Deepika Padukone: ఆ తెలుగు చిత్రంలో నటించారు కానీ: దీపికా పదుకొణె గురించి మీకివి తెలుసా?

దీపికా పదుకొణె ఓ ప్రధాన పాత్ర పోషించిన ‘కల్కి 2898 ఏడీ’ గురువారం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆమె గురించి ప్రత్యేక కథనం..

Published : 25 Jun 2024 10:00 IST

‘కల్కి 2898 ఏడీ’తో తెలుగు ప్రేక్షకులను నేరుగా పలకరించబోతున్నారు నటి దీపికా పదుకొణె. కొన్నాళ్ల క్రితమే ఆమె టాలీవుడ్‌లో నటించారుగానీ ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు. ఈ సంగతులతోపాటు దీపికా గురించి మరికొన్ని విశేషాలు ‘కల్కి’ గురువారం రిలీజ్‌ కానున్న సందర్భంగా మీకోసం..

క్రీడాకారిణి అవుతారనుకుంటే..

ప్రముఖ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ ప్రకాశ్‌ పదుకొణె (Prakash Padukone) పెద్ద కుమార్తె దీపిక (Deepika Padukone). కోపెన్‌హాగ్‌ (డెన్మార్క్)లో పుట్టిన ఆమె బెంగళూరులో పెరిగారు. టీనేజ్‌లో.. బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్స్‌లో పాల్గొని, ప్రతిభ చూపారు. బేస్‌బాల్‌ టోర్నమెంట్స్‌లోనూ ఆడారు. దీంతో, తన కుమార్తె క్రీడాకారిణిగా స్థిరపడతారని ప్రకాశ్‌ కలలు కన్నారు. కానీ, సీన్‌ రివర్స్‌ అయింది. బాల్యంలోనే వాణిజ్య ప్రకటనల్లో నటించడంతో.. ఫ్యాషన్‌ మోడల్‌ కావాలని ఒకానొక సమయంలో నిర్ణయించుకున్నారు దీపిక. అలా.. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌తోనే చదువుకు ఫుల్‌స్టాప్‌ పెట్టేసి.. తన కలల ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ‘‘చదువును మధ్యలోనే ఆపేసి, మోడలింగ్‌ రంగాన్ని ఎంచుకోవడంతో.. అమ్మానాన్నను ఎంతమంది విమర్శించినా వారు నన్ను ఒక్కమాట కూడా అనలేదం’టూ తల్లీదండ్రుల గురించి ఓ సందర్భంలో గొప్పగా చెప్పారామె. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొన్నాళ్లకు దూరవిద్యలో డిగ్రీ పూర్తి చేశారు.

కన్నడ సినిమాతో తెరంగేట్రం..

మోడల్‌గా రాణించే సమయంలోనే ప్రముఖ కంపెనీల యాడ్స్‌లో నటించడంతోపాటు పలు ‘ఫ్యాషన్‌ వీక్స్‌’లో పాల్గొనేవారు. బికినీ ధరించి, కింగ్‌ ఫిషర్‌ క్యాలండర్‌కు పోజులివ్వడం అప్పట్లో హాట్‌ టాపిక్‌. సంగీత దర్శకుడు హిమేశ్‌ రేష్మియాతో కలిసి నటించిన ‘నామ్‌ హై తేరా’ మ్యూజిక్‌ వీడియో శ్రోతల్ని విశేషంగా అలరించింది. తన తండ్రి సిఫార్సు రంగుల ప్రపంచంలో ఉపయోగపడదని ముందుగానే గ్రహించిన దీపిక.. సొంత ప్రతిభతోనే అవకాశాలు సంపాదించుకున్నారు. ఉపేంద్ర హీరోగా తెరకెక్కిన కన్నడ చిత్రం ‘ఐశ్వర్య’ (2006)తో హీరోయిన్‌గా తెరంగేట్రం చేశారు. అది తెలుగు హిట్‌ మూవీ ‘మన్మథుడు’కు రీమేక్‌గా రూపొందింది. ఇక్కడ సోనాలీ బింద్రే పోషించిన పాత్రలో అక్కడ దీపిక నటించారు.

బాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌ వరకు..

దీపిక తొలి బాలీవుడ్‌ సినిమా ‘ఓం శాంతి ఓం’ ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. షారుక్‌ ఖాన్‌- దీపికలను ‘సూపర్‌ హిట్‌ జోడీ’ అని పిలవడం ఆ చిత్రంతోనే ఆరంభమైంది. చిత్ర పరిశ్రమ ఇతివృత్తంగా తెరకెక్కిన ఈ మూవీలో ఈ ఇద్దరూ ద్విపాత్రాభినయం చేశారు. ‘హీరోయిన్‌’ పాత్రలో ఒదిగిపోయేందుకు దీపిక పడిన శ్రమ వృథా పోలేదు. ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత, ఇదే కాంబినేషన్‌లో వచ్చిన ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’, ‘హ్యాపీ న్యూ ఇయర్‌’, ‘పఠాన్‌’ సైతం మంచి విజయాల్ని అందుకున్నాయి. ‘బాజీరావు మస్తానీ’, ‘పద్మావత్‌’ వంటి హిస్టారికల్‌ మూవీస్‌ ఆమెను బాలీవుడ్‌లో ప్రత్యేకంగా నిలిపాయి. యాసిడ్‌ దాడి బాధితురాలిగా నటించిన ‘ఛపాక్‌’ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. షారుక్‌, అమితాబ్ బచ్చన్‌, అక్షయ్‌ కుమార్‌ ఇలా అగ్ర నటుల సరసన నటించినా.. కథ నచ్చితే యంగ్‌ హీరోలతో ఆడిపాడేందుకూ ముందుంటానని ‘గెహ్రియాన్‌’తో చెప్పకనే చెప్పారు. ‘ధమ్‌ మారో ధమ్‌’, ‘బాంబే టాకీస్‌’లాంటి సినిమాల్లోని ప్రత్యేక గీతాలతోనూ ఉర్రూతలూగించారు. ఆంగ్ల చిత్రాలు ‘ఫైండింగ్‌ ఫానీ’, ‘త్రిబుల్‌ ఎక్స్‌: ది రిటర్న్‌ ఆఫ్‌ గ్జాండర్‌ కేజ్‌’లతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు.

ఇప్పుడు ‘కల్కి’తో..

యానిమేటెడ్‌ మూవీ ‘కొచ్చడయాన్‌’తో కోలీవుడ్‌కు పరిచయమయ్యారు. దర్శకుడు జయంత్‌ సి. పరాజ్జీ తెరకెక్కించిన ‘లవ్‌ 4 ఎవర్‌’తోనే టాలీవుడ్‌కు హాయ్‌ చెప్పాల్సి ఉన్నా.. అనివార్య కారణాల వల్ల అది విడుదల కాలేదు. అందులో దీపిక స్పెషల్‌ సాంగ్‌లో నటించారు. ఇన్నేళ్ల తర్వాత ‘కల్కి’తో అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రభాస్‌ (Prabhas) హీరోగా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) తెరకెక్కించిన ఈ సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ (Kalki 2898 AD) ఇది.

మానసిక కుంగుబాటు!

‘నేను కొన్నేళ్లుగా మానసిక కుంగుబాటుతో బాధపడుతున్నా..’ అని గతంలో ఓ ఇంటర్వ్యూలో దీపిక వెల్లడించడం చర్చనీయాంశమైంది. డిప్రెషన్‌ నుంచి బయటపడిన ఆమె తనలా ఎవరూ మానసిక రుగ్మతతో ఇబ్బంది పడకూడదని స్వచ్ఛంద సంస్థ ‘లివ్‌ లవ్‌ లాఫ్‌’ని ప్రారంభించారు. ఆమె చేసిన సేవకుగానూ 2020లో దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో ‘క్రిస్టల్‌’ అవార్డు అందజేశారు.

మరికొన్ని ఆసక్తికర సంగతులు..

  • మితభాషి. పార్టీలకు దూరంగా ఉంటారు. క్రమం తప్పకుండా యోగా చేస్తారు. నగలపై ఆసక్తి లేదు.
  • ఇంటీరియర్‌ డిజైనింగ్‌ నేర్చుకున్నారు. మహారాష్ట్రలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు.
  • 2023లో.. ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవంలో ప్రజెంటర్‌గా వ్యవహరించారు. ప్రియాంక చోప్రా తర్వాత ఆ ఘనత సాధించిన రెండో భారతీయ నటి ఈమే. కేన్స్‌ ఫిల్మ్‌ఫెస్టివల్‌ జ్యూరీ సభ్యురాలిగా, ఫిఫా వరల్డ్‌ కఫ్‌ ప్రజెంటర్‌గానూ వ్యవహరించారు.
  • 2022లో.. ప్రపంచంలోని ‘పది మంది అందమైన మహిళల్లో’ ఆమె ఒకరిగా నిలిచారు (‘ది గోల్డెన్‌ రేషియో ఆఫ్‌ బ్యూటీ ఫై’ జాబితా ప్రకారం).
  • 2021లో.. ఉత్తమ నటిగా ‘గ్లోబల్‌ అచీవర్స్‌’ పురస్కారం పొందారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచే వారికి ఈ అవార్డు ఇస్తారు.
  • 2013లో ‘మోస్ట్‌ డిజైరబుల్‌ విమెన్‌’గా నిలిచిన ఈ నటికి మహేశ్‌ బాబు అంటే అభిమానం. రానా క్లోజ్‌ ఫ్రెండ్‌. 
  • ‘రామ్‌ లీలా’, ‘బాజీరావు మస్తానీ’, ‘పద్మావత్‌’ చిత్రాల సహనటుడు రణ్‌వీర్‌ సింగ్‌ని వివాహం చేసుకున్నారు. త్వరలో తల్లికాబోతున్నారు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని