సుహాస్‌.. ‘జనక అయితే గనక’!

ఇటీవలే ‘ప్రసన్న వదనం’ చిత్రంతో ప్రేక్షకుల్ని మెప్పించారు సుహాస్‌. ఇప్పుడాయన హీరోగా సందీప్‌రెడ్డి బండ్ల దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. దిల్‌రాజు ప్రొడక్షన్స్‌ పతాకంపై హర్షిత్‌ రెడ్డి, హన్షిత సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Published : 03 Jul 2024 00:47 IST

టీవలే ‘ప్రసన్న వదనం’ చిత్రంతో ప్రేక్షకుల్ని మెప్పించారు సుహాస్‌. ఇప్పుడాయన హీరోగా సందీప్‌రెడ్డి బండ్ల దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. దిల్‌రాజు ప్రొడక్షన్స్‌ పతాకంపై హర్షిత్‌ రెడ్డి, హన్షిత సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి ‘జనక అయితే గనక’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు మంగళవారం ఫస్ట్‌లుక్‌ విడుదల చేశారు. ఆ ప్రచార చిత్రంలో సుహాస్‌ పలక పట్టుకొని ఓరగా ఒక కన్నుతో చూడటం.. బ్యాగ్రౌండ్‌లో న్యాయదేవత బొమ్మ, చిన్నపిల్లల స్కూల్‌ బ్యాగ్, బస్‌ లాంటివి కనిపించడం ఆసక్తికరంగా ఉంది. దీన్ని బట్టి ఇదొక వైవిధ్యభరితమైన కథాంశంతో తెరకెక్కుతున్నట్లు అర్థమవుతోంది. ఈ చిత్ర టీజర్‌ ఈనెల 4న విడుదల కానుంది. సంగీతం: విజయ్‌ బుల్గానిన్, ఛాయాగ్రహణం: సాయి శ్రీరామ్‌.


విభిన్న ప్రయత్నం.. ‘విరాజి’ 

నింద’ చిత్రంతో ఇటీవలే సందడి చేశారు వరుణ్‌సందేశ్‌. ఆయన కథానాయకుడిగా ‘విరాజి’ అనే మరో చిత్రం రూపొందుతోంది. ఆద్యంత్‌ హర్ష దర్శకత్వం వహిస్తుండగా, మహేంద్రనాథ్‌ కూండ్ల నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో చిత్రబృందం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి, సినిమా పేరుని ప్రకటించింది. వరుణ్‌ సందేశ్‌ మాట్లాడుతూ ‘‘నా 17 ఏళ్ల కెరీర్‌లో ఎప్పుడూ చేయని ఓ విభిన్నమైన ప్రయత్నం ఈ చిత్రం. దర్శకుడు హర్ష చెప్పిన కథ నా ఊహకు అందలేదు. ద్వితీయార్ధంలోకి వచ్చేసరికి రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఈనెల 10న ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తాం. మేమంతా కలిసి తపనతో ఈ సినిమా చేశాం’’ అన్నారు. ‘‘వరుణ్‌సందేశ్‌ని సరికొత్తగా ఆవిష్కరించే పాత్ర ఇది. చాలా బాగా ఒదిగిపోయార’’న్నారు దర్శకుడు. ఈ కార్యక్రమంలో ప్రమోదిని, రఘు కారుమంచి, ఫణి, ఎబినెజర్‌ పాల్‌ తదితరులు పాల్గొన్నారు.


అక్టోబరులో 360వ చిత్రం 

లైకోటై వాలిబన్‌’తో మంచి విజయాన్ని అందుకున్న అగ్ర కథానాయకుడు మోహన్‌లాల్‌ ప్రస్తుతం తన 360వ సినిమా చిత్రీకరణలో ఉన్నారు. దీన్ని తరుణ్‌ మూర్తి తెరకెక్కిస్తున్నారు. మోహన్‌లాల్‌ సరసన సీనియర్‌ కథానాయిక శోభన నటిస్తోంది. యాక్షన్‌ థ్రిల్లర్‌గా తీర్చిదిద్దుతున్న ఈ చిత్రాన్ని అక్టోబరులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ముగింపు దశ చిత్రీకరణలో ఉన్న సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలను వేగంగా పూర్తి చేసి అనుకున్న తేదీకి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది చిత్రబృందం. ఇందులో ట్యాక్సీ డ్రైవర్‌ పాత్రలో కనిపించనున్నారు మోహన్‌లాల్‌. రెజపుత్ర విజువల్‌ మీడియా పతాకంపై ఎమ్‌.రెంజిత్‌ నిర్మిస్తున్నారు.


వినోదం.. భావోద్వేగాలున్న కథ 

రాజ్‌తరుణ్‌ హీరోగా ఎ.ఎస్‌.రవికుమార్‌ చౌదరి తెరకెక్కించిన చిత్రం ‘తిరగబడరసామీ’. మల్కాపురం శివకుమార్‌ నిర్మించారు. మాల్వి మల్హోత్రా కథానాయిక. మన్నారా చోప్రా, మకరంద్‌ దేశ్‌పాండే, జాన్‌ విజయ్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్‌లో ట్రైలర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజ్‌తరుణ్‌ మాట్లాడుతూ..‘‘ఈ చిత్రానికి అందరం ప్రాణం పెట్టి పనిచేశాం. వినోదం, భావోద్వేగాలు నిండి ఉన్న కథతో రూపొందింది. కచ్చితంగా అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది’’ అన్నారు. ‘‘అందర్నీ అలరించే చిత్రమిది. ఈ సినిమా తర్వాత రాజ్‌తరుణ్‌ మాస్‌ హీరోగా నిలబడతాడు’’ అన్నారు దర్శకుడు. నిర్మాత శివకుమార్‌ మాట్లాడుతూ.. ‘‘ఇది మా బ్యానర్‌లో మైలురాయిలా నిలిచిపోతుంది. సైలెంట్‌గా మొదలై వైలెంట్‌ ముగింపు ఉంటుంది. దీన్ని ఈనెలలోనే విడుదల చేస్తామ’’న్నారు.


వదలను నిన్ను 

లియుబా పామ్, ఖుష్బూ జైన్‌ ప్రధాన పాత్రధారులుగా... సిరాజ్‌ మెహదీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘నిన్ను వదలను’. యు.వి.టి. హాలీవుడ్‌ స్టూడియోతో కలిసి శ్రేయ ప్రొడక్షన్స్‌ పతాకంపై అశోక్‌ కుల్లర్‌ నిర్మిస్తున్నారు. గంగాధర్, వైజాగ్‌ షరీఫ్, వైజాగ్‌ రవితేజ, అజయ్, అనంత్‌ ఇతర పాత్రలు పోషిస్తున్న ప్రస్తుతం  ఈ సినిమా చిత్రీకరణ అమెరికాలో  జరుగుతోంది. ‘‘హారర్‌ అంశాలతో కూడిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. గోవా, హైదరాబాద్‌ నేపథ్యంలో సాగుతుంది. లియుబా పామ్‌ రష్యాలో పుట్టి పెరిగిన ఓ గాయని. ఆమె నిర్మాత కూడా. ఆమె తెలుగులో నటిస్తున్నారు. విభిన్నమైన కథతో రూపొందుతున్న చిత్రమిది. సెప్టెంబరులో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ’’ని సినీవర్గాలు తెలిపాయి. ఛాయాగ్రహణం: ప్రవీణ్‌ కొమరి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని