Hatya movie review: రివ్యూ: హత్య.. డిటెక్టివ్‌గా విజయ్‌ ఆంటోనీ మెప్పించాడా?

Hatya movie review: విజయ్‌ ఆంటోనీ, రితికా సింగ్‌ కీలక పాత్రల్లో నటించిన ఇన్వెస్టిగేటివ్‌ మూవీ ‘హత్య’ ఎలా ఉందంటే?

Updated : 25 Jun 2024 16:12 IST

Hatya movie review; చిత్రం: హత్య; నటీనటులు: విజయ్‌ ఆంటోనీ, రితికా సింగ్‌, మీనాక్షి చౌదరి, రాధికా శరత్‌కుమార్‌, మురళీ శర్మ తదితరులు; సంగీతం: గిరీష్‌ గోపాలకృష్ణన్‌; సినిమాటోగ్రఫీ: శివకుమార్‌ విజయన్‌; ఎడిటింగ్‌: సెల్వా ఆర్కే; నిర్మాత: ఇన్ఫినిటీ ఫిల్మ్‌ వెంచర్స్‌, లోటస్‌ పిక్చర్స్‌; రచన, దర్శకత్వం: బాలాజీ కె కుమార్‌; విడుదల: 21-07-2023

వైవిధ్యభరితమైన కథలు ఎంచుకుంటూ అటు తమిళంలోనూ.. ఇటు తెలుగులోనూ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్‌ ఆంటోని. ఆయన ఇటీవల ‘బిచ్చగాడు2’తో విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ జోష్‌లోనే ‘హత్య’ అంటూ మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చారు. (Hatya movie review) బాలాజీ కె.కుమార్‌ తెరకెక్కించిన క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌ ఇది. ప్రచార చిత్రాలు ఆసక్తిరేకెత్తించేలా ఉండటంతో సినీప్రియుల్లో దీనిపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ ‘హత్య’ కథేంటి? దీని గుట్టు విజయ్‌ ఎలా విప్పారు? ఈ క్రమంలో ఆయనకు ఎదురైన సవాళ్లేంటి?

కథేంటంటే: లైలా (మీనాక్షి చౌదరి) ఫేమస్‌ మోడల్‌. హైదరాబాద్‌లోని తన ఫ్లాట్‌లో హత్యకు గురవుతుంది. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో ఆమెను ఎవరో ఊపిరి ఆడకుండా చేసి చంపినట్లు తేలుతుంది. ఆ కేసును కొత్తగా డ్యూటీలో చేరిన ఐపీఎస్‌ అధికారిణి సంధ్య (రితికా సింగ్‌)కు అప్పగిస్తారు. ఎలాంటి సాక్ష్యాధారాలు లేని ఆ కేసును పరిష్కరించేందుకు ఆమె డిటెక్టివ్‌ వినాయక్‌ (విజయ్‌ ఆంటోని) సహాయాన్ని కోరుతుంది. తొలుత ఆయన ఈ కేసు విషయంలో సహాయం చేసేందుకు నిరాకరించినా.. తర్వాత దాని బాధ్యతను తనే స్వయంగా భుజాలకు ఎత్తుకుంటారు. ఈ కేసు విచారించే క్రమంలో మీనాక్షి హత్యకు ఆమె బాయ్‌ ఫ్రెండ్‌ సతీష్‌ (సిద్ధార్థ్‌ శంకర్‌), ముంబయిలో ఉన్న మోడల్‌ కో-ఆర్డినేటర్‌ ఆదిత్య కౌశిక్‌ (మురళీ శర్మ), ఫ్యాషన్‌ ఫొటోగ్రాఫర్‌ అర్జున్‌ వాసుదేవ్‌ (అర్జున్‌ చిదంబరం), బబ్లూ (కిషోర్‌ కుమార్‌) అనే మరో వ్యక్తికి ఏదో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తారు. మరి ఈ నలుగురిలో లైలాను హత్య చేసిందెవరు? అసలు నేరస్థుల్ని వినాయక్, సంధ్య ఎలా కనిపెట్టారు? ఈ క్రమంలో వాళ్లకు ఎదురైన సవాళ్లేంటి?(Hatya movie review in telugu) అన్నది తెరపై చూసి తెలుసుకోవాలి.

ఎలా సాగిందంటే: నేర పరిశోధన నేపథ్యంలో సాగే కథ ఇది. ఇలాంటి కథలకు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్‌ ఉంటుంది. నేరం జరిగిన తీరు.. దాన్ని ఛేదించే విధానం.. ఈ క్రమంలో ఎదురయ్యే ట్విస్ట్‌లు, మలుపులు ఆద్యంతం ఉత్కంఠతకు గురిచేస్తూ ఓ కొత్త అనుభూతిని అందిస్తుంటాయి. అందుకే ఈ తరహా చిత్రాలకు ప్రేక్షకుల్లో ఓ తెలియని ఆసక్తి ఏర్పడుతుంటుంది. ఇక ఈ ‘హత్య’ కథ విషయానికొస్తే.. ఇదొక రెగ్యులర్‌ ఫార్మాట్‌లో సాగే సైకో థ్రిల్లర్‌. ఆరంభంలోనే మీనాక్షి హత్యకు గురవ్వడం.. ఆ కేసును సంధ్య టేకప్‌ చేయడం.. ఈ కేసు విషయమై సహాయం కోసం హీరో వద్దకు వెళ్లడం.. ఇలా చాలా రొటీన్‌గా సినిమా ప్రారంభమవుతుంది. నిజానికి ఇలాంటి థ్రిల్లర్‌లలో హీరో తెలివితేటల్ని ప్రేక్షకులకు రుచి చూపించేందుకు కొన్ని సన్నివేశాలైనా రాసుకుంటారు. (Hatya movie review) కానీ, ఇందులో అలాంటి ఎలివేషన్‌ షాట్లేమీ లేకుండానే అతనొక గొప్ప డిటెక్టివ్‌ అంటూ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌తోనే చెప్పించి నేరుగా కథలోకి తీసుకెళ్లిపోయారు. అయితే ఈ కథను కేవలం నేర పరిశోధనకే పరిమితం చేయకుండా.. హీరో కథకు కూతురు సెంటిమెంట్‌ను జోడించే ప్రయత్నం చేశారు. కానీ, అది ఏమాత్రం ఆసక్తికరంగా లేకపోగా మధ్య మధ్యలో కథకు స్పీడ్‌ బ్రేకర్‌లా అడ్డుతగులుతుంటుంది.

హీరో కేసు టేకప్‌ చేశాక కూడా కథలో ఎక్కడా వేగం కనిపించదు. విచారణ మొత్తం సీరియల్‌ తరహాలో నత్తనడకన సాగుతుంటుంది. ఈ కథల్లో చుట్టూ పాత్రలపై అనుమానం రేకెత్తించేలా చేయడం చాలా కీలకం. దీనికి తగ్గట్లుగానే మీనాక్షి ప్రేమికుడితో పాటు మిగిలిన మూడు ప్రధాన పాత్రలపై అనుమానపడేలా సీన్లు రాసుకున్న విధానం ఆసక్తికరంగా అనిపిస్తుంది. (Hatya movie review) కానీ, వీరి విచారణ మొదలైనప్పుడే అసలు నేరస్థుడెవరన్నది ప్రేక్షకులకు దాదాపుగా అర్థమైపోతుంది. విరామ సన్నివేశాలు చాలా సాదాసీదాగా ఉంటాయి. ద్వితీయార్ధంలో కూడా ఎక్కువ భాగం విచారణకే కేటాయించారు. నిజానికి ఈ కథలో హీరో తన తెలివితేటలు వాడి కేసును పరిష్కరిస్తున్నట్లుగా ఎక్కడా చూపించలేదు. కేవలం తన ఊహాశక్తితోనే ఈ హత్య ఇలా జరిగి ఉంటుందేమో అన్నట్లుగా చూపించి వదిలేశారు. (Hatya movie review) అలాగే మీనాక్షి కథను ఆమె అంతరాత్మే చెబుతున్నట్లుగా చూపించారు. దాని వల్ల ఓ థ్రిల్లింగ్‌ సినిమా చూస్తున్నట్లు అనిపించదు. ప్రీక్లైమాక్స్‌లో హంతకుడ్ని కనిపెట్టే సన్నివేశాలు.. అతని జీవిత నేపథ్యం ఆసక్తిరేకెత్తిస్తాయి. అయితే అతను మీనాక్షిని చంపడానికి వెనకున్న కారణం అంత బలంగా అనిపించదు. ముగింపు మరీ థ్రిల్‌ చేయకున్నా.. ఫర్వాలేదనిపిస్తుంది.

ఎవరెలా చేశారంటే: విజయ్‌ ఆంటోని(Vijay Antony)లోని నటుడికి పరీక్ష పెట్టే పాత్ర కాదిది. కథకు తగ్గట్లుగా ఆయన ఆద్యంతం సీరియస్‌గా కనిపించారంతే. లుక్‌ పరంగా మాత్రం సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌ హెయిర్‌ స్టైల్‌తో కొత్తగా కనిపించారు. మోడల్‌గా మీనాక్షి అందంగా కనిపించింది. నటన పరంగా చూపించడానికి ఆమెకు పెద్ద ఆస్కారం దొరకలేదు. ఐపీఎస్‌ సంధ్య పాత్రలో రితికా సింగ్‌ (Ritika Singh) కూడా ఆద్యంతం సీరియస్‌ లుక్‌లో కనిపించింది. రాధికా శరత్‌ కుమార్‌ను సినిమాలో ఏదో విలనీ తరహా పాత్రలో చూపించారు. (Hatya movie review) కానీ, అసలు ఆ పాత్రను ఎందుకు పెట్టారో.. ఆఖర్లో ఏమైపోయిందో క్లారిటీ లేదు. జాన్‌ విజయ్, మురళీ శర్మ, సిద్ధార్థ్‌ శంకర్‌ తదితరుల పాత్రలు పరిధి మేరకు ఉంటాయి. దర్శకుడు ఈ కథను 1923లో జరిగిన ఓ యథార్థ సంఘటన ఆధారంగా రాసుకున్నట్లుగా చెప్పారు. నిజానికి ఈ కథలో ఆయన్ని ఆకర్షించిన కొత్త అంశం ఏంటో అసలు అర్థం కాదు. పెద్దగా ట్విస్ట్‌లు, టర్న్‌లు లేకుండా రొటీన్‌ స్క్రీన్‌ప్లేతో సినిమాని నడిపించారు. ముఖ్యంగా స్లో నేరేషన్‌ ప్రేక్షకుల సహనానికి చాలా పరీక్ష పెడుతుంది. ఈ చిత్రాన్ని కాస్తో కూస్తో కొత్తగా చూపించిన ఘనత ప్రొడక్షన్‌ డిజైనర్, సినిమాటోగ్రాఫర్‌లకే దక్కుతుంది. విభిన్నమైన కలర్‌ టోన్, ఫ్రేమింగ్‌లతో సినిమాపై ఆసక్తి కలిగించేలా చేశారు. నేపథ్య సంగీతం ఓకే అనిపిస్తుంది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్లుగా బాగున్నాయి.

  • బలాలు
  • + విజయ్‌ ఆంటోని నటన
  • + ద్వితీయార్ధంలో వచ్చే కొన్ని ట్విస్ట్‌లు
  • + ఆర్ట్‌ వర్క్, సినిమాటోగ్రఫీ
  • బలహీనతలు
  • - కొత్తదనం లేని కథ
  • - నెమ్మదిగా సాగే కథనం
  • చివరిగా: థ్రిల్‌ పంచని ‘హత్య’ (Hatya movie review)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని