NTR: ఆ లోటు ఎప్పటికీ ఉంటుంది: ఎన్టీఆర్‌ గురించి ఈ సంగతులు తెలుసా?

ప్రముఖ నటుడు ఎన్టీఆర్‌ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికర సంగతులు..

Published : 20 May 2024 09:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎన్టీఆర్‌ (NTR).. సినీ అభిమానులకు పరిచయం అవసరంలేని పేరు. భారీ డైలాగ్స్‌, కళ్లు చెదిరే డ్యాన్స్‌.. ఇలా అన్ని అంశాల్లో ఆయన దారే వేరు. నేడు ఈ అగ్ర నటుడి పుట్టినరోజు సందర్భంగా.. ఆయన వ్యక్తిగత విషయాలతోపాటు వృత్తిపరమైన సంగతులు ఓసారి గుర్తుచేసుకుందాం..

  • ఎన్టీఆర్‌ అసలు పేరు తారక్‌ రామ్‌. ఒకరోజు హరికృష్ణ తనయుడిని తీసుకుని సీనియర్‌ ఎన్టీఆర్‌ దగ్గరకు వెళ్లగా, ఆయనే స్వయంగా తారక్‌ పేరును నందమూరి తారక రామారావుగా మార్చారు.
  • కుటుంబానికి అధిక ప్రాధాన్యతనిచ్చే ఆయన.. తన భార్య ప్రణతిని దేవుడిచ్చిన వరంగా భావిస్తారు. ఇద్దరూ అబ్బాయిలే పుట్టడంతో కుమార్తె లేదనే లోటు తనకెప్పటికీ ఉంటుందని ఓ సందర్భంలో తెలిపారు.
  • స్కూల్‌ ఫ్రెండ్స్‌ స్నేహల్‌, లవ్‌రాజ్‌ సహా సినీ నటుడు రాజీవ్‌ కనకాలతో ఇప్పటికీ అన్ని విషయాలు పంచుకుంటారట. హీరోలు రామ్‌ చరణ్‌, మహేశ్‌ బాబు, అల్లు అర్జున్‌తో క్లోజ్‌గా ఉంటారు.
  • సుమారు ఎనిమిదేళ్ల వయసులో తొలిసారి ముఖానికి మేకప్‌ వేసుకున్నారు. ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’లో భరతుడి పాత్రతో నటనలో ఓనమాలు నేర్చుకున్నారు. కొన్నాళ్ల తర్వాత ‘బాల రామాయణం’లో నటించారు.
  • కూచిపూడి నృత్యంలో శిక్షణ పొందారు. 12 ఏళ్ల సాధనలో దేశవ్యాప్తంగా వందకిపైగా ప్రదర్శనలిచ్చారు. 2001లో వచ్చిన ‘నిన్ను చూడాలని’తో హీరోగా పరిచయమయ్యారు.
  • 23 ఏళ్ల కెరీర్‌లో 29 చిత్రాల్లో నటించారు. ఉత్తమ నటుడిగా ‘నంది’సహా పలు అవార్డులు అందుకున్నారు. ప్రస్తుతం 30వ చిత్రం ‘దేవర’ (Devara)తో బిజీగా ఉన్నారు. హృతిక్‌ రోషన్‌తో కలిసి ‘వార్‌ 2’ (War 2)లో నటిస్తున్నారు. ‘కేజీయఫ్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో నటించనున్నారు.

  • జపాన్‌లో విశేష క్రేజ్‌ ఉన్న ఏకైక తెలుగు నటుడీయనే. ‘ఫోర్బ్స్‌ ఇండియా’ సెలబ్రిటీ లిస్ట్‌లో రెండు సార్లు చోటు సంపాదించుకున్నారు.
  • ఎన్టీఆర్‌ మంచి గాయకుడు. ‘ఓలమ్మీ తిక్కరేగిందా’, ‘వన్‌ టూ త్రీ నేనో కంత్రి’, ‘వేర్‌ ఈజ్‌ ది పంచకట్టు చారి’ తదితర పాటలతో అలరించారు. ఆయన గొప్ప వ్యాఖ్యాత కూడా. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’, ‘బిగ్‌బాస్‌ తెలుగు’ షోలకు హోస్ట్‌గా వ్యవహరించారు.
  • తారక్‌కి ‘9’ అంటే ఇష్టం. 9999.. తన కారు నంబరు ప్లేటుపైనే కాదు ట్విటర్‌ ఖాతాలోనూ కనిపిస్తుంది.
  • తన ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌ సాంగ్‌: ‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే’ (మాతృదేవోభవ), ఫేవరెట్‌ మూవీ: దాన వీర శూర కర్ణ.
  • మాస్‌ హీరో అనగానే డైలాగ్‌లు, పంచ్‌లు గుర్తొస్తాయి. కానీ, ఇంటర్వెల్‌ వరకూ ఎన్టీఆర్‌ మాట్లాడని సినిమా ‘నరసింహుడు’. ఇదొక రేర్‌ ఫీట్‌.
  • ఈయన నటించిన ‘ఆంధ్రావాలా’ ఆడియో విడుదల వేడుక రికార్డు నెలకొల్పింది. నిమ్మకూరులో జరిగిన ఆ ఈవెంట్‌కు రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయడం విశేషం. సుమారు 10 లక్షల మంది అభిమానులు పాల్గొన్నారు.
  • ‘సింహాద్రి’ చిత్రాన్ని ఆయన పుట్టినరోజు సందర్భంగా 1000 స్క్రీన్లలో గతేడాది రీ రిలీజ్‌ చేశారు. అన్ని స్క్రీన్లలో సినిమా రీ రిలీజ్‌ కావడం ఓ రికార్డు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని