OTT Family Movies: ఫ్యామిలీతో కలిసి ఓటీటీలో మూవీస్‌ చూడాలనుకుంటున్నారా?ఇవి బెస్ట్‌ ఛాయిస్‌..!

కథా నేపథ్యం ఏదైనా కుటుంబంతో కలిసి ఓటీటీలో సినిమాలను ఆస్వాదించాలనుకుంటున్నారా? అవును అంటే ఇక్కడో లుక్కేయండి.

Updated : 02 Jul 2024 16:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ప్రేక్షకులకు వినోదం పంచేందుకు ఓటీటీ సంస్థలు పోటీపడుతున్నాయి. థియేటర్లలో ప్రదర్శితమైన చిత్రాలు, ఒరిజినల్‌ మూవీస్‌, వెబ్‌సిరీస్‌లు, షోస్‌.. ఇలా విభిన్న కంటెంట్‌ను వారికి అందుబాటులో ఉంచుతున్నాయి. అలా ఈ ఏడాదిలో ఇప్పటివరకూ వచ్చిన చిత్రాల్లో కుటుంబంతో కలిసి చూడదగ్గ చిత్రాలేవి? ఏ ఓటీటీలో ఏది స్ట్రీమింగ్ అవుతోందంటే? (OTT Family Movies in Telugu)..

నరేశ్‌.. సందడి

తనదైన శైలి కామెడీతో ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టే నటుడు అల్లరి నరేశ్‌ (Allari Naresh). అలాంటి ఆయన సీరియస్‌ చిత్రాలు చేస్తూ బిజీ అయిపోయారు. వాటికి కాస్త బ్రేక్‌ ఇచ్చి ‘ఆ ఒక్కటీ అడక్కు’ (Aa Okkati Adakku) అనే రొమాంటిక్‌ డ్రామాలో నటించారు. పెళ్లి కాక ఇబ్బందులు పడుతున్న యువతీ యువకులు మ్యాట్రిమోనీ సైట్లను ఆశ్రయించి ఎలా మోసపోతున్నారనే పాయింట్‌తో రూపొందింది. సీరియస్‌ టాపిక్‌ అయినప్పటికీ హాస్యానికి పెద్దపీట వేశారు. ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’ (Amazon Prime Video)లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

నవ్వేందుకు షరతులు లేవు!

సులభంగా డబ్బు సంపాదించొచ్చు అంటూ తన కుటుంబాన్ని మోసం చేసిన గోల్డెన్‌ ప్లేట్‌ సంస్థకు.. నీటిపారుదల శాఖలో పనిచేసే క్లర్క్‌ ఎలా బుద్ధి చెప్పాడనే కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రం ‘షరతులు వర్తిస్తాయి!’ (Sharathulu Varthisthai). సందర్భానుసారం వచ్చే హాస్యం అలరిస్తుంది. కామెడీతోపాటు భావోద్వేగాలూ పండిన ఈ సినిమాలో చైతన్యరావు (Chaitanya Rao) కథానాయకుడు. ఓటీటీ వేదిక: ఆహా (Aha).

వినోదం పంచే మాస్టర్‌

వైవా హర్ష (Harsha Chemudu) కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘సుందరం మాస్టర్‌’ (Sundaram Master). పదోన్నతిపై ఆశతో మారుమూల గ్రామానికి పాఠాలు చెప్పేందుకు వెళ్లిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు.. ఓ సమస్యలో చిక్కుకుంటాడు. దాన్నుంచి ఎలా తప్పించుకున్నాడు? ఆ ఊరి ప్రజలంతా ఇంగ్లిష్‌లోనే ఎందుకు మాట్లాడతారు? అనే ఆసక్తికర అంశాలతో కూడిన ఈ మూవీలో చక్కని సందేశం కూడా ఉంది. ‘ఆహా’ (Aha)లో స్ట్రీమింగ్ అవుతోంది.

మల్లి.. మ్యారేజి బ్యాండు 

స‌మాజంలోని అంత‌రాలు, ప‌రువు, ప్రేమ నేప‌థ్యంలో తెరకెక్కిన సినిమా ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ (Ambajipeta Marriage Band). ఓ ప్రేమకథని మించి, ఆత్మాభిమానం అంశాన్నీ ఈ చిత్రంతో బలంగా చెప్పే ప్రయత్నం చేశారు. సుహాస్‌.. మల్లిగా నటించి ఆకట్టుకున్నారు. స్ట్రీమింగ్‌ వేదిక: ఆహా.

నవ్వించేందుకు మళ్లీ వచ్చింది..

అంజలి (Anjali) ప్రధాన పాత్రలో వచ్చిన హిట్‌ చిత్రం ‘గీతాంజలి’. దానికి సీక్వెల్‌గా ఈ ఏడాది ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ (Geethanjali Malli Vachindi) విడుదలైంది. సినిమాని చిత్రీకరించేందుకు సంగీత్‌ మహల్‌కు వెళ్లిన ఓ టీమ్‌ అక్కడ ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంది? వారి కోసం గీతాంజలి ఆత్మ మళ్లీ ఎందుకు తిరిగొచ్చింది? అనే కాన్సెప్ట్‌తో ఈ హారర్‌ కామెడీ మూవీ రూపొందింది. థ్రిల్‌ పంచుతూ నవ్వులు పూయించే ఈ ఫిల్మ్‌ ‘ఆహా’, ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

కామెడీ ఏజెంట్‌  

హాస్య నటుడు వెన్నెల కిశోర్‌ (Vennela Kishore) ప్రధాన పాత్రలో తెరకెక్కిన స్పై యాక్షన్‌ కామెడీ చిత్రం ‘చారి 111’ (Chari 111). ఎప్పుడూ ఏదో ఒక గమ్మతైన తప్పు చేసే ఓ గూఢచారి పెద్ద కేస్‌ని ఎలా పరిష్కరించాడనేది కథాంశం. స్ట్రీమింగ్‌ వేదిక: అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో.

మై డియర్‌ దొంగ..

అభినవ్‌ గోమఠం (Abhinav Gomatam) ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా నేరుగా ‘ఆహా’ (Aha)లోనే విడుదలైంది. ఓ డేటింగ్‌ యాప్‌నకు కాపీ రైటర్‌గా పనిచేసే అమ్మాయి జీవితంలోకి సురేశ్‌ ఎలా ప్రవేశించాడు? దొంగ అని తెలిసినా ఎందుకు అతడితో ప్రయాణం కొనసాగించిందనేది కథాంశం. కొంత ఎమోషన్‌.. చాలా ఫన్‌ ఉందీ సినిమాలో.

ఎంటర్‌టైనర్‌ గురువాయూర్‌ అంబలనాదయిల్‌

మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఎంటర్‌టైనర్‌ ‘గురువాయూర్‌ అంబలనాదయిల్‌’ (Guruvayoor Ambalanadayil). బాక్సాఫీసు వద్ద రూ. 90 కోట్ల కలెక్షన్స్‌ రాబట్టిన ఈ సినిమా ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్‌’లో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని