Prabhas: నువ్వలా చేస్తే.. అమితాబ్‌ నేనూ చేస్తానన్నారు: ప్రభాస్‌

ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ముంబయిలో జరిగింది.

Published : 20 Jun 2024 00:12 IST

ముంబయి: అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan)ను తొలిసారి చూడగానే పాదాలు తాకి, ఆశీస్సులు తీసుకునేందుకు ప్రయత్నించగా ఆయన అలా చేయొద్దన్నారని ప్రభాస్‌ (Prabhas) పేర్కొన్నారు. ‘నువ్వు ఆపకపోతే నేనూ నీ పాదాలు తాకుతా’ అని అన్నారని గుర్తుచేసుకున్నారు. ముంబయిలో బుధవారం సాయంత్రం నిర్వహించిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో మాట్లాడారు. ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో అమితాబ్‌, కమల్‌ హాసన్‌ (Kamal Haasan), దీపికా పదుకొణె (Deepika Padukone), దిశా పటానీ (Disha Patani), రాజేంద్ర ప్రసాద్‌, శోభన కీలక పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. మూవీ ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన వేడుకకు హీరో రానా (Rana Daggubati) హోస్ట్‌గా వ్యవహరించారు. ఆయన అడిగిన ప్రశ్నలకు ‘కల్కి’ టీమ్‌ ఇచ్చిన సమాధాలేంటంటే?

* ఈ కథ గురించి నాగ్‌ అశ్విన్‌ చెప్పినప్పుడు మీ స్పందనేంటి?

అమితాబ్‌ బచ్చన్‌: అశ్విన్‌ ఈ సినిమా ఐడియా చెప్పగానే అద్భుతమనిపించింది. ఇలాంటి ఆలోచనల కోసం ఆయనేం తాగుతున్నాడో అని అనుకున్నా. విజన్‌ ఉన్న దర్శకుడాయన. పేపర్‌పై ఏం రాసుకున్నాడో దాన్ని అదే స్థాయిలో తెరపైకి తీసుకొచ్చేందుకు చాలా శ్రమించాడు. ఈ మూవీ షూటింగ్‌ జ్ఞాపకాలను ఎప్పటికీ మర్చిపోలేను.

* ఇతిహాసాలతో కూడిన సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రమిది. పైగా దర్శకుడికి పెద్ద అనుభవం లేదు. మీరెలా అంగీకరించారు?

కమల్‌ హాసన్‌: సాధారణంగా కనిపించే వ్యక్తులు అసాధారణ పనులు చేస్తుంటారు. నాగ్‌ అశ్విన్‌తో కాసేపు మాట్లాడగానే తన టాలెంట్‌ అర్థమైంది. నేను ఈ మూవీలో బ్యాడ్‌మ్యాన్‌గా కనిపిస్తా.

* ఈ సినిమాలోని మీ లుక్‌ గురించి చెప్పండి?

కమల్‌ హాసన్‌: నా లుక్‌ విభిన్నంగా ఉండాలని ముందే నిర్ణయించుకున్నాం. ఆ సమయానికి ఈ చిత్రానికి సంబంధించిన ఏ విజువల్స్‌నూ నేను చూడలేదు. కొత్త గెటప్‌ కోసం కొంత రీసెర్చ్‌ చేసి వస్తే.. ఆ లుక్‌లోనే అమితాబ్‌ నటిస్తున్నారని తెలిసింది (నవ్వుతూ). మరో గెటప్‌తో వస్తే.. ప్రభాస్‌ ఇలానే కనిపించనున్నారని సమాధానం ఇచ్చారు (నవ్వులు). చివరకు ఓ లుక్‌ సెట్‌ అయింది. వెండితెరపై దాన్ని చూసిన ప్రేక్షకులు ఎలా స్పందిస్తారోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.

* ఈ అగ్ర నటులతో కలిసి నటించడం ఎలా అనిపించింది?

ప్రభాస్‌: ఈ ఇద్దరు లెజెండ్స్‌తో కలిసి నటించే అవకాశం ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌, అశ్వనీదత్‌లకు థ్యాంక్స్‌. వీరితో తెర పంచుకోవాలనేది నా కల. అమితాబ్‌ సర్‌ సెట్స్‌లోకి రాగానే ఆయన పాదాల్ని తాకబోతుంటే.. ‘దయచేసి ఇలా చేయకు. నువ్వు నా పాదాలు తాకితే నేనూ నీ పాదాలు తాకుతా’’ అని అన్నారు. అప్పట్లోనే దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న నటుడు అమితాబ్‌. పొడుగు వారందరినీ ఆయనతో పోల్చేవారు (నవ్వుతూ). కమల్‌ సర్‌ ‘సాగర సంగమం’ సినిమా చూసి, అందులో ఆయన ధరించిన దుస్తులు కావాలని అమ్మను అడిగా. ‘ఇంద్రుడు చంద్రుడు’లోని ఆయన నటనకు ఫిదా అయ్యా. దీపికా పదుకొణె.. గొప్ప నటి, సూపర్‌స్టార్‌.

* మీ పాత్ర గురించి చెబుతారా?

దీపికా: లాక్‌డౌన్‌లో నాగ్‌ అశ్విన్‌ ‘జూమ్‌’ ద్వారా నాకు స్క్రిప్టు వినిపించారు. ఆయన చెప్పిన విధానం నన్ను బాగా ఆకట్టుకుంది. తక్కువ సమయంలోనే ఆయన ప్రతిభ ఎలాంటిదో అర్థమైంది. నేను ఈ చిత్రంలో తల్లిగా నటించా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని