కథ విన్నప్పుడు అమ్మే గుర్తొచ్చేది

మనందరి కథతో ‘35 చిన్న కథ కాదు’ చిత్రం తెరకెక్కిందన్నారు రానా దగ్గుబాటి. ఆయన సమర్పణలో సృజన్‌ యరబోలు, సిద్ధార్థ్‌ రాళ్లపల్లి నిర్మిస్తున్న చిత్రమిది. నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్‌ ప్రధాన పాత్రల్లో నటించారు.

Published : 04 Jul 2024 01:24 IST

మనందరి కథతో ‘35 చిన్న కథ కాదు’ చిత్రం తెరకెక్కిందన్నారు రానా దగ్గుబాటి. ఆయన సమర్పణలో సృజన్‌ యరబోలు, సిద్ధార్థ్‌ రాళ్లపల్లి నిర్మిస్తున్న చిత్రమిది. నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. నందకిశోర్‌ ఈమని దర్శకుడు. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. బుధవారం హైదరాబాద్‌లో టీజర్‌ విడుదల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా  కథానాయకుడు రానా దగ్గుబాటి మాట్లాడుతూ ‘‘నేను స్కూల్‌లో ఉన్నప్పుడు 35 అనేది నాకొక పెద్ద పర్వతం. లెక్కల్లో 35 వచ్చుంటే నేను పదోతరగతి పాసయ్యేవాడిని. దర్శకుడు ఈ కథ చెప్పిన ప్రతిసారీ నాకు మా అమ్మ గుర్తొచ్చేది. చాలా మంది జీవితంలా ఉంటుందీ కథ. హృదయాన్ని కదిలించే ఇలాంటి కథలు సురేష్‌ ప్రొడక్షన్స్‌లో చేయాలనేది మా ఉద్దేశం’’ అన్నారు. ‘‘తెలుగు చిత్ర పరిశ్రమకి వచ్చాక నా మొదటి పరిచయం రానా దగ్గుబాటి. ప్రతి నటుడికీ, సాంకేతిక నిపుణుడికీ తను సహకారం అందిస్తాడు. నా జీవితంలో చాలా ప్రత్యేకమైన సినిమా ఇది. అమ్మని చూస్తూ పెరిగాను కానీ, అమ్మలా నటించడం సవాల్‌గా అనిపించింది. టీజర్‌తో మా కథా ప్రపంచాన్ని పరిచయం చేశాం’’ అన్నారు నివేదా. ‘‘నా కెరీర్‌లో ఓ మైలురాయి ఈ సినిమా. ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని పంచుతుంది. ప్రతి ఒక్కరూ చూసి గర్వపడేలా ఉంటుంది’’ అన్నారు సృజన్‌ యరబోలు. ఈ కార్యక్రమంలో చిత్రబృందం పాల్గొంది. 


ఆపరేషన్‌ రావణ్‌ విడుదల ఖరారు 

రక్షిత్‌ అట్లూరి కథానాయకుడిగా రూపొందుతున్న ‘ఆపరేషన్‌ రావణ్‌’ విడుదల ఖరారైంది. ఆగస్టు 2న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. వెంకట సత్య దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న చిత్రమిది. సంకీర్తన విపిన్‌ కథానాయిక. రాధికా శరత్‌కుమార్‌ కీలక పాత్ర పోషించారు. ధ్యాన్‌ అట్లూరి నిర్మాత. ‘‘కొత్తతరం సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. కథతోపాటు రక్షిత్‌ అట్లూరి పాత్ర, నటన చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. సినిమా విజయంపై నమ్మకంగా ఉన్నామ’’ని చిత్రవర్గాలు తెలిపాయి. చరణ్‌రాజ్, కాంచి, రాకెట్‌ రాఘవ, రఘు కుంచె, కె.ఎ.పాల్‌ రాము, విద్యాసాగర్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంభాషణలు: లక్ష్మీ లోహిత్‌ పూజారి, సంగీతం: శరవణ వాసుదేవన్, కూర్పు: సత్య గిద్దుటూరి, కళ: నాని.టి. 


భయపెట్టే ‘రాచరికం’ 

అప్సరారాణి, విజయ్‌ శంకర్, వరుణ్‌ సందేశ్‌ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘రాచరికం’. సురేశ్‌ లంకలపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఈశ్వర్‌ నిర్మాత. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నట్టు సినీవర్గాలు తెలిపాయి. ‘‘భయపెడుతూ థ్రిల్‌ని పంచే కాన్సెప్ట్‌తో రూపొందుతున్న చిత్రమిది. అప్సరారాణి విభిన్నమైన పాత్రతో అలరిస్తుంది. వరుణ్‌ సందేశ్‌ మాస్‌ పాత్రలో సందడి చేస్తారు. అడుగడుగునా ప్రేక్షకుల్ని కట్టిపడేసే అంశాలు ఇందులో ఉంటాయి. ఇప్పటికే విడుదల చేసిన అప్సరారాణి లుక్‌కి మంచి స్పందన లభించింద’’ని సినీవర్గాలు తెలిపాయి. హైపర్‌ ఆది, రంగస్థలం మహేశ్, విజయ రామరాజు, శ్రీకాంత్‌ అయ్యంగార్, మహబూబ్‌ బాషా, రూపేష్‌ మర్రాపు, ప్రాచీ థాకర్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: వెంగి, ఛాయాగ్రహణం: ఆర్య సాయికృష్ణ, మాటలు: రామ్‌ప్రసాద్‌. 


‘జాక్‌పాట్‌’ కష్టాలు

అనామకురాలైన ఓ మహిళకు లాటరీలో అతిపెద్ద ‘జాక్‌పాట్‌’ తగులుతుంది. అక్కడ్నుంచి ఆమె జీవితంలో సంతోషాలకి బదులు ఊహించని కష్టాలు మొదలవుతాయి. తనని కిడ్నాప్‌ చేయడానికి శత్రు మూకలు ప్రయత్నిస్తారు. వాళ్ల నుంచి తనను తాను రక్షించుకోవడానికి, తన జాక్‌పాట్‌ టికెట్‌ని కాపాడుకోవడానికి ఒక లాటరీ ప్రొటెక్షన్‌ ఏజెంట్‌ని  నియమించుకుంటుందామె. ఆ శత్రువుల నుంచి ఆమెను, అతడెలా రక్షించాడు? వారిద్దరి మధ్య వచ్చే సరదా సరదా సన్నివేశాలు.. తాజాగా విడుదలైన ట్రైలర్‌లో చూపించారు. జాక్‌పాట్‌ విజేతగా ఆక్వాఫినా కనిపించగా.. ఏజెంట్‌ పాత్రని ప్రముఖ నటుడు, రెజ్లర్‌ జాన్‌ సెనా పోషించారు. ఈ యాక్షన్‌ కామెడీ థ్రిల్లర్‌ని పాల్‌ ఫీగ్‌ తెరకెక్కించారు. సిము లియు, మషీన్‌గన్‌ కెల్లీ ఇతర కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం ఆగస్టు 15న విడుదలవుతోంది.


తరతరాల మమకారం

రామ్‌ మిట్టకంటి, పవిత్ర, కస్వి ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం ‘చిట్టి పొట్టి’. భాస్కర్‌ యాదవ్‌ దాసరి దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్నారు. అన్నా చెల్లెల అనుబంధం నేపథ్యంలో సాగే కథ ఇది. త్వరలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు సినీవర్గాలు తెలిపాయి. ‘‘ప్రతి ఇంట్లో ఆడపిల్ల విలువని తెలియజేసే చిత్రమిది. చెల్లెలిగా, మేనత్తగా, బామ్మగా... ఎన్ని తరాలైనా సరే ఒక ఆడబిడ్డకి పుట్టింటిపైన ఉండే ప్రేమ, మమకారాన్ని తెలిపే ఈ కథ మనసుల్ని హత్తుకుంటుంది. ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రానికి విశేష స్పందన లభిస్తోంద’’న్నారు దర్శకనిర్మాత. కాంతమ్మ, ఆచారి, హర్ష, సతీశ్, రామకృష్ణ, సరళ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: శ్రీ వెంకట్, ఛాయాగ్రహణం: మల్హర్‌భట్‌ జోషి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని