Kalki 2898 AD: భయపడకు... మరో ప్రపంచం వస్తోంది

‘కల్కి 2898 ఎ.డి’ చిత్రంతో సినీప్రియుల్ని మరో సరికొత్త ఊహా ప్రపంచంలోకి తీసుకెళ్లనున్నారు ప్రభాస్‌. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ బహుభాషా చిత్రాన్ని నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించారు. వైజయంతీ మూవీస్‌ సంస్థ నిర్మించింది.

Updated : 11 Jun 2024 07:28 IST

‘కల్కి 2898 ఎ.డి’ చిత్రంతో సినీప్రియుల్ని మరో సరికొత్త ఊహా ప్రపంచంలోకి తీసుకెళ్లనున్నారు ప్రభాస్‌. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ బహుభాషా చిత్రాన్ని నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించారు. వైజయంతీ మూవీస్‌ సంస్థ నిర్మించింది. దీపికా పదుకొణె కథానాయిక. అమితాబ్‌ బచ్చన్, కమల్‌హాసన్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్ర ట్రైలర్‌ను సోమవారం విడుదల చేశారు. ‘‘ఈ వరల్డ్‌లో చివరి నగరం కాశీ’’ అంటూ రాజేంద్రప్రసాద్‌తో పాటు ఓ పిల్లాడు చెప్పే డైలాగ్‌తో కల్కి ప్రపంచాన్ని ఆసక్తికరంగా పరిచయం చేసింది చిత్ర బృందం. ‘‘ఈ లోకంలో ఉన్నది కాంప్లెక్స్‌ ఒక్కటే. దేవుడు ఒక్కడే..’’ అంటూ ఈ కథలోని మరో కొత్త లోకాన్ని చూపించారు. 6వేల ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన ఓ శక్తి కోసం ఈ రెండు లోకాల మధ్య జరిగే పోరు ఈ చిత్ర ప్రధాన ఇతివృతంగా ఉండనున్నట్లు ప్రచార చిత్రాన్ని బట్టి అర్థమవుతోంది. ట్రైలర్‌లో భవిష్యత్తు కాశీ నగరాన్ని చూపించిన తీరు.. కాంప్లెక్స్‌ ప్రపంచం ఆసక్తిని రేకెత్తిస్తోంది. భైరవగా ప్రభాస్‌ చేసిన యాక్షన్‌ హంగామా.. ‘‘రికార్డ్స్‌ చూసుకో ఇంత వరకు ఒక్క ఫైట్‌ కూడా ఓడిపోలేదు’’ అంటూ ట్రైలర్‌లో ఆయన చెప్పిన డైలాగ్‌ అలరించింది. ఆఖర్లో ‘‘ఇంకా తొలి ఊపిరి కూడా తీసుకోని ఈ బిడ్డ కోసం ఇంకా ఎంత మంది చనిపోవాలి’’ అంటూ దీపిక అడగ్గా.. ‘‘భయపడకు.. మరో ప్రపంచం వస్తోంది’’ అంటూ చిత్రమైన ఆహార్యంతో కమల్‌ చెప్పిన డైలాగ్‌ అంచనాలు పెంచేలా ఉన్నాయి. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సైన్స్‌ ఫిక్షన్‌ సినిమా ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి సంతోష్‌ నారాయణన్‌ సంగీతమందించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని