Ghani: ‘గని’, ‘రామారావు’.. రెండు తేదీలు ఫిక్స్‌ చేశారు..!

కొవిడ్‌ కారణంగా చిత్ర పరిశ్రమలో కొత్త మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో అనే సందేహంతో చిత్ర బృందాలు తమ సినిమా విడుదలకు సంబంధించి రెండు తేదీలను ప్రకటిస్తున్నాయి.

Published : 01 Feb 2022 18:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొవిడ్‌ కారణంగా చిత్ర పరిశ్రమలో కొత్త మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ‘పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో’ అనే సందేహంతో చిత్ర బృందాలు తమ సినిమా విడుదలకు సంబంధించి రెండు తేదీలను ప్రకటిస్తున్నాయి. ఏదో ఒకరోజు రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలకావాల్సిన పలు భారీ బడ్జెట్‌ చిత్రాలు కొవిడ్‌ థర్డ్‌ వేవ్‌ దృష్ట్యా వాయిదా పడిన సంగతి తెలిసిందే. కొవిడ్‌ కాస్త తగ్గుముఖం పడుతుండటంతో పాన్‌ ఇండియా సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ని మార్చి 25న విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం ఇటీవల ప్రకటించింది. దాంతో ఇతర సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి.

వీటిల్లో కొన్ని చిత్ర బృందాలు ఒక్క తేదీనే ఖరారు చేయగా మరికొన్ని చిత్ర బృందాలు రెండు తేదీలను ఫిక్స్‌ చేసుకున్నాయి. అప్పటి పరిస్థితుల్ని బట్టి తాము అనుకున్న రెండు తేదీల్లో ఏదో ఒక రోజు చిత్రాన్ని విడుదల చేయనున్నాయి. బాక్సింగ్‌ నేపథ్యంలో వరుణ్‌తేజ్‌ నటించిన చిత్రం ‘గని’. కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 25/ మార్చి 4న ప్రేక్షకుల ముందుకురానుంది. శరత్‌ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న చిత్రం ‘రామారావు ఆన్‌ డ్యూటీ’. మార్చి 25/ ఏప్రిల్‌ 15న ఈ సినిమా విడుదలకానుంది. ఈ విషయాన్ని ఆయా చిత్ర బృందాలు సోషల్‌ మీడియా వేదికగా తెలియజేశాయి. పవన్‌ కల్యాణ్‌, రానా కలిసి నటించిన ‘భీమ్లానాయక్‌’ను ఫిబ్రవరి 25న కానీ ఏప్రిల్‌ 1న కానీ విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని