Kalki 2898 AD: నీ కడుపులో ఉన్నది భగవంతుడు

‘కల్కి 2898 ఎ.డి’తో సినీప్రియుల్ని అలరించేందుకు సమాయత్తమవుతున్నారు ప్రభాస్‌. ఆయన కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించిన ఈ బహుభాషా చిత్రాన్ని వైజయంతీ మూవీస్‌ సంస్థ నిర్మించింది.

Updated : 22 Jun 2024 09:32 IST

‘కల్కి 2898 ఎ.డి’తో సినీప్రియుల్ని అలరించేందుకు సమాయత్తమవుతున్నారు ప్రభాస్‌. ఆయన కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించిన ఈ బహుభాషా చిత్రాన్ని వైజయంతీ మూవీస్‌ సంస్థ నిర్మించింది. దీపిక పదుకొణె కథానాయిక. అమితాబ్‌ బచ్చన్, కమల్‌హాసన్, దిశా పటానీ    తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం రాత్రి ఈ చిత్ర రిలీజ్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘‘సమయం వచ్చింది. భగవంతుడి లోపల సమస్త సృష్టి ఉంటుందంటారు. అలాంటిది నీ కడుపులో ఆ భగవంతుడే ఉన్నాడు’’ అంటూ దీపిక పాత్రను ఉద్దేశిస్తూ అమితాబ్‌ చెప్పే డైలాగ్‌తో మొదలైన ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఈ కథలో కీలకమైన కాశీ, కాంప్లెక్స్, శంభల అనే మూడు ప్రపంచాల్ని ట్రైలర్‌లో ఆకట్టుకునేలా చూపించారు. భైరవగా ప్రభాస్‌ కనిపించిన తీరు.. అమితాబ్‌కు ఆయనకు మధ్య వచ్చిన పోరాటాలు కనులవిందుగా ఉన్నాయి. ‘‘ఎన్ని యుగాలైనా.. ఎన్ని అవకాశాలిచ్చినా మనిషి మారడు.. మారలేడు’’ అంటూ కమల్‌ చెప్పిన డైలాగ్‌.. విభిన్నమైన లుక్‌తో తను కనిపించిన తీరు ఆసక్తి రేకెత్తించేలా ఉన్నాయి. ‘‘ఇంత వరకు ఒక్క ఫైట్‌ కూడా ఓడిపోలేదు. ఇది కూడా ఓడిపోను. ఈసారి ప్రిపేరై వచ్చాను. దా’’ అంటూ ఆఖర్లో ఓ భారీ యంత్రంతో ప్రభాస్‌ ఎంట్రీ ఇచ్చిన తీరు ట్రైలర్‌కు ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమాకి సంతోష్‌ నారాయణన్‌ సంగీతమందించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని