రాత తారుమారు’ సినిమాకి సిరివెన్నెల గారిని పిలిపించాం. డైరెక్టర్‌గారు శాస్త్రిగారికి సినిమా గురించి వివరించి, నన్ను చూసుకోమని వెళ్లిపోయారు. ఆయన పనిలో ఉండగా నేను లోపలికి వెళ్లేసరికి ‘కాస్త మంచినీళ్లు, టీ తీసుకురా బాబు’ అన్నారు. నన్ను హౌస్‌బాయ్‌ అనుకున్నారని అర్థమైంది. అయినా నా ఈగో హర్ట్‌ అవ్వలేదు. అదే గురువుగారిని మొదటిసారి దగ్గరగా చూడటం. ఆయన ఒక పాట ఇచ్చి ఫెయిర్‌ చేయమన్నారు. నేను రాసిన విధానం చూసి ఆశ్చర్యపోయి, మెచ్చుకున్నారు. ఆ చిత్రం తర్వాత కొన్నాళ్లు మేమిద్దరం కలిసిన సందర్భం రాలేదు. ‘శివ’, ‘క్షణ క్షణం’, ‘అంతం’ మూవీలతో స్నేహితులమయ్యాం.

మనీ మనీ సినిమాకి ఆయనతో లిరిక్స్‌ రాయించాలనుకున్నాం. కేవలం అరగంటలోనే రాసిచ్చేశారు. నేను చూసిన చిన్న ప్రపంచంలో పాటకి అన్యాయం చేయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇష్టపడరాయన. నైతిక విలువల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలరు. నిత్యం పరిమళాలు వెదజల్లే పువ్వులాంటి వ్యక్తిత్వం ఆయనిది. గర్వం లేని వ్యక్తి. ఎంత గొప్ప వ్యక్తి అంటే వేరొక రైటర్‌ రాసిన లిరిక్స్‌ నచ్చితే వెంటనే ఫోన్‌ చేసి అభినందించేవారు.

 ఇండస్ట్రీలోనే అత్యంత ఎక్కువగా పాటల వెర్షన్లు రాసింది మీకేనట నిజమేనా?

కృష్ణవంశీ: చాలా ఉన్నాయి. ఆయన ఒక్కో పాటకి 30 వెర్షన్లు రాస్తారు. నా ప్రతి పాటకు పదిహేను చరణాలకు తక్కువ రాయలేదు. ఇండ్రస్ట్రీలో ఎక్కువ వెర్షన్లు రాసింది కూడా నాకేననుకుంటా. నాకు పాట మీద ఉండే ఇష్టం వల్ల ఎలాంటి సౌండ్‌, టోన్స్‌, ట్యూన్స్‌ ఉండాలో నాకంటూ ఒక అభిప్రాయం ఉంది. స్టోరీ ఎంత చెప్పాలి? ఎమోషన్స్‌ని ఎంతవరకు చూపించాలి? అనే విషయాలపై స్క్రిప్ట్‌ మొదలైనప్పటినుంచి చర్చ జరుగుతుంది. కొన్ని సినిమాలైతే కేవలం పాటలు డిజైన్‌ చేసి, దాని చుట్టూ కథ అల్లినవి కూడా ఉన్నాయి. ఆ సినిమాలేంటని మాత్రం అడగొద్దు.  అలాంటిది ‘గులాబి’ కి ఇంకా ఎక్కువ ఉండేది. ‘సోలో మెయిన్‌ సాంగ్‌ కావాలి. హీరో చావు బతుకుల మధ్య ఉంటాడు. అమ్మాయి గుర్తుకువస్తుంది. దానిలో పెయిన్‌ ఉండాలి. రొమాన్స్‌, ప్రేమ కనిపించాలి’ ఇలా నాలోని భావాలను చెప్పాను. అదే ‘ఏ రోజైతే చూశానో నిన్ను’ సాంగ్‌. ఈ సినిమాకి జరిగిన విచిత్రం ఏమిటంటే.. ఫస్టాఫ్‌ రెండు పాటలు.. సెకండాఫ్‌ రెండు పాటలతో సినిమా క్లైమాక్స్‌ పూర్తి చేశాం. కానీ ఆ సినిమాకి ఆరు పాటలు కావాలన్నారు. ‘శశి.. నీ దగ్గర పాత పాట ఉందా’ అని అడిగా.. తన దగ్గరున్న పాట ఇచ్చాడు. అది మేల్‌ వెర్షన్‌ వేరే పాట. ఆ పాటే ‘ఈ వేళలో నీవు ఏం చేస్తువుంటావు..’ సాంగ్‌.  ఆ పాటకి లిరిక్స్‌ని ఒక్క రాత్రిలో రాసిచ్చేశారు. వెంటనే హైదరాబాద్‌లోనే రికార్డ్‌ చేశాం. సినిమా మొత్తం కొత్త సింగర్స్‌తోనే పాడించాలనుకున్నాం. ఈ సాంగ్‌ని సినిమా అంతా పూర్తి అయిపోయాక సిరివెన్నెల చెబితేనే ప్రత్యేకంగా షూట్‌ చేశాం. ఒక అమ్మాయి అబ్బాయి గురించి ఏమనుకుంటుంది? ఎలా ఆలోచిస్తుంది? అనే విషయాల్నీ అమ్మాయిలతో ఎక్కువ పరిచయం లేని ఆయన ఎలా రాశారనేది నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే. ‘గులాబి’లో కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే సాంగ్‌ కావాలి. నెగెటివ్‌ స్ప్రెడ్‌ అవ్వకూడదు..  దానికి ఆయన ఇచ్చిన పాట ‘కాలేజీలో మహరాజులు.. ఈ గేటు దాటక ప్రజలౌదురు’ జీవిత సత్యాన్ని ఆయన చాలా గొప్పగా చెప్పారు.

‘‘నిన్నే పెళ్లాడతా సినిమాలో ‘కన్నుల్లో నీ రూపమే’ సాంగ్‌ పిక్చరైజేషన్‌ చాలా కష్టం. కానీ, వంశీ చాలా బాగా డీల్‌ చేశారు’’ దీనిపై మీ స్పందన?

కృష్ణవంశీ: ‘నిన్నే పెళ్లాడతా’కి చాలా కథే ఉంది. కన్నుల్లో నీ రూపమే సాంగ్‌ సందర్భం ఉంది కానీ పాట లేదు. ఇక్కడ ఇద్దరి ఇళ్లల్లోనూ పెద్దవాళ్లు లేరు.  అమ్మాయి, అబ్బాయి కలవాలి. ఎవరి ఈగోలు తగ్గకూడదు. ఎంతైనా చెప్పొచ్చు.. ఏమీ చెప్పకూడదు.. అని చెబితే ఆయన రొటీన్‌ డైలాగ్‌ ఒకటి చెప్తూ  ‘నువ్వు నాశనం.. నేను నాశనం’ అని వ్యంగ్యంగా నన్ను తిడుతూ ‘కన్నుల్లో నీ రూపమే’ పాట రాశారు. ఆ పాట చాలా సూపర్‌ డూపర్‌ హిట్‌ అయ్యింది.

మీరు మిగతా రచయితలతో కూడా పని చేశారు. ఒక సినిమా అనుకున్నప్పుడు ఫలానా పాట సిరివెన్నెలే రాయాలని ఎందుకు అనుకుంటారు?

కృష్ణవంశీ: అలా ఏమీ లేదు. నా సినిమాలో అన్ని పాటలు శాస్త్రిగారివే. అక్కడ కుదరకపోతే బయటకు వెళతాను. ఒకట్రెెండు సార్లు అనుకుంటా ఆయనకు భయపడి బయట రాయించాను.

మీరు తీసిన అనేక సినిమాల్లో ఆణిముత్యం సింధూరం సినిమా ఒకటి. దీనిపరంగా చూస్తే మీరు నక్సలిజాన్ని సపోర్ట్‌ చేస్తున్నారా?

కృష్ణవంశీ: ఆ సినిమాలో పాట పాడింది నేను కాదు కదా!  సింధూరం అంటే పగలు కాదు, రాత్రి కాదు. సంధ్య వేళ. ఈ సినిమాలో సమస్య కూడా అలాగే ఉంటుంది. దానికి తగ్గట్టుగా సిరివెన్నెల గారు పరకాయ ప్రవేశం చేసి పాటలు రాశారు. అదే ఆయనలో ఉండే గొప్పతనం. ఆయనకి నక్సలిజం మీద నమ్మకం లేకపోయినా సమస్య తీవ్రత తెలుసు. ఇక్కడ సామాన్య ప్రజల సమస్యల్ని తెలియజేయాలనుకున్నాం కానీ సపోర్ట్‌ చేస్తున్నట్లు కాదు.

‘అర్ధశతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రమందామా’ పాట సిరివెన్నెల పాటల్లోనే బెస్ట్‌ కదా .. ఈ పాట గురించి మీ అనుభవాలు?

కృష్ణవంశీ: ప్రతి సినిమాకీ కథ చెప్పడం, కాపీ వచ్చిన తర్వాత చూపించడం అలవాటు. సింధూరం కాపీ చూసిన తర్వాత రోడ్డు మీద అటూఇటూ తిరుగుతున్నారు. ఏంటి గురువుగారు అంటే ‘పేపర్‌ ఏదైనా ఉందా’ అని అడిగారు. నా దగ్గర పేపర్‌ లేదు. రోడ్డు మీద సిగరెట్‌ పెట్టె పడి ఉంటే తీసి ఇచ్చా. దానిమీద లిరిక్స్‌ రాసుకొని వెంటనే ఇంటికి వెళ్లి గంటలో పాట రాసిచ్చి ఏం చేస్తావో తెలీదు. ఇవి ఫలానా చోట్ల రావాలని చెప్పారు. రెండు రోజుల్లో సినిమా రిలీజ్‌. ఏం చేయాలో అర్థంకాక మేమంతా బాలుగారి మీద పడ్డాం. రికార్డు చేసి విడుదల చేశాం. రిలీజ్‌ తర్వాత సినిమాకి అవే కీలకం అయ్యాయి.

పాట రికార్డు చేశాక సింధూరం సినిమాకు ఓ పరమార్థం లభించిందా?

కృష్ణవంశీ: నిజం చెప్పాలంటే ఆ సినిమాకి అప్పుడే ఓ పరమార్థం వచ్చింది.  లేకుంటే ఆ సినిమా ఇన్‌కంప్లీట్‌. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా దాని గురించి చర్చిస్తున్నారంటే అది ఆయన గొప్పతనమే.

సీతారామశాస్త్రితో మీ మొత్తం ప్రయాణం గురించి చెప్పమంటే..?

కృష్ణవంశీ: చెబితే నాటకీయంగా ఉంటుంది. కానీ నా జన్మకి దొరికిన ఓ గొప్ప అదృష్టం.  ఎంతో అదృష్టం ఉంటే తప్ప అలాంటి గొప్పవారితో పరిచయాలు జరగవు. ఒక గంధం చెట్టు కిందకి గాలికి కొట్టుకొచ్చిన పిచ్చి ఆకుని నేను. ఆ గాలి పరిమళం వల్లే ఇంతవాడినయ్యాను. గత జన్మలో ఆయన ఓ మహర్షి అయితే ఆయన ఆశ్రమంలో నేను శిష్యుడినేమో. అందుకే ఈ జన్మలో అంతటి అవినాభావ సంబంధం ఏర్పడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని