Hidimba movie review: రివ్యూ: హిడింబ.. అశ్విన్‌, నందితా శ్వేతల సినిమా ఎలా ఉంది?

Hidimba movie review: అశ్విన్‌, నందితా శ్వేతల సినిమా ఎలా ఉంది?

Updated : 20 Jul 2023 08:04 IST

Hidimba movie review; చిత్రం:  హిడింబ‌, న‌టీన‌టులు: అశ్విన్ బాబు, నందితా శ్వేత, శ్రీనివాస రెడ్డి, సాహితీ అవంచ, సంజయ్ స్వరూప్, శిజ్జు, విద్యులేఖ రామన్, రాజీవ్ కనకాల, శుభలేఖ సుధాకర్, ప్రమోధిని, రఘు కుంచె, రాజీవ్ పిళ్లై, దీప్తి నల్లమోతు, సంగీతం:  వికాస్ బాడిస‌, ఛాయాగ్ర‌హ‌ణం:  బి.రాజ‌శేఖ‌ర్‌, ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: అనిల్ క‌న్నెగంటి, నిర్మాత‌:  గంగప‌ట్నం శ్రీధ‌ర్‌, స‌మ‌ర్ప‌ణ‌:  అనిల్ సుంక‌ర‌, విడుద‌ల తేదీ:  20-07-2023

ప్ర‌స్తుతం తెలుగు చిత్ర‌సీమ‌లో చిన్న‌, మీడియం రేంజ్ సినిమాల సంద‌డి ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే ఈ వారం దాదాపు అర‌డ‌జ‌నుకు పైగా చిత్రాలు బాక్సాఫీస్ ముందుకు వ‌రుస క‌ట్టాయి. వాటిలో ‘హిడింబ’ (Hidimba movie review) ఒక‌టి.  అశ్విన్‌బాబు హీరోగా అనిల్ క‌న్నెగంటి తెర‌కెక్కించిన సినిమా ఇది. టీజ‌ర్,  ట్రైల‌ర్లు ఆస‌క్తిరేకెత్తించేలా ఉండ‌టం.. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ వంటి పెద్ద నిర్మాణ సంస్థ దీన్ని స‌మ‌ర్పిస్తుండ‌టం.. ప్రేక్ష‌కుల దృష్టి ఈ చిత్రంపై ప‌డింది. మ‌రి ఈ ‘హిడింబ’ క‌థేంటి?ప్రేక్ష‌కుల‌కు ఎలాంటి అనుభూతి పంచింది?

క‌థేంటంటే: అభ‌య్ (అశ్విన్‌బాబు), ఆద్య (నందితా శ్వేత‌) పోలీస్ శిక్ష‌ణ‌లో ఉండ‌గా ప్రేమించుకుంటారు. కానీ, కొన్ని కార‌ణాల వ‌ల్ల ఇద్ద‌రూ విడిపోతారు. ఆ త‌ర్వాత ఆద్య ఐపీఎస్ ఆఫీస‌ర్ అవుతుంది. అభ‌య్ మాత్రం హైదరాబాద్‌లో పోలీస్‌ అధికారిగా పనిచేస్తుంటాడు. అయితే వీళ్లిద్ద‌రూ ఓ కేసు విష‌య‌మై మ‌ళ్లీ క‌లిసి ప‌ని చేయాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డుతుంది. న‌గ‌రంలో జ‌రుగుతున్న అమ్మాయిల సీరియ‌ల్ కిడ్నాప్‌ల‌కు సంబంధించిన కేస‌ది. దీన్ని ఇన్వెస్టిగేట్ చేసే క్ర‌మంలో కాలా బండ‌లోని బోయ అనే క‌రుడుగ‌ట్టిన ముఠాను ప‌ట్టుకుంటారు. వాళ్ల చెర‌లో ఉన్న అమ్మాయిలంద‌రినీ విడిపిస్తారు. ఈ కేసు ఇక ముగిసిన‌ట్లే అనుకుంటున్న త‌రుణంలో న‌గ‌రంలో మ‌ళ్లీ మ‌రో అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. దీంతో కేసు మళ్లీ మొద‌టికొస్తుంది. బోయ పోలీస్ క‌స్ట‌డీలోనే ఉండ‌గా.. ఈ కిడ్నాప్ ఎలా సాధ్య‌మైంద‌ని ఆలోచిస్తున్న‌ప్పుడు అంత‌కు ముందు క‌నిపించ‌కుండా పోయిన అమ్మాయిలు ఇత‌ని చెర నుంచి విడిపించిన యువ‌తులు వేర‌ని తెలుస్తుంది. అదే స‌మ‌యంలో అస‌లు నేర‌స్థుడు రెడ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిల్నే ల‌క్ష్యం చేసుకుంటున్న‌ట్లు ఆద్య క‌నిపెడుతుంది. దీంతో అత‌న్ని ప‌ట్టుకునేందుకు ఓ సీక్రెట్ ఆప‌రేష‌న్ చేప‌ట్ట‌గా అది ఫెయిల‌వుతుంది. ఈ క్ర‌మంలోనే డిపార్ట్‌మెంట్‌కు చెందిన అమ్మాయే కిడ్నాప్ అవుతుంది. మ‌రి ఈ కేసును ఆద్య‌, అభ‌య్ ఎలా ఛేదించారు? అస‌లు ఈ కిడ్నాప్‌లు చేస్తున్న నేర‌స్థుడెవ‌రు? అత‌ను రెడ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిల్నే ల‌క్ష్యం చేసుకోవ‌డానికి కార‌ణ‌మేంటి? వాళ్ల‌ను అత‌నేం చేస్తున్నాడు? ఈ క‌థ‌కు అండ‌మాన్ దీవుల్లో ఉన్న ఓ ఆదిమ తెగ‌కు ఉన్న సంబంధం ఏంటి? అన్న‌ది తెర‌పై చూసి తెలుసుకోవాలి.

ఎలా సాగిందంటే: చ‌రిత్ర‌తో ముడిప‌డి ఉన్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ ఇది. క‌థా నేప‌థ్యం కొత్త‌గానే ఉంటుంది. అయితే ఈ క‌థ‌ను దర్శ‌కుడు నాన్ లీనియ‌ర్ ప‌ద్ధ‌తిలో చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు. అంటే ఓ సీన్ వ‌ర్త‌మానంలో న‌డుస్తుంటే.. మ‌రో సీన్ గ‌తంలో సాగుతుంటుంది. (Hidimba movie review) ప్రేక్ష‌కుల్ని థ్రిల్ చేసేందుకు ద‌ర్శ‌కుడు ఎంచుకున్న మార్గ‌మిది. నిజానికి ఏ క‌థను ఎలా చెప్పినా.. అంతిమంగా అది ప్రేక్ష‌కుల్ని క‌థ‌తో తీసుకెళ్ల‌గ‌లిగేలా ఉండాలి కానీ, గంద‌ర‌గోళానికి గురి చేసేలా ఉండ‌కూడ‌దు. కానీ, ఎడిట‌ర్ త‌ప్పిద‌మో.. ద‌ర్శ‌కుడు టేకింగ్ లోప‌మో తెలియ‌దు గానీ ఈ చిత్ర విష‌యంలో ఆ పొర‌పాటే జ‌రిగింది. టైటిల్స్ కార్డ్స్‌తోనే ద‌ర్శ‌కుడు నేరుగా క‌థ‌లోకి తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేశాడు. న‌గ‌రంలో అమ్మాయిలు వ‌రుస‌గా కిడ్నాప్ అవ్వ‌డం.. ఆ కేసును ఛేదించేందుకు పోలీస్ డిపార్ట్‌మెంట్ ఆద్య‌ను రంగంలోకి దింప‌డం.. ఇలా చ‌క‌చ‌కా క‌థ ప‌రుగులు తీస్తుంది. కానీ, కేసు ఇన్వెస్టిగేష‌న్ ఆరంభ‌మైన‌ప్ప‌టి నుంచి సినిమా ఒక్క‌సారిగా రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాలా మారిపోతుంది. (Hidimba movie review) పెద్ద‌గా క‌ష్ట‌ప‌డ‌కుండానే కేసుకు సంబంధించిన క్లూలు తెలిసిపోతుంటాయి. ఇది ప్రేక్ష‌కుల‌కు అంత‌గా రుచించ‌దు. మ‌ధ్య‌లో ఓ పాట‌తో నాయ‌కానాయిక‌ల ప్రేమ‌క‌థ‌ను చూపించే ప్ర‌య‌త్నం చేశారు ద‌ర్శ‌కుడు. దాంట్లో పెద్ద‌గా ఫీల్ క‌నిపించ‌దు.

ఇక కాలాబండా ముఠా నేప‌థ్యంలో అల్లుకున్న ఎపిసోడ్ మాత్రం ఆస‌క్తిరేకెత్తిస్తుంది. ఈ సంద‌ర్భంగా బోయ గ్యాంగ్‌కు అశ్విన్‌కు మ‌ధ్య వ‌చ్చే ఫైట్ సీక్వెన్స్ ఆక‌ట్టుకుంటుంది. అస‌లు నేర‌స్థుడ్ని ప‌ట్టుకునేందుకు ఆద్య చేసే ఆప‌రేష‌న్ రెడ్ ఎపిసోడ్‌ మ‌రీ సాగ‌తీత వ్య‌వ‌హారంలా అనిపిస్తుంది. (Hidimba movie review) విరామ స‌న్నివేశాలు థ్రిల్ చేయ‌డంతో పాటు ద్వితీయార్ధంపై ఆస‌క్తి క‌లిగించేలా చేస్తాయి. అక్క‌డి నుంచే సినిమాలో అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది.  ఈ కిడ్నాప్‌ల‌కు అండ‌మాన్ దీవుల్లో ఉన్న ఓ ఆదిమ జాతికి ముడిపెట్టిన తీరు బాగుంది. ఆ ఆదిమ జాతికి సంబంధించిన ఎపిసోడ్ మొత్తం థ్రిల్లింగ్‌గానే ఉంటుంది. (Hidimba movie review) అలాగే కేర‌ళ నేప‌థ్యంలో సాగే ఇన్వెస్టిగేష‌న్ ఎపిసోడ్ ఫ‌ర్వాలేద‌నిపిస్తుంది. ప్రీక్లైమాక్స్‌లో వ‌చ్చే ట్విస్ట్ మాత్రం సర్‌ప్రైజ్‌. హీరోలోని మ‌రో కోణాన్ని ఆవిష్క‌రించే ఎపిసోడ్ అది. ప‌తాక స‌న్నివేశాలు ఊహ‌ల‌కు అంద‌ని రీతిలో ఉన్నా.. ముగింపు సంతృప్తిక‌రంగా అనిపించ‌దు.

ఎవ‌రెలా చేశారంటే: న‌టుడిగా అశ్విన్‌ను మ‌రో మెట్టు పైకి ఎక్కించే చిత్ర‌మిది. ఈ సినిమా కోసం ఆయ‌న మేకోవ‌ర్ అయిన తీరు ఆక‌ట్టుకుంటుంది. యాక్ష‌న్ ఎపిసోడ్స్‌లోనూ.. ప‌తాక స‌న్నివేశాల్లోనూ ఆయ‌న న‌ట‌న మ‌రో స్థాయిలో ఉంటుంది. హీరోకి దీటైన పాత్ర‌లో నందితా న‌టించింది. ప్ర‌థ‌మార్థంలో ఓ పాట‌లో రొమాంటిక్ లుక్స్‌తో ఆక‌ట్టుకుంటుంది. ప‌తాక స‌న్నివేశాల్లో అశ్విన్‌తో పోటీప‌డి న‌టించింది. మ‌క‌రంద్ దేశ్ పాండే పాత్ర స‌ర్‌ప్రైజింగ్‌గా అనిపిస్తుంది. ఆ పాత్ర‌ను ద‌ర్శ‌కుడు ఆక‌ట్టుకునేలా తీర్చిదిద్దాడు.  ర‌ఘు కుంచె, సంజ‌య్ స్వ‌రూప్‌, షిజ్జు, శ్రీనివాస్ రెడ్డి, రాజీవ్ పిళ్లై త‌దిత‌రుల పాత్ర‌లు ప‌రిధి మేర‌కు ఉంటాయి.(Hidimba movie review)  ద‌ర్శ‌కుడు ఎంచుకున్న క‌థ‌లో కొత్త‌ద‌నమున్నా.. దాన్ని ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా తెర‌పై చూపించ‌డంలో త‌డ‌బ‌డ్డాడు. సినిమాలో కొన్ని ఎపిసోడ్స్ ఆక‌ట్టుకునేలా ఉన్నా.. మొత్తంగా చూసిన‌ప్పుడు దీంట్లో ఏదో వెలితి క‌నిపిస్తుంది. చాలా స‌న్నివేశాలు లాజిక్కు దూరంగా ఉన్నాయి. ప్ర‌ధ‌మార్ధంలో మాన‌వ అవ‌య‌వాల అక్ర‌మ ర‌వాణా ఎపిసోడ్‌ను ట‌చ్ చేశారు. దానికి ముగింపు ఇవ్వ‌లేదు. ఈ చిత్రానికి నేప‌థ్య సంగీతం, ఛాయాగ్ర‌హ‌ణం ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తాయి. నిర్మాణ విలువ‌లు ఉన్న‌తంగా ఉన్నాయి.

  • బ‌లాలు
  • + క‌థా నేప‌థ్యం
  • + ద్వితీయార్ధంలోని ట్విస్ట్‌లు
  • + పోరాట ఘ‌ట్టాలు, నేప‌థ్య సంగీతం
  • బ‌ల‌హీన‌త‌లు
  • - స్క్రీన్‌ప్లే
  • - పాట‌లు, ల‌వ్ ట్రాక్‌
  • చివ‌రిగా: అక్క‌డ‌క్క‌డా మెప్పించే ‘హిడింబ’
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని