Aswini Dutt: ‘కల్కి’తో నా కోరిక నెరవేరింది

‘‘దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఊహాశక్తి... అగ్ర తారలు ప్రభాస్, అమితాబ్‌ బచ్చన్, కమల్‌హాసన్, దీపికలపై ఉన్న నమ్మకమే ‘కల్కి 2898 ఎ.డి’  చేయగలిగే ధైర్యాన్నిచ్చింది’’ అన్నారు సి.అశ్వనీదత్‌.

Published : 30 Jun 2024 01:52 IST

‘‘దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఊహాశక్తి... అగ్ర తారలు ప్రభాస్, అమితాబ్‌ బచ్చన్, కమల్‌హాసన్, దీపికలపై ఉన్న నమ్మకమే ‘కల్కి 2898 ఎ.డి’  చేయగలిగే ధైర్యాన్నిచ్చింది’’ అన్నారు సి.అశ్వనీదత్‌. వైజయంతీ మూవీస్‌ పతాకంపై యాభయ్యేళ్లుగా సినిమాలు తీస్తున్న అగ్ర నిర్మాత ఆయన. మరపురాని చిత్రాలెన్నో ఆయన సంస్థ నుంచి వచ్చాయి. ఆ జాబితాలో తాజాగా ‘కల్కి 2898 ఎ.డి’ చేరింది. ప్రభాస్‌ కథానాయకుడిగా... నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం దేశ,  విదేశాల్లో వసూళ్లతో హోరెత్తిస్తోంది. ఈ సందర్భంగా అశ్వనీదత్‌ శనివారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు.

‘‘నాకు పదవులపై ఆశ లేదు.  ఆంధ్రప్రదేశ్‌లో సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు తలో బాధ్యత అప్పజెబుతారు. మా వంతుగా కృషి చేస్తాం. గత ఐదేళ్లుగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు జగన్‌. ఎవరిని కలిసినా ‘ఇతను పోవాలి, చంద్రబాబు రావాలి’ అనేవాళ్లు. అందుకే ఎన్డీయే విజయం గురించి అంత నమ్మకంగా చెప్పా. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి, ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిపై ఎవ్వరికీ చింత అవసరం లేదు’’.

‘‘మా సంస్థ వైజయంతీ మూవీస్‌ యాభయ్యేళ్ల ప్రస్థానాన్ని దృష్టిలో ఉంచుకుని చేసిన సినిమా కాదు... ‘కల్కి 2898 ఎ.డి’. పురాణ పాత్రల్ని కలుపుతూ ఓ గొప్ప కథని తయారు చేశాడు నాగ్‌ అశ్విన్‌. ఆ ప్రయత్నమే ఈ సమయంలో ఈ సినిమా చేయడానికి కారణమైంది. తన విజన్‌కి హ్యాట్సాఫ్‌. ‘మహానటి’ తర్వాత నాగ్‌ అశ్విన్‌ ఎంత పెద్ద సినిమానైనా తీయగలడనే నమ్మకం కలిగింది. అప్పుడే మా అమ్మాయిలతో చెప్పాను. ఇకపైన తను ఎలాంటి కథ చెప్పినా సరే, కాదనకుండా ముందుకెళ్లమని చెప్పా. ఈ శతాబ్దంలో ఓ దర్శకుడు మా ఇంట్లోనే దొరికాడు. ఇన్నేళ్ల నా ప్రయాణానికి గుర్తుగా ఓ మంచి సినిమా చేయాలన్న నా కోరికతోపాటు... ఈ కథ విన్నాక అఖండ విజయం సాధిస్తుందన్న మా నమ్మకం నెరవేరింది. తొలి ఆట నుంచే తెలుగు రాష్ట్రాలు, ముంబయి, చెన్నై, బెంగళూరు... ఇలా అన్నిచోట్ల నుంచీ గొప్ప రిపోర్ట్స్‌ వచ్చాయి. రికార్డులనేవి వస్తూనే ఉంటాయి. కానీ ఈసారి రికార్డ్స్‌ ప్రత్యేకమైనవి.  వాటి గురించి ఆలోచించకుండా విజయాన్ని ఆస్వాదిస్తున్నాం. రూ.1400 కోట్లుపైనే వసూలు చేస్తుందని నా నమ్మకం. ఈ సినిమాకోసం రూ.600 కోట్లుపైనే ఖర్చు పెట్టాం. రజనీకాంత్‌ మొదలుకుని చాలా మంది సినీ ప్రముఖులు ఫోన్‌ చేసి నాగ్‌ అశ్విన్‌ టేకింగ్‌ని మెచ్చుకున్నారు’’. 

‘‘ముగ్గురు అమ్మాయిల్ని కన్న నేను గొప్ప అదృష్టవంతుడిని. మా అమ్మాయిలు సంస్థని మరో స్థాయికి తీసుకెళుతున్నారు. ఓ తండ్రిగా గర్వపడుతున్నా. నేను చిత్ర పరిశ్రమకి వచ్చి యాభయ్యేళ్లు దాటిపోయింది. తొలి సినిమా నుంచీ దర్శకుడి విజన్‌ని నమ్మి, వాళ్లకు ఏం కావాలో అది సమకూరుస్తూ ప్రయాణం చేయడమే నా శైలి. ఈ సినిమా విషయంలోనూ అదే చేశా. నాతో కలిసి పనిచేసిన హీరోలందరికీ ఈ విషయం తెలుసు. నా తొలి సినిమా నుంచీ ‘కల్కి’ వరకూ నాతో కలిసి ప్రయాణం చేసిన నటులు, సాంకేతిక నిపుణులకి రుణపడి ఉంటా.  కథా చర్చల సమయంలోనే ‘కల్కి’ని రెండు భాగాలుగా చేయాలనే ఆలోచన వచ్చింది. కమల్‌హాసన్‌ ఇందులో భాగం అయ్యాక రెండు భాగాలుగా చేయాల్సిందే అనే నిర్ణయానికొచ్చాం. సుప్రీం యాస్కిన్‌ పాత్రకి  కమల్‌హాసన్‌ని మినహా మిగతా తారలందరినీ ముందే అనుకుని వాళ్లని సంప్రదించాం. కమల్‌ ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చాక పరిధి మరింత పెరిగింది. ప్రభాస్‌ గొప్ప సహకారం అందించారు. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు సలహాలు సినిమాకు ఎంతగానో మేలు చేశాయి. రెండో భాగం చిత్రీకరణ ఇప్పటికే 60 శాతం పూర్తయింది. విడుదల ఎప్పుడనే విషయంపై ఇంకా నిర్ణయానికి రాలేదు’’.

‘‘సినిమా టికెట్‌ ధరలు పెంచుకునే వెసులుబాటు మంచి నిర్ణయమే. దీనివల్ల బ్లాక్‌ టికెటింగ్‌ తగ్గుతుంది. పరిశ్రమకు మేలు జరుగుతుంది. వారం రోజుల తర్వాత టికెట్‌ ధరలు మళ్లీ సాధారణమైపోతాయి కాబట్టి, అప్పుడు అందరూ చూస్తారు. మా సంస్థ నుంచి ‘కల్కి’ రెండో భాగం కాకుండా, రెండు సినిమాలొస్తాయి. శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ కథానాయకుడిగా ‘ఛాంపియన్‌’ అనే సినిమాని తీస్తున్నాం. దుల్కర్‌ సల్మాన్‌ కథానాయకుడిగా మరో సినిమాని తీస్తున్నాం’’.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని