Kalki 2898 AD: ‘కల్కి’ ఆ రికార్డు జస్ట్‌ మిస్‌.. ఫస్ట్‌ డే రూ.100 కోట్లపైన వసూలు చేసిన చిత్రాలివే!

Kalki 2898 AD: ప్రభాస్‌ కల్కి మూవీ తొలిరోజు రికార్డు వసూళ్లు సాధించి బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది.

Updated : 29 Jun 2024 17:38 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రస్తుతం బాక్సాఫీస్‌ వద్ద ప్రభాస్‌ (Prabhas) ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) దూసుకుపోతోంది. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ మైథలాజికల్‌ సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ తొలిరోజు రూ.191.5కోట్లు వసూలు చేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది. గత కొన్నేళ్లుగా పాన్‌ ఇండియా ట్రెండ్‌ నడుస్తున్న నేపథ్యంలో కొన్ని చిత్రాలు విడుదలైన మొదటిరోజు రూ.100 కోట్ల కలెక్షన్లను సునాయాసంగా (Highest Opening Day Grossers In Indian Cinema) రాబట్టాయి. ఇప్పుడు ఆ మూవీల జాబితాలో ‘కల్కి’ కూడా వచ్చి చేరింది. రూ.100 కోట్ల రికార్డును సాధించిన 11వ చిత్రంగా ‘కల్కి’ నిలిచింది. ఇందులో ప్రభాస్‌ నటించినవే ఐదు ఉండటం గమనార్హం.

తొలిరోజు రూ.100 కోట్లు పైన వసూలు చేసిన చిత్రాల జాబితాలో మొదటి స్థానంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ల ‘RRR’ ఉంది. అగ్ర దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఫస్ట్‌డే ఈ మూవీ రూ.223 కోట్లు (గ్రాస్‌) వసూలు చేసింది. దీని తర్వాత ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ ఉంది. ఇది రూ.217 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేశాయి. ఇప్పుడు మూడో స్థానంలో ‘కల్కి 2898 ఏడీ’ ఉంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.191.5 కోట్లు వసూలు చేసింది.

వీటి తర్వాత స్థానాల్లో ‘కేజీయఫ్‌2’ (రూ.159 కోట్లు), సలార్‌: పార్ట్‌1 -సీజ్‌ఫైర్‌ (రూ.158 కోట్లు), లియో (రూ.142.75 కోట్లు), సాహో (రూ.130 కోట్లు), జవాన్‌ (రూ.129 కోట్లు), ఆది పురుష్‌ (రూ.127.50 కోట్లు), యానిమల్‌ (రూ.116 కోట్లు), పఠాన్‌ (రూ.105 కోట్లు) చిత్రాలు ఉన్నాయి.

ఓటీటీలో అదనపు సన్నివేశాలు జోడిస్తారా?

తాజాగా విడుదలైన ‘కల్కి 2898 ఏడీ’ రన్‌ టైమ్‌ 3 గంటలపైనే ఉంది. అక్కడక్కడా సినిమాకు ఇంకాస్త కత్తెర వేసి ఉంటే బాగుండేదని కొందరు సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. కానీ, దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఫైనల్‌ కట్‌ వెర్షన్‌ 3 గంటలా 20 నిమిషాలు ఉందట. అంత నిడివి ఉంటే సినిమాపై ప్రభావం చూపుతుందని భావించిన చిత్ర బృందం పలు చర్చల అనంతరం 3 గంటలకు కుదిరించారట. ప్రభాస్‌ కాంప్లెక్స్‌లోకి వెళ్లిన సన్నివేశాలు, బ్రహ్మానందంతో ఇంకొన్ని కామెడీ సీన్స్‌, దుల్కర్‌ సల్మాన్‌తో మరికొన్ని సన్నివేశాలు కట్‌ చేసిన దానిలో ఉన్నాయట. సినిమా థియేట్రికల్‌ రన్‌ పూర్తయిన తర్వాత ఓటీటీలో ఆయా సన్నివేశాలు జోడించి స్ట్రీమింగ్‌ తెచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు ‘కల్కి’ చూసి వచ్చిన వారందరూ పార్ట్‌-2 ఎప్పుడంటూ సామాజిక మాధ్యమాల వేదికగా చర్చ పెట్టారు. ప్రస్తుతం విజయోత్సాహంలో ఉన్న చిత్ర బృందం కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని తదుపరి భాగానికి సంబంధించిన పనులను మొదలు పెట్టే అవకాశం ఉందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని