Vijay Antony: బాధతో జీవించడం అలవాటు చేసుకున్నా: విజయ్‌ ఆంటోనీ

తాను ఎన్నో కోల్పోయానని, బాధతో జీవించడం అలవాటు చేసుకున్నానని నటుడు విజయ్‌ ఆంటోనీ అన్నారు. పెద్ద కుమార్తె మరణానంతరం మీడియా ముందు ఆయన మాట్లాడారు.

Published : 29 Sep 2023 21:57 IST

చెన్నై: కుమార్తె మరణానంతరం మొదటిసారి మీడియా ముందుకు వచ్చారు నటుడు విజయ్‌ ఆంటోనీ (Vijay Antony). తన తదుపరి చిత్రం ‘రత్తం’ (Ratham) ప్రమోషన్స్‌లో భాగంగా గురువారం సాయంత్రం నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ప్రెస్‌మీట్‌లో ఆయన పాల్గొన్నారు. చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమంలో చిన్న కుమార్తెతో కలిసి పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తాను జీవితంలో ఇప్పటికే ఎన్నో కోల్పోయానని అన్నారు. ‘‘జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. నేను జీవితంలో ఇప్పటికే ఎన్నో కోల్పోయా. బాధతో జీవించడం అలవాటు చేసుకున్నా. బాధల నుంచే నేను ఎంతో నేర్చుకున్నా’’ అని ఆయన చెప్పారు.

రివ్యూ: కుమారి శ్రీమతి.. నిత్యామేనన్‌ వెబ్‌సిరీస్‌ ఎలా ఉంది?

విజయ్‌ ఆంటోనీ పెద్ద కుమార్తె ఈ నెల 19న ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. 16 ఏళ్లకే ఆమె బలవన్మరణానికి పాల్పడటం అందరినీ కలచి వేసింది. ఇకపై తాను చేసే ప్రతి సేవా కార్యక్రమాన్ని ఆమె పేరుతోనే ప్రారంభిస్తానని విజయ్‌ ఇటీవల తెలిపారు. ‘‘నా పెద్ద కుమార్తె ఎంతో దయగలది. అంతకుమించి ధైర్యవంతురాలు. కులం, మతం, బాధ, అసూయ, పేదరికం, ద్వేషపూరిత వాతావరణం లేని ప్రశాంతమైన ప్రదేశంలోకి వెళ్లిపోయింది. ఆమె ఇప్పటికీ నాతోనే మాట్లాడుతోంది. తనతో పాటే నేనూ చనిపోయాను’’ అని ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు.

‘రత్తం’ సినిమా విషయానికొస్తే.. మీడియా, న్యాయవ్యవస్థల మధ్య ఉన్న బంధం ప్రజలను ఏ విధంగా ప్రభావితం చేస్తుందనేది ఈ చిత్రంలో చూపించనున్నారు. ఇందులో పరిశోధక అధికారిగా, భిన్న కోణాలున్న వ్యక్తిగా విజయ్‌ కనిపించనున్నారు. హీరోయిన్‌ నందితా శ్వేత జర్నలిస్ట్‌గా నటించారు. అక్టోబరు 6న సినిమా విడుదల కానుంది. ‘బిచ్చగాడు’ సినిమాతో విజయ్‌ ఆంటోనీ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. దానికి సీక్వెల్‌గా రూపొందిన ‘బిచ్చగాడు 2’ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని