Bhaje Vayu Vegam: ఓటీటీలోకి ‘భజే వాయు వేగం’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే

‘భజే వాయు వేగం’ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. స్ట్రీమింగ్‌ తేదీని ప్రకటిస్తూ నిర్మాణ సంస్థ పోస్ట్ పెట్టింది.

Published : 24 Jun 2024 21:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కార్తికేయ (Kartikeya) హీరోగా తెరకెక్కిన సినిమా ‘భజే వాయు వేగం’ (Bhaje Vayu Vegam). ఈ చిత్రంతో ప్రశాంత్‌ రెడ్డి దర్శకుడిగా పరిచయమయ్యారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడీ చిత్రం ఓటీటీ ఆడియన్స్‌కు వినోదాన్ని పంచేందుకు సిద్ధమైంది. జూన్‌ 28 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) వేదికగా ప్రసారం కానుంది. ఈ విషయాన్ని తెలుపుతూ సంస్థ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. కార్తికేయ సరసన ఐశ్వర్య మేనన్‌ నటించిన ఈ చిత్రంలో రాహుల్‌ టైసన్, తనికెళ్ల భరణి, శరత్‌ లోహితస్వ తదితరులు నటించారు.

కథేంటంటే: వరంగల్‌ సమీపంలోని రాజన్నపేటకు చెందిన కుర్రాడు వెంకట్‌ (కార్తికేయ). తల్లిదండ్రులు వ్యవసాయంలో నష్టాలు రావడంతో అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకుంటారు. దీంతో అనాథైన వెంకట్‌ను తండ్రి స్నేహితుడు లక్ష్మయ్య (తనికెళ్ల భరణి) చేరదీసి.. తన కొడుకు రాజు (రాహుల్‌ టైసన్‌)తో పాటు పెంచి పెద్ద చేస్తాడు. క్రికెటర్‌ అవ్వాలన్న లక్ష్యంతో వెంకట్‌.. మంచి ఉద్యోగం సంపాదించాలన్న కోరికతో రాజు ఊరి నుంచి హైదరాబాద్‌కు వస్తారు. కానీ, కొందరు చేసిన కుట్రల వల్ల అనుకున్న లక్ష్యాల్ని చేరుకోలేకపోతారు. దీంతో వెంకట్‌ క్రికెట్‌ బెట్టింగ్‌లు వేస్తూ.. రాజు ఓ స్టార్‌ హోటల్‌లో పనిచేస్తూ జీవనం సాగిస్తుంటారు. కొంతకాలం అనంతరం లక్ష్మయ్య అనారోగ్యానికి గురవుతాడు. ఆయన్ని కాపాడాలంటే ఆపరేషన్‌ చేయాలని.. అందుకు రూ.20 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెబుతారు. దీంతో ఆ డబ్బు సంపాదించే క్రమంలో వెంకట్‌.. డేవిడ్‌ (రవిశంకర్‌) గ్యాంగ్‌ దగ్గర క్రికెట్‌ బెట్టింగ్‌ వేస్తాడు. ఆ బెట్టింగ్‌లో వెంకట్‌ గెలిచినా.. తను గెలుచుకున్న డబుల్‌ అమౌంట్‌ రూ.40లక్షలు ఇచ్చేందుకు డేవిడ్‌ మనుషులు నిరాకరిస్తారు. మరి, ఆ తర్వాత ఏమైంది? ఓవైపు డేవిడ్‌ గ్యాంగ్‌ నుంచి వెంకట్‌కు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? తన తండ్రి స్నేహితుడిని కాపాడుకునేందుకు తనేం చేశాడు? అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని